BigTV English

Why Not Pulivendula: వైనాట్ కుప్పం.. వైనాట్ పులివెందుల

Why Not Pulivendula: వైనాట్ కుప్పం.. వైనాట్ పులివెందుల

పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ ఓటమితో ఆ పార్టీ నష్టపోయిందేంటి? పోనీ ఆ గెలుపుతో టీడీపీ సాధించిందేంటి? లాభ నష్టాల సంగతి బేరీజు వేసే కంటే, ఇగో శాటిస్ఫాక్షన్ కి ఇక్కడ ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. అవును, వైనాట్ కుప్పం అంటూ గతంలో జగన్ కాస్త అత్యుత్సాహం ప్రదర్శిస్తే, ఇప్పుడు వైనాట్ పులివెందుల అంటూ దెబ్బకొట్టిమరీ చూపించారు టీడీపీ నేతలు.


అలా మొదలైంది..
వాస్తవానికి పులివెందులలో గెలవాలని టీడీపీకి, కుప్పం ఏరియాలో గెలవాలని వైసీపీకి ఉండదు. ఎందుకంటే ఆ ఏరియాలో వాళ్లు పవర్ ఫుల్, ఈ ఏరియాలో వీళ్లు పవర్ ఫుల్. ఒకరి ఏరియాలో ఇంకొకరు రెచ్చిపోవాలని, విజృంభించాలని అనుకోరు. స్థానిక పరిస్థితులను బట్టి, సమయానుకూలంగా ప్రవర్తిస్తుంటారు. కానీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో వచ్చిన ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఆ ఎన్నికల్లో కుప్పం మున్సిపాల్టీని సైతం వైసీపీ కైవసం చేసుకుంది. కుప్పం నియోజకవర్గంలోని జడ్పీటీసీలు, ఎంపీటీసీ స్థానాల్లో కూాడ వైసీపీ జయకేతనం ఎగురవేసింది. కుప్పం నియోజకవర్గం ఉన్న చిత్తూరు జిల్లా విషయానికి వస్తే ఆ జిల్లాలో 65 స్థానాలకు 65 జడ్పీటీసీ స్థానాలు వైసీపీ గెలుచుకుంది. అందులో 33 ఏకగ్రీవాలు కావడం విశేషం. సహజంగానే ఆ గెలుపు ఇచ్చిన ఉత్సాహంతో 2024 అసెంబ్లీ ఎన్నికల వేళ జగన్ కాస్త అత్యుత్సాహం ప్రదర్శించారు. వైనాట్ కుప్పం అన్నారు, వైనాట్ మంగళగిరి అన్నారు, వైనాట్ పిఠాపురం అంటూ పవన్ ని కూడా ఓడిస్తామన్నారు. కానీ చివరకు వైసీపీయే చతికిలపడింది.

పులివెందులపై ఎందుకంత పంతం..?
పిలివెందులపై టీడీపీ పంతం పట్టిందా..? అసలు పులివెందులలో ఎలాగైనా గెలవాలని టీడీపీ ఎప్పుడూ అనుకోలేదు. అదే నిజమైతే గత 30 ఏళ్లుగా అక్కడ వైఎస్ఆర్ ఫ్యామిలీ నిలబెట్టిన అభ్యర్థే ఎందుకు జడ్పీటీసీ అవుతారు. ఎక్కువసార్లు ఎందుకు ఏకగ్రీవాలవుతాయి. 2014 నుంచి 2019 మధ్యకాలంలో కూడా పులివెందులలో టీడీపీ బలప్రదర్శన చేయాలని అనుకోలేదు. కానీ 2019 తర్వాత వైసీపీ చేసిన పనులే ఆ పార్టీకి పులివెందులలో డిపాజిట్లు రాకుండా చేశాయని అంటున్నారు. ముఖ్యంగా కుప్పంను వారు టార్గెట్ చేసుకుని, చంద్రబాబుని ఇబ్బంది పెట్టాలనుకున్నారు. కుప్పం నియోజకవర్గ పరిధిలో జరిగిన స్థానిక ఎన్నికల్లో భారీగా దొంగఓట్లు వేయించారని, ఆ బాధ్యత అప్పటి మంత్రి పెద్దిరెడ్డి తీసుకున్నారని అంటారు. ఆ తర్వాత ఏకంగా కుప్పం సీటునే లాగేసుకోవాలని చూశారు జగన్. కుప్పంలోని వైసీపీ నేతలకు భారీ ఆఫర్లు ఇచ్చారు కూడా. కానీ ఆయన అంచనాలు తప్పాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ మెజార్టీ చూసుకుని వైసీపీ రెచ్చిపోయిందే, దాన్ని 2024 ఎన్నికల నాటికి తగ్గించేశారు చంద్రబాబు. అయితే ఇక్కడ చంద్రబాబు ఇగో హర్ట్ అయింది. నా కుప్పం జోలికొస్తే, నీ పులివెందులను నేనెందుకు వదిలిపెడతానని అనుకున్నారాయన. ఇదిగో ఇలా అవకాశం కలసి రాగానే పులివెందులలో జగన్ కి టీడీపీ షాకిచ్చింది.


వైనాట్ పులివెందుల అంటూ టీడీపీ రంగంలోకి దిగింది. అది కేవలం జడ్పీటీసీ ఉప ఎన్నికే అయినా మంత్రులు సైతం రంగంలోకి దిగారు, ఇంటింటికీ తిరిగి ప్రచారం చేపట్టారు. టీడీపీ గెలుపు బాధ్యతను భుజానికెత్తుకున్నారు. కరడుగట్టిన జగన్ అభిమానులు కూడా ఈసారి టీడీపీతో పోటీ పడి ఎలక్షన్ చేయలేకపోయారు. వైసీపీకోసం అంత చేయాల్సిన అవసరం ఉందా అంటూ కార్యకర్తలు కూడా లైట్ తీసుకున్నారు. అవినాష్ రెడ్డిపై ఉన్న వ్యతిరేకత కూడా టీడీపీకి బాగా కలిసొచ్చింది. వెరసి పులివెందుల పులి అని చెప్పుకుంటున్న నాయకుడికి ఆ ఏరియాలోనే పరువుపోయేలా చేశారు. డిపాజిట్లు కోల్పోయే ఓటమి అంటే మాటలు కాదు. రిగ్గింగ్ అనండి, అక్రమాలు అనండి, అధికారుల తోడ్పాటు అనండి.. ఫైనల్ గా టీడీపీ గెలిచింది, వైసీపీ ఓడింది. ఇక్కడ గెలిచినవాడిదే పైచేయి. అంటే పులివెందుల ఇక ఎంతమాత్రం జగన్ అడ్డా అని అనుకోడానికి వీల్లేదు. అక్కడ కూడా పసుపు జెండా రెపరెపలాడింది. ముందు ముందు ఇంకెన్ని పంతాలు, పట్టింపులు చూడాలో తేలాల్సి ఉంది.

Related News

RTC mike announcement: మహిళలకు ఫ్రీ బస్.. మైక్ అనౌన్స్‌మెంట్స్ కండక్టర్ కొత్త కల్చర్!

Nara Lokesh: అలాంటి సినిమాలను రిలీజ్ కానివ్వం -లోకేష్ ఘాటు హెచ్చరిక

Ysrcp Silence: స్త్రీశక్తిపై వైసీపీ మౌనం.. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని ఒప్పుకున్నట్టేనా?

AP Free Bus: ఏపీలో ఫ్రీ బస్.. బస్సులో ప్రయాణించిన చంద్రబాబు, పవన్.. వారితో మహిళల మాట ఇదే!

AP weather alert: తీరప్రాంతంలో టెన్షన్ టెన్షన్.. 24 గంటల్లో అక్కడ దంచుడే!

Big Stories

×