Borugadda Anil: అతనొక రిమాండ్ లో ఉన్న ముద్దాయి. మంగళగిరి కోర్టు అతడికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ క్రమంలో నేరుగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలి పోలీసులు. కానీ అతడికి రాచమర్యాదలు చేశారు. చివరికి ఆ పోలీసులను సస్పెండ్ చేశారు గుంటూరు రేంజ్ ఐజీ, ఎస్పీ. ఇంతకు ఆ రిమాండ్ లో ఉన్న ముద్దాయి ఎవరో కాదు వైసీపీ సానుభూతి పరుడు బోరుగడ్డ అనిల్.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో బోరుగడ్డ అనిల్ వివాదాస్పద కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు. ఏకంగా జగన్ ఆదేశిస్తే, ఎవరినినైనా లేపేస్తా అంటూ కామెంట్ చేసింది కూడా ఇతనే. అయితే పలు కేసుల్లో ఇటీవల పోలీసులు, బోరుగడ్డను అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఆ కేసుల్లో విచారణకు కూడా బోరుగడ్డ హాజరవుతున్నారు. కాగా తాజాగా తుళ్ళూరు వద్ద ఎన్నికల సమయంలో ఓ ఏఎస్ఐ పై దాడికి యత్నించిన కేసు, అలాగే డాబాపై దాడి చేసిన కేసును పోలీసులు నమోదు చేశారు.
ఈ కేసుల్లో ఇప్పటికే రిమాండ్ లో ఉన్న బోరుగడ్డ అనిల్ ను రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి పోలీస్ ఎస్కార్ట్ తీసుకువచ్చి, మంగళగిరి జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు. విచారణ నిర్వహించిన న్యాయమూర్తి, మరో 14 రోజులు రిమాండ్ విధిస్తూ తీర్పునివ్వగా పోలీసులు, రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాల్సి ఉంది. కాగా గతంలో తనకు బిర్యానీ కావాలని బోరుగడ్డ అనిల్ కోరగా పోలీసులు తిరస్కరించారని సమాచారం.
కానీ ఆ కోరికను మళ్లీ ఒకసారి బోరుగడ్డ అనిల్, పోలీసులకు తెలిపాడో ఏమో కానీ, రాజమండ్రి తరలించే క్రమంలో ఎస్కార్ట్ గా వచ్చిన పోలీసులు నిబంధనలు ఉల్లంఘించి, ఏలూరు సమీపంలోని ఓ రెస్టారెంట్ లో భోజనం చేయడానికి తీసుకెళ్లారు. అక్కడ చుట్టూ ఎస్కార్ట్ పోలీసులు, మధ్యలో బోరుగడ్డ తింటున్న వీడియోలు ఎవరో చిత్రీకరించారు. అక్కడ వీడియోలు తీస్తున్న వారిని పోలీసులు బెదిరించినట్లు సమాచారం. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నిబంధనలకు విరుద్దంగా బోరుగడ్డకు పోలీసులు రాచమర్యాదలు చేస్తున్నారంటూ సోషల్ మీడియా కోడై కూసింది.
Also Read: Nivin Pauly : లైంగిక వేధింపుల కేసులో ఊహించని ట్విస్ట్… సినిమా స్టైల్ లో క్లైమాక్స్
చిన్నగా ఈ విషయం వైరల్ గా మారగా, పోలీస్ శాఖ సీరియస్ గా తీసుకుంది. అసలు ఏమి జరిగిందని ఆరా తీసి, ఎస్కార్ట్ విధులు నిర్వహిస్తున్న ఒకరు ఆర్ఎస్సై, మరొకరు ఏఎస్సై, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్, ఇద్దరు సివిల్ పోలీసులు, ఇద్దరు ఏఆర్ పోలీసులను శాఖ పరమైన చర్యలలో భాగంగా , ఉన్నఫలంగా సస్పెండ్ చేస్తూ ఐజీ త్రిపాఠీ, ఎస్పీ సతీష్ లు సస్పెండ్ చేశారు. బిర్యానీ తిని బోరుగడ్డ కోరిక తీరిందేమో కానీ, చివరికి ఏడు మంది పోలీసులు మాత్రం సస్పెండ్ అయ్యారు.