Notice To Ysrcp Office: తాడేపల్లిలో వైసీపీ కార్యాలయానికి మరోసారి నోటీసులు ఇచ్చారు పోలీసులు. ఒకే రోజు రెండుసార్లు మాజీ సీఎం జగన్ చుట్టూ అగ్ని ప్రమాద ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే ఘటన జరిగిన తర్వాత తొలిసారి నోటీసులు ఇచ్చారు. ఆ పార్టీ నుంచి ఎలాంటి కదలిక రాలేదు. దీంతో మరోసారి నోటీసులు ఇచ్చారు.
ఘటన జరిగిన రోజు మాజీ సీఎం జగన్ మీడియా సమావేశం పెట్టారు. దాదాపు రెండుగంటలపాటు మీడియాతో మాట్లాడారు. అదే రోజు పార్టీ ఆఫీసుకు వచ్చిన సందర్శకులు, నేతల జాబితా ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. అంతేకాకుండా ఇంటి చుట్టూ ఉన్న సీసీ కెమెరాల డేటా స్టోర్ అయ్యే హార్డ్ డిస్క్ ఇవ్వాలన్నారు.
వైసీపీ పార్టీ కార్యాలయం సమీపంలో ఈనెల ఐదున రెండు అగ్ని ప్రమాదం ఘటనలు జరిగాయి. ఒకటి మధ్యాహ్నం వేళ జరగింది. మరొకటి రాత్రి వేళ జరిగింది. అదే రోజు మద్యం కేసులో ప్రత్యేకంగా సిట్ వేసింది చంద్రబాబు సర్కార్. ప్రభుత్వం ప్రకటన వచ్చిన కొద్ది గంటల్లో ప్యాలెస్ చుట్టూ మంటలు రేగాయి.
దీంతో అనుమానాలు మొదలయ్యాయి. లిక్కర్ వ్యవహారానికి సంబంధించి పేపర్లు, డైరీలను తగలబెట్టారంటూ మరుసటి రోజు ఎక్స్ వేదికగా ప్రస్తావించింది టీడీపీ. ఈ క్రమంలో వైసీపీ నేతల గుండెల్లో గుబులు మొదలైంది. మద్యం వ్యవహారంపై నిజాలు బయటకు తీసేందుకు సిట్ వచ్చేస్తోందని రాసుకొచ్చింది.
ALSO READ: జగన్‌కు విజయమ్మ, షర్మిల కౌంటర్.. రాజకీయ కారణాలతో ఈ పని
జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఆ ఇంటి చుట్టూ ఆంక్షలు విధించారు. కొత్త ప్రభుత్వం రావడంతో ఆ ఇంటి చుట్టూ ఉన్న ఆంక్షలను ప్రభుత్వం ఎత్తేసింది. రక్షణ వలయాన్ని తొలగించింది. తాడేపల్లిలో ఆ ప్రాంతం విజిటింగ్ ప్రాంతంగా మారిపోయింది. ఆ దారిలో వెళ్లే ప్రజలు జగన్ ఇంటి వద్ద ఆగి సెల్ఫీలు తీసుకున్నారు.
జరుగుతున్న అగ్ని ప్రమాద ఘటనలపై రకరకాల వాదనలు ఇంకా వినిపిస్తున్నాయి కూడా. ఎండుగడ్డిపై నిప్పు రవ్వ పడడంతో ప్రమాదం సంభవించిందని తొలుత భావించారు. అదే రోజు రాత్రి మరొకటి జరగడంతో వెంటనే పోలీసులు ఎంట్రీ ఇచ్చేశారు. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు.ప్రమాదం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది వైసీపీ. కాకపోతే సీసీ టీవీ ఫుటేజ్‌ని పోలీసులకు ఇవ్వడానికి నిరాకరించింది.
దీనిపై పలు అనుమానాలు మొదలయ్యాయి. జరుగుతున్న పరిణామాలు గమనించారు మంగళగిరి పోలీసులు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని జగన్ నివాసం, వైసీపీ ఆఫీసు ఉన్న ప్రాంతంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటిని మంగళగిరి పోలీసుస్టేషన్‌కు అనుసంధానం చేశారు కూడా. ఈ లెక్కన వైసీపీ ఆఫీసు, జగన్ ఇంటి వద్ద ఎలాంటి అలజడి జరిగినా మంగళగిరి పోలీసులు తెలియడం ఖాయమన్నమాట.
నిజానికి ఈ పని ప్రభుత్వం వచ్చిన కొత్తలో చేస్తే బాగుండేదన్నది కొందరు టీడీపీ నేతలు అన్నారు. సీసీ కెమెరాలు పెడితే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ నిఘా పెట్టారని, జగన్‌కు హాని తలపెట్టేందుకు ఇదంతా చేస్తున్నారనే ఆరోపణలు సంధించేవారు ఆ పార్టీ నేతలు. కానీ ఇప్పుడు ఆ పార్టీ నేతలు సైలెంట్ గా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత అప్పుడప్పుడు ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైల్స్ దగ్దమైన సందర్భాలు లేకపోలేదు. వాటిపై ప్రభుత్వం విచారణ చేయిస్తున్నా, ఓ కొలిక్కి వచ్చిన సందర్భం లేదు. ఈసారి తాడేపల్లి ప్యాలెస్ వద్ద రాజుకున్న నిప్పు అనేక అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు అడిగిన వివరాలు వైసీపీ ఆఫీసు ఇవ్వకుంటే తర్వాత ఏం జరుగుతుందో చూడాలి.