AP Police on Ganja : కొన్నేళ్లుగా ఏపీ (AP), తెలంగాణాతో (Telangana) సహా దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడ గంజాయి దొరికినా.. వాటి మూలాలు ఏపీలోని విశాఖ(Visakh) మన్యం జిల్లాలల్లో తేలుతున్నాయి. దాంతో.. ఇక్కడి గంజాయి(Ganja) సాగును పూర్తిగా నిర్మూలించేందుకు చర్యలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం(State Governament).. సరికొత్త ఆలోచనలు చేస్తోంది. ఇప్పటికే.. క్షేత్రస్థాయిలో అనేక చర్యలు చేపట్టిన అధికారులు.. సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఆదేశాలతో నూతన సాంకేతికత వినియోగానికి సిద్ధమయ్యారు. కొన్ని చోట్ల ప్రయోగాత్మక పరీక్షలు నిర్వహించి.. మంచి ఫలితాలు అందుకున్నారు. దాంతో.. గంజాయి సాగు ఎక్కువగా ఉన్న మన్యం జిల్లాల్లో మరింత విస్తృతంగా చర్యలు చేపట్టనున్నారు.
అటవి మధ్యలో.. నడక మార్గాలు సైతం కష్టంగా ఉన్న చోట్ల గంజాయిని పండిస్తున్నారు. చట్టవిరుద్ధమని ఎన్నిసార్లు చెప్పినా, యువత జీవితాల్ని నాశనం చేస్తుందని హెచ్చరించినా.. కాసుల కక్కుర్తితో వినిపించుకోవడం లేదు. దట్టమైన మన్యం ప్రాంతంలో ఎవరు వస్తారులే అనే ధైర్యంతో గంజాయిని విచ్చలవిడిగా పండిస్తున్నారు. అలాంటి వాళ్లకు టెక్నాలజీతో చెక్ పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది.
పోలీసులు వెళ్లేందుకు కష్టమైన అటవీ ప్రాంతాల్లోని సాగుని పరిశీలించేదుకు ఏపీ పోలీసులు.. డ్రోన్లను (Drones) వినియోగించనున్నారు. అవును.. కొండలు, గుట్టలు.. కష్టమైన కాలిబాటలున్న ప్రాంతాల్లో డ్రోన్లను వినియోగించి సాగు చేస్తున్న పంటల్ని పరిశీలించనున్నారు. సాంకేతికత వినియోగంలో ముందుండే సీఎం చంద్రబాబు.. రాష్ట్రంలో గంజాయి సాగు చేసేందుకు వీలు లేదంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దాంతో.. డ్రోన్లతో గంజాయి సాగు కట్టడికి కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇప్పటికే.. అనకాపల్లి జిల్లాలో (Anakapalli District) 3 ఎకరాల్లో సాగు చేస్తున్న గంజాయి పంటను డ్రోన్ల సాయంతో అధికారులు గుర్తించి ధ్వంసం చేశారు. జి.మాడుగుల మండలం సొలభం పంచాయతీ డేగలరాయి గ్రామ పరిధిలో 5 ఎకరాల్లోని గంజాయి పంటను డ్రోన్ల ద్వారానే గుర్తించిన పోలీసులు.. వెంటనే అక్కడికి చేరుకుని గంజాయి పంటని ధ్వంసం చేశారు.
మన్యం జిల్లాల్లోని పరిస్థితుల్ని గంజాయి సాగుకు అనుకూలంగా డ్రగ్స్ మాఫియా మార్చుకోగా.. టెక్నాలజీతో వారి ఆటలు కట్టడి చేసేందుకు పోలీసులు, నార్కోటక్ బ్యూరో అధికారులు సిద్ధమయ్యారు. ఇందుకోసం.. సాధారణ డ్రోన్లను కాకుండా.. హై డెఫినీషన్ చిత్రాలను తీసే మల్టీ స్పెక్ట్రల్ కెమేరాలను వినియోగించనున్నారు. ఇవి.. 3 అడుగులు పెరిగిన చిన్న మొక్కల్ని కూడా గుర్తించగలవని అధికారులు తెలుపుతున్నారు. దాంతో పాటే.. గంజాయి మొక్కలను గుర్తించేందుకు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (NCB).. గూగుల్ సహాయంతో హాట్ స్పాట్ ల ద్వారా గంజాయి సాగును గుర్తించనున్నారు.
Also Read : మంత్రి అనిత మాస్ పంచ్.. రూ.11లకు పందాలు కడుతున్నారు!
ఇలా.. ఓ వైపు సాగుదారులు, సరఫరాదారులపై కఠిన చట్టాలను ప్రయోగించడం, మరోవైపు నేరుగా సాగు క్షేత్రాలనే లక్ష్యంగా చేసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. ఇన్నాళ్లు విచ్చలవిడిగా సాగిన గంజాయి సాగుకు అన్ని మార్గాల ద్వారా అడ్డుకట్టవేయాలని.. తద్వారా గంజాయి, డ్రగ్స్ వినియోగానికి రాష్ట్ర యువతను దూరంగా ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.