AP WhatsApp Governance: దేశంలో తొలిసారి ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు మొదలయ్యాయి. ఉండవల్లి నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రి నారా లోకేశ్. ప్రజలకు అవసరమైన సేవలు అందించేందుకు, వినతులు స్వీకరించేం దుకు, అవసరమైన సమాచారం చేరవేసే ఉద్దేశ్యంతో దీన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
తొలి దశలో 161 రకాల సేవలు, రెండో దశలు 300 రకాల సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. దీని కోసం అధికారిక వాట్సాప్ నెంబర్ 95523 00009 నెంబర్ ను ప్రభుత్వం కేటాయించింది. తొలి దశలో దేవాదాయ, ఇంధన, ఆర్టీసీ, రెవిన్యూ, మున్సిపల్ శాఖల్లో వాట్సాప్ సేవలు మొదలయ్యాయి.
విద్యుత్ బిల్లులు, ఆస్తి పన్నుల వంటివి వాట్సాప్ ద్వారా చెల్లించవచ్చు. అలాగే ట్రేడ్ లైసెన్సులు, రెవిన్యూ శాఖకు సంబంధించి ల్యాండ్ రికార్డులు, సర్టిఫికెట్లు, ఆర్టీసీ టికెట్ బుకింగ్, క్యానిల్, జర్నీ రిమైండర్, ట్రాకింగ్ సర్వీసు, రిఫండ్, ఫీడ్ బ్యాక్ వంటి సేవలు పొందవచ్చు. ప్రజలకు-ప్రభుత్వానికి మధ్య ఇదొక ఫ్లాట్ ఫామ్‌గా వర్ణించారు మంత్రి లోకేష్.
ఫిర్యాదుల విషయంలో అయితే ఈ వాట్సాప్ నెంబర్‌కు మెసేజ్ చేస్తే వెంటనే ఓ లింక్ వస్తుంది. అందులో పేరు, ఫోన్ నెంబర్, చిరునామా, వినతులను పొందుపరచాలి. వెంటనే వారికి రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. వాటి ఆధారంగా తమ సమస్య ఎంతవరకు పరిష్కారం అయ్యిందో తెలుసుకోవచ్చు.
ALSO READ: విశాఖలో కేంద్ర మంత్రుల కాన్వాయ్‌కు భారీ ప్రమాదం.. ఎంపీ జీవిఎల్ కారు ధ్వంసం
ఇదేకాకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అర్హతలు గురించి వివరాలు తెలుసుకునే వీలుంది. ఇక పర్యాటక ప్రదేశాల సమాచారాన్ని వాట్సాప్‌లో పంపిస్తారు. కావాల్సిన ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని టికెట్లు, వసతి సహా అన్నీ బుక్ చేసుకోవచ్చు.
ఇవేకాకుండా ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఆదాయం, నో ఎర్నింగ్ ఇలా అనేక రకరకాలకు సంబంధించి వాట్సాప్ ద్వారా సేవలను పొందవచ్చు. ప్రతీ సర్టిఫికెట్‌కు క్యూఆర్ కోడ్ ఉంటుంది. సీఎం సహాయనిధికి చేసిన దరఖాస్తు స్టేటస్ సైతం తెలుసుకునే వీలుంది.
యువగళం పాదయాత్రలో వాట్సాప్ సర్వీసు అయితే బాగుంటుందనే ఆలోచన మొదలైందన్నారు మంత్రి లోకేష్. ఒక బటన్ నొక్కితే భోజనం వస్తుంది.. సినిమా చూస్తున్నాం.. ట్యాక్సీ వస్తుంది.. అదే బటన్ నొక్కితే ప్రభుత్వ సర్వీసులు ఎందుకు రావు అన్న ఆలోచన వచ్చిందన్నారు. అందుకే ఇవాళ ఆ తరహా సర్వీసులకు శ్రీకారం చుట్టామన్నారు.
ఒకప్పుడు ఏ విభాగానికి వారు సేవలు అందించేవారు. ఇప్పుడు అన్నీ సర్వీసులు ఒకటే ఫ్లాట్ ఫాం మీదకు రాలేదన్నారు. అక్టోబర్ 22న ఢిల్లీలో మెటాతో ఎంవోయూ జరిగింది. ఆర్టీజీఎస్‌ను సమన్వయం చేసుకుంటూ 36 శాఖలు పని చేస్తాయన్నారు.