Ganja Chocolates: మీ పిల్లలు చాక్లెట్ తింటున్నారా.. రోజూ అవే చాక్లెట్స్ కావాలంటూ మారాం చేస్తున్నారా.. అయితే తస్మాత్ జాగ్రత్త. చాక్లెట్ తరహాలో ఎన్నో మత్తు పదార్థాలు మీ పిల్లల చెంతకు చేరే అవకాశం ఉంది. మీ పిల్లలు తినే చాక్లెట్స్ మీరే స్వయంగా చెక్ చేసి ఇవ్వడం మంచిదంటున్నారు పోలీసులు. వారి ప్రకటన వెనుక పెద్ద కారణమే ఉంది. అందుకే ప్లీజ్ బీ అలర్ట్. అయితే ఇంతలా పోలీసుల ప్రకటన వెనుక ఉన్న ఆ కారణం ఏమిటో తెలుసుకుందాం.
ఏపీలో మత్తు పదార్థాల వినియోగంపై పోలీసులు దృష్టి సారించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం కూడా గంజాయి, డ్రగ్స్ వంటి వాటిని కూకటివేళ్లతో పెకిలించేందుకు ఈగల్ ను ఏర్పాటు చేసింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ గంజాయి వాసన వస్తే అక్కడ పోలీసులు వాలుతున్నారు. ఎవరైనా గంజాయి వంటి మత్తు పదార్థాలను రవాణా చేసినా, విక్రయించినా చట్టరీత్యా కఠినచర్యలు ఉంటాయని సాక్షాత్తు సీఎం చంద్రబాబు ప్రకటించారు. దీనితో పోలీసుల వేట మరింత ముమ్మరంగా సాగుతోంది. ఈ దశలోనే ఓ పెద్ద ముఠాను పల్నాడు జిల్లా పోలీసులు పట్టుకున్నారు.
పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఒరిస్సాకు చెందిన ఉదయానంద్ చిన్న బడ్డీ కొట్టు నిర్వహిస్తున్నాడు. ఆ బడ్డీ కొట్టు ఏర్పాటు చేసుకున్న ఉదయానంద్ చిన్నగా గంజాయి విక్రయాలు కూడ ప్రారంభించి జోరుగా సాగిస్తున్నాడు. అది కూడా చాక్లెట్స్ రూపంలో విక్రయాలు జరపడం విశేషం. ఇక్కడ ఎందరో చిన్నారులు కూడా కొనుగోలు చేసేవారట. మరి విక్రయించాడో లేదో కానీ పోలీసులు మాత్రం నిఘా ఏర్పాటు చేసి రెడ్ హ్యాండెడ్ గా అతడిని పట్టుకున్నారు. ఇక్కడ దొరికిన చాక్లెట్స్ లో 14 శాతం గంజాయి ఉందని తాము గుర్తించామని, అలాగే గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు.
10 నెలల క్రితం బ్రతుకు జీవుడా అంటూ నరసరావుపేటకు వచ్చిన ఉదయానంద్ చేస్తున్న వ్యాపారం తెలుసుకున్న స్థానికులు బిత్తరపోయారు. అసలు ఇంకా పెద్ద ముఠా ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో తమ పూర్తి దర్యాప్తు సాగుతుందని పల్నాడు పోలీసులు తెలిపారు. ఏదిఏమైనా చిన్నారులు ఇష్టంగా చాక్లెట్స్ ని కూడా మత్తు పదార్థాలుగా మార్చారంటే, మనం తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సిందే.
కూలీలు, విద్యార్థులే టార్గెట్.. గంజాయి చాక్లెట్ల గుట్టురట్టు
పల్నాడు జిల్లా నరసరావుపేటలో గంజాయి, గంజాయి చాక్లెట్ల విక్రయం
నిందితుడు ఉదయానంద్ ను అరెస్టు చేసిన పోలీసులు
ఒడిశాకు చెందిన ఉదయానంద్ అక్కడి నుంచి గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు చెప్పిన పోలీసులు@Palnadu_Police… pic.twitter.com/4wlSGsgzoY
— BIG TV Breaking News (@bigtvtelugu) December 2, 2024