జగన్ పరామర్శ యాత్రలు ఎందుకు చేస్తున్నారు..?
నిజంగానే బాధితుల్ని పరామర్శించడానికా..?
ఆ పేరుతో జనంలోకి వెళ్లి రెచ్చగొట్టడానికా..?
మందీ మార్బలందో రోడ్లపై ర్యాలీలు చేసి బలప్రదర్శన చేయడానికా..?
పరామర్శలంటూ జగన్ రోడ్లపైకి వచ్చిన ప్రతిసారీ ఏదో ఒక అలజడి జరుగుతూనే ఉంది. రాయలసీమ పర్యటనలో ఏకంగా హెలికాప్టర్ దగ్గరకు జనం దూసుకు రావడంతో జగన్ రోడ్డు మార్గంలో వెళ్లిపోవాల్సి వచ్చింది. సత్తెనపల్లిలో ఒక వ్యక్తి చనిపోయాడని ఏడాది తర్వాత జగన్ పరామర్శకు వస్తే ఆ రోడ్ షో ఎఫెక్ట్ తో ముగ్గురు చనిపోవడం నిజంగా విచారకరం. అందుకే జగన్ పర్యటనలను వైసీపీ నేతలు మినహా ఎవరూ స్వాగతించడం లేదు. సాధారణ జనాన్ని ఇబ్బంది పెట్టేలా జగన్ చేస్తున్న పర్యటనలకు అనుమతులు ఇవ్వడానికి కూడా పోలీసులు తటపటాయిస్తున్నారు. రెంటపాళ్ల పర్యటనలో ముగ్గురు చనిపోయిన తర్వాత జగన్ పర్యటనలు మరింత సంచలనంగా మారాయి. అయినా కూడా ఆయన తగ్గేది లేదంటున్నారు.
నెల్లూరు క్యాన్సిల్..
ఇటీవల నెల్లూరు పర్యటనకు జగన్ ఏర్పాట్లు చేసుకున్నారు. జైలులో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డిని కలవడం, ఆ తర్వాత ఆయన కుటుంబాన్ని పరామర్శించడం ఆ పర్యటన లక్ష్యం. జైలు పక్కనే హెలిప్యాడ్ కూడా రెడీ చేసుకోవచ్చని పోలీసులు వైసీపీ నేతలకు సూచించారు. కానీ దానివల్ల ఆ పార్టీకి ప్రయోజనం కనపడలేదు. జైలు పక్కనే హెలికాప్టర్ లో దిగి, వెంటనే కాకాణిని పరామర్శించి, తిరిగి హెలికాప్టర్ ఎక్కి జగన్ వెళ్లిపోతే ఏం మజా ఉంటుందని అనుకున్నారు. అందుకే ఆ పర్యటన క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు చిత్తూరు పర్యటనకు జగన్ రెడీ అవుతున్నారు. ఇక్కడ కూడా పరిస్థితులు అనుకూలంగా లేవు. పోలీసులు జగన్ టూర్ పై ఆంక్షలు విధించారు. రోడ్ షో లో పెద్ద ఎత్తున వాహనాలు తీసుకు రావొద్దన్నారు. ఆయన వెంట ఉంటే అనుచరుల సంఖ్య కూడా పరిమితంగా ఉండాలన్నారు. దీంతో ఓ దశలో జగన్ చిత్తూరు పర్యటన కూడా రద్దవుతుందనే అనుమానాలు ఏర్పడ్డాయి.
ఆరు నూరైనా..
నెల్లూరు లాగా చిత్తూరు పర్యటన కూడా క్యాన్సిల్ అయితే జనంలో వైసీపీ పలుచన అవుతుందని అనుమానిస్తున్నారు ఆ పార్టీ నేతలు. చిత్తూరు పర్యటన కచ్చితంగా నిర్వహించి తీరుతామంటున్నారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం గ్రామంలో ఈనెల 9న జగన్ పర్యటించాల్సి ఉంది. పోలీసులు అనుమతి లేదంటున్నారని, అయినా జగన్ వచ్చి తీరుతారని చెప్పారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. చిత్తురూలో రైతులకు భరోసా ఇచ్చేందుకే జగన్ వస్తున్నారని అన్నారాయన. పోలీసులు, టీడీపీ నేతలు జగన్ పర్యటన అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రజా సముద్రాన్ని ఎవరూ అడ్డుకోలేరని, రాష్ట్రంలోనే అత్యధిక ప్రజాదరణ ఉన్న నేత జగన్ అని చెప్పారాయన. జగన్‌కు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. ఇప్పటికే వైసీపీ నేతలపై కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని, జగన్ పర్యటనను అడ్డుకోవాలని చూస్తే సహించేది లేదన్నారు భూమన.
జగన్ మోహన్ రెడ్డి గారి పర్యటనను ఆపలేరు. ప్రజాసముద్రాన్ని ఆపలేరు.
వైయస్ జగన్ పర్యటన ఉంటే వేలాదిగా ప్రజలు తరలివస్తారు. ప్రతిపక్ష నేతకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది, పోలీసులదే.-భూమన కరుణాకర్ రెడ్డి గారు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు, వైయస్ఆర్ సీపీ అధికార… pic.twitter.com/GYaFVpEH6O
— YSR Congress Party (@YSRCParty) July 5, 2025
కేవలం రాజకీయ స్వలాభం కోసమే జగన్ పర్యటనపై వైసీపీ నేతలు పట్టుబడుతున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. పోనీ జగన్ ఏమైనా రాష్ట్రంలోనే ఉండి జనాల్ని కలుస్తున్నారా అంటే అదీ లేదు. వారమంతా బెంగళూరులో ఉంటారు, వారాంతాల్లో మాత్రం ఏపీకి వచ్చి యాత్రలు చేస్తుంటారని విమర్శిస్తున్నారు. నెల్లూరు పర్యటన సింపుల్ గా క్యాన్సిల్ అయింది కానీ, చిత్తూరు పర్యటన విషయంలో మాత్రం రచ్చ జరిగేలా ఉంది.