AP Police: వైసీపీ నేతలకు కష్టాలు రెట్టింపు అయ్యాయి. కీలక నేతల చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. గడిచిన మూడు నెలలుగా వల్లభనేని వంశీని గమనించిన నేతలు, వివాదాలకు దూరంగా ఉంటే బెటరని చాలామంది నేతలు డిసైడ్ అయ్యారు. నేతలకు కార్యకర్తలు ఫోన్ చేస్తే అవుటాప్ సర్వీసు అని వస్తుందని అంటున్నారు. ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియన గింజుకుంటున్నారు ఆ పార్టీ కార్యకర్తలు.
రాజకీయాలు మారాయి.. ఇన్నాళ్లు మాదిరిగా లేవు. ఎవరు, ఎప్పుడు అధికారంలోకి వస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమికి వ్యతిరేకంగా నోరు విప్పే బదులు సైలెంట్‌గా ఉండడమే బెటరని అంటున్నారట కొందరు నేతలు. ఈ క్రమంలో తమ ఫోన్లను స్విచ్చాఫ్ చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కార్యకర్తలు ఫోన్ చేస్తే అవుటాప్ సర్వీసు అని వస్తుందని వాపోతున్నారు.
మూడు నెలల కిందట అరెస్టయిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కష్టాలు అన్నీఇన్నీ కావు. ఒక కేసు బెయిల్ వస్తే.. రెడీగా మరో కేసు తయారు అవుతుంది. తనకు ఆరోగ్యం బాగాలేదని, చికిత్స తీసుకునేందుకు బెయిల్ ఇవ్వాలని న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్నారు. చేసిన పాపాలు ఈ విధంగా ఆయనను వెంటాడుతాయని అంటున్నారు కొందరు నేతలు.
వల్లభనేని వంశీ పనైపోవడంతో కొడాలి నానిపై ఏపీ పోలీసులు దృష్టి పెట్టారు. ప్రస్తుత పరిస్థితులను గమనించిన ఆయన, విదేశాలకు వెళ్లాలనే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. లేకుంటే తన పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని భావిస్తున్నారు. కొడాలి నాని విదేశాలకు వెళ్తారన్న విషయం తెలియగానే ఏపీ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆయనపై లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు ఎయిర్‌పోర్టులు, నౌకాశ్రయాలకు ఆన్‌లైన్ ద్వారా నోటీసులను పంపారు.
ALSO READ: జగన్‌కి కౌంటర్, తారకరత్న భార్య పోస్టు.. సాయిరెడ్డికి మద్దతుగా
మాజీ మంత్రి కొడాలి నానిపై లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేశారు ఏపీ పోలీసులు. ఆయన దేశం విడిచి వెళ్లకుండా ఉండేలా ఎయిర్ పోర్టుల, నౌకాశ్రయాలకు ఆన్‌లైన్ ద్వారా నోటీసులు పంపారు. ఇటీవల ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్సిట్యూట్‌లో గుండెకు సంబంధించిన చికిత్స చేయించుకున్నారు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు వచ్చేశారు.
ఏపీలో జరుగుతున్న పరిణామాలను గమనించిన ఆయన, ఇప్పుడు పరిస్థితుల్లో విజయవాడకు వెళ్తే ఇబ్బందులు తప్పవని భావించారట. అమెరికా వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. కొడాలి నాని విదేశాలకు వెళ్లే అవకాశం ఉందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. నేతల ఫిర్యాదుతో గురువారం రాత్రి ఎల్ఓసీ నోటీసు జారీ చేశారు. దీంతో ఆయన అమెరికా వెళ్లే అవకాశం కోల్పోయారు.
కృష్ణా జిల్లా గుడివాడ పరిధిలో నానిపై పలు కేసులు నమోదయ్యాయి. వలంటీర్లతో రాజీనామాలు, ఆపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ, ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఇలా చాలానే కేసులు ఉన్నాయి. విశాఖ కేసుకు సంబంధించి మాత్రమే నాని ముందస్తు బెయిల్ పొందారు. గుడివాడలో జగనన్న కాలనీకి సంబంధించిన విషయంలో కేసు నమోదు అయ్యింది. కొడాలి నాని అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో ఆయన కదలికపై నిఘా పెట్టాలని డీజీపీకి టీడీపీ కార్యదర్శి శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. ఆరేళ్ల కిందట కొడాలి నాని పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. కాకపోతే పలు కేసులు ఉండడంతో తిరస్కరించారు. వైసీపీ హయాంలో ఆయనకు పాస్‌పోర్టు రాలేదు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా లుక్‌అవుట్ నోటీసులు ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. మొత్తానికి నాని వ్యవహారం ఏపీ రాజకీయాల్లో చర్చకు దారి తీసింది.