Ayurvedam: వాతావరణం చల్లబడిందంటే బ్యాక్టీరియా, వైరస్‌లు రెచ్చిపోతాయి. వాటి కారణంగానే తరుచూ జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పి, గొంతు దురద వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. వైరల్ ఫీవర్స్ కూడా కనిపిస్తాయి. ముఖ్యంగా పిల్లల్లోనే ఇవి తరచూ బయటపడతాయి. శీతాకాలంలో వాతావరణంలో తేమచేరి పోతుంది. దీనివల్లే రకరకాల సమస్యలు వస్తాయి. అలాగే వాతావరణం చల్లబడినప్పుడు రోగనిరోధక శక్తి కూడా బలహీనంగా మారుతుంది. ఇది మనం తరచూ రోగాల బారిన పడేలా చేస్తుంది.
ఆయుర్వేదం ప్రకారం వాతావరణం చల్లబడినప్పుడు మన రోగనిరోధక శక్తిని బలంగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా బలంగా మార్చుకునేందుకు మనం కొన్ని రకాల ఆహారాలను ప్రత్యేకంగా తీసుకోవాలి. అలాగే కొన్ని జాగ్రత్తలను కూడా పాటించాలి.
ఈ పనులు చేయవద్దు
శీతాకాలంలో తడిగా ఉండే బట్టలు వేసుకోకూడదు. ఏమాత్రం తడిగా ఉన్నా వాటిని దూరంగా పెట్టాలి. పొడి బట్టలు మాత్రమే వేసుకోవాలి. బాగా చలి వేస్తున్నప్పుడు కిటికీలు, తలుపులు మూసేసి ఇంట్లోనే వెచ్చని వాతావరణం లో ఉండేందుకు ప్రయత్నించాలి. లేదా స్వెటర్లు వంటివి వేసుకొని శరీరానికి రక్షణను కల్పించాలి. చలికాలంలో ఎట్టి పరిస్థితుల్లో చల్లని పదార్థాలను తినకూడదు. వీలైనంత వరకు వేడి ద్రవాలు తాగేందుకు ప్రయత్నించాలి. వేడిగా ఉన్నప్పుడే ఆహారాన్ని తినాలి. వాతావరణం వెచ్చగా ఉంటేనే బ్యాక్టీరియా, వైరస్ వంటివి మన దరి చేరకుండా ఉంటాయి. అలాగే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ప్రతిరోజు చల్లని నీళ్లు కాకుండా గోరువెచ్చని నీటిని తీసుకుంటే గొంతు నొప్పి, జలుబు, దగ్గు వంటివి రాకుండా ఉంటాయి.
అల్లం
ఆయుర్వేదం ప్రకారం కొన్ని రకాల ఆహారాలను తీసుకోవడం ద్వారా కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మీ ఆహారంలో అల్లం కచ్చితంగా ఉండేలా చూసుకోండి. అల్లం టీ తాగడం లేదా సూపులలో అల్లం రసాన్ని లేదా దంచిన అల్లాన్ని వేసి తినేందుకు ప్రయత్నించండి. అల్లంలో ఉండే సుగుణాలు దగ్గు, జలుబుతో పోరాడే శక్తిని రోగనిరోధక వ్యవస్థకు అందిస్తాయి. కాబట్టి శీతాకాలంలో అల్లాన్ని ఆహారంలో భాగం చేసుకునేందుకు ప్రయత్నించండి.
తులసి ఆకులు
మనదేశంలో తులసి మొక్కలు అధికంగానే ఉంటాయి. హిందూ కుటుంబాలలో ప్రతి ఇంటి ముందు తులసి మొక్క ఉండాల్సిందే. ఆ తులసి ఆకుల్లో ఉండే ఔషధ గుణాలు ఇన్నీ అన్నీ కావు. తులసి ఆకులో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్స్ తో పోరాడే శక్తిని అందిస్తాయి. శ్వాస కోశవ్యవస్థను కాపాడతాయి. పొడి దగ్గు రాకుండా అడ్డుకుంటాయి. తులసి ఆకులను ప్రతిరోజూ ఆహారంలో భాగం చేసుకుంటే అన్ని రకాలుగా మేలే జరుగుతుంది. నీళ్ళల్లో కొన్ని తులసి ఆకులను వేసి మరగ కాచి వాటిని వడకట్టి ఆ నీటిని తాగేందుకు ప్రయత్నించండి. మీకు చలికాలంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు దగ్గరికి రావు.
ఉల్లిపాయ రసం
ప్రతి ఇంట్లో ఉల్లిపాయలు కచ్చితంగా ఉంటాయి. ఉల్లిలో సల్ఫర్ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. అవి పొడి దగ్గు రాకుండా అడ్డుకుంటాయి. కాబట్టి పచ్చి ఉల్లిపాయని ప్రతిరోజూ తినేందుకు ప్రయత్నించండి. లేదా ఉల్లిపాయ రసాన్ని తీసి రెండు స్పూన్లు తాగేందుకు ప్రయత్నించండి. మీకు దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.
తాజా పండ్లు కూరగాయలు
తాజా పండ్లు, కూరగాయలలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే గుణాలు ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ సి అధికంగా ఉండే కివి, స్ట్రాబెర్రీలు, టమోటోలు, కాలీఫ్లవర్, క్యాప్సికం వంటివి అధికంగా తినేందుకు ప్రయత్నించండి. ఇవి ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని కాపాడతాయి. నిమ్మరసాన్ని తాగడం వల్ల కూడా ఎంతో ఉపయోగం ఉంటుంది.
ప్రతి ఇంట్లో తేనే ఉండడం సహజం. ఉదయం లేచాక పరగడుపున ఒక స్పూను తేనెను తాగేందుకు ప్రయత్నించండి. తేనెలో ఉండే గుణాలు ఎన్నో. ఎక్కువ ఇది యాంటీబయోటిక్ లా పనిచేస్తుంది. తీవ్రమైన దగ్గు నుంచి ఉపశమనం కలిగించేందుకు తేనె ఉపయోగపడుతుంది. ఎన్నో పరిశోధనలు కూడా తేనె వల్ల లాభాలు ఉన్నాయని నిరూపించాయి.