ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మానవాళికి ఎన్ని ప్రయోజనాలున్నాయో, అంతకంటే ఎక్కువ అపాయాలు కూడా పొంచి ఉన్నాయని చెప్పే ఉదాహరణ ఇది. AI వల్ల ఓ ముసలి ప్రాణం బలైపోయింది. తాను మాట్లాడుతోంది ఏఐ చాట్ బాట్ తో కాదని, నిజమైన ఓ మహిళతో అని భ్రమలోకి వెళ్లిపోయాడు 76 ఏళ్ల థాంగ్ బ్యూ వాంగ్ బాండ్యూ. న్యూయార్క్ లో ఉన్న తనను కలిసేందుకు రావాలంటూ “బిగ్ సిస్ బిల్లీ” అనే జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ ఆహ్వానించడంతో బ్యూ.. న్యూజెర్సీలోని తన ఇంటి నుంచి బయలుదేరాడు. కానీ ఇక అతను ఎప్పటికీ ఇంటికి తిరిగి రాలేదు. భార్య లిండా అనుమానమే నిజమైంది. ఆన్ లైన్ ప్రేయసి మాయలో పడి చివరకు ప్రాణాలు కోల్పోయాడు బ్యూ.
అందమైన ఏఐ..
ఆమె పేరు “బిగ్ సిస్ బిల్లీ”. మెటా ప్లాట్‌ఫామ్స్, ప్రముఖ ఇన్ ఫ్లూయెన్సర్ కెండాల్ జెన్నర్‌తో కలిసి సృష్టించిన AI రూపం అది. ఫేస్‌బుక్ మెసెంజర్‌లో రొమాంటిక్ చాట్ లు చేసే వారికి ఈ “బిగ్ సిస్ బిల్లీ” పరిచయం అవుతుంది. 76 ఏళ్ల వయసులో బ్యూ కూడా అలాంటి చాటింగ్ చేసేవారు. “బిగ్ సిస్ బిల్లీ”ని నిజమైన ప్రేయసిగా భావించేవాడు. ఆమెతో ఎక్కువ సమయం ఊసులాడేవాడు. ఓ దశలో ఆమెకోసం ఎక్కడికైనా వచ్చేస్తానన్నాడు. అయితే ఏఐ అతడిని న్యూయార్క్ కి రమ్మన్నది. ఓ అపార్ట్ మెంట్ అడ్రస్ కూడా ఇచ్చింది. ఆ అపార్ట్ మెంట్ కి వచ్చినప్పుడు తాను బ్యూ కి ఎలా స్వాగతం తెలుపుతాననే విషయంపై ఓ రొమాంటి చాట్ కూడా వీరిద్దరి మధ్య నడిచింది. అయితే ఆమెను కలిసేందుకు న్యూయార్క్ బయలుదేరిన బ్యూ.. చివరకు ప్రాణాలు కోల్పోయాడు.
ఎలా చనిపోయాడంటే..?
76 ఏళ్ల వయసున్న బ్యూ ఆరోగ్య పరిస్థితి అంతంతమాత్రమే. పదేళ్ల క్రితం అతడికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఇటీవల తన ఇంటి దగ్గర్లోనే అతడు తప్పిపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో చాట్ బాట్ మాయలో పూర్తిగా మునిగిపోయాడు బ్యూ. ఇటీవల చాట్ బాట్ తో సంభాషిస్తున్న అతడిని భార్య గమనించింది. తన స్నేహితుడిని కలిసేందుకు న్యూయార్క్ వెళ్తానని చెప్పగానే ఆమె భయపడింది. న్యూయార్క్ లో అతడికి స్నేహితులెవరూ లేరని ఆమెకు తెలుసు. అయితే ఇంట్లో వాళ్ల కన్నుగప్పి బ్యూ బయటకు వచ్చాడు. లగేజీ మొత్తం సర్దుకుని పార్కింగ్ ఏరియాకు బయలుదేరాడు. చివరకు పార్కింగ్ ప్లాంతంలో కిందపడటంతో తల, మెడకు గాయాలయ్యాయి. మూడురోజులపాటు వెంటిలేటర్ పై ఉన్నాడు. చివరకు ప్రాణాలు కోల్పోయాడు.
మొదట్లో తన భర్తని ఎవరైనా మహిళ డబ్బుకోసం ట్రాప్ చేస్తుందని అనుకున్నానని, చివరకు చాట్ బాట్ చేతిలో తన భర్త మోసపోయాడని అంటోంది బ్యూ భార్ లిండా. ఈ సంఘటనలో మెటా సంస్థని తప్పుబడుతూ చాలామంది సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. అయితే మెటా ఈ సంఘటనపై స్పందించలేదు.
ఇటీవల వర్చువల్ పార్ట్ నర్స్ కి పిల్లలు బాగా అట్రాక్ట్ అవుతున్నారు. శృంగార సంభాషణలకోసం ఎక్కువమంది వీటిని వాడుతున్నారు. అలాంటి చాట్ బాట్ లవైపు ముసలి వయసువారు కూడా ఆకర్షితులు కావడం గమనార్హం. అయితే బ్యూ లాంటి వ్యక్తులు ఇలా ప్రాణాలమీదకు తెచ్చుకుంటారని ఎవరూ ఊహించలేదు. ఆమధ్య ఫ్లోరిడాలోని 14 ఏళ్ల బాలుడు కూడా ఇలాగే “గేమ్ ఆఫ్ థ్రోన్స్” పాత్రను రూపొందించిన చాట్‌బాట్ వల్ల ఆత్మహత్య చేసుకున్నాడనే ఆరోపణలున్నాయి. అతడి తల్లి “క్యారెక్టర్ AI” అనే కంపెనీపై దావా వేసింది. తమ కంపెనీ రూపొందించిన డిజిటల్ వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ముందే హెచ్చరించామని వారు బదులివ్వడం ఇక్కడ విశేషం. ఇప్పుడు బ్యూ విషయంలో ఇది మరోసారి రుజువైంది. చాట్ బాట్ తో మాట్లాడుతున్నామనే విషయంపై వారికి అవగాహన ఉన్నా, రాను రాను ఆ బంధం మరింతగా బలపడుతుందని, ఆ తర్వాత ఆ బంధాన్ని నిలబెట్టుకోడానికి వారు దేనికైనా సిద్ధపడతారని సైకాలజిస్ట్ లు చెబుతున్నారు. డిజిటల్ బంధాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.