Medical PG Regional Quota Telangana | మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) కోర్సుల్లో రాష్ట్ర కోటా కింద ‘నివాస ప్రాంత ఆధారిత’ (డొమిసైల్ బేస్డ్) ప్రవేశాలను అనుమతించలేమని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఈ నిర్ణయం రాజ్యాంగంలోని 14వ అధికరణను ఉల్లంఘించడమే అని కోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ సుధాంశు ధూలియా, జస్టిస్ ఎస్.వి.ఎన్.భట్ త్రిసభ్య ధర్మాసనం బుధవారం ఈ మేరకు కీలక తీర్పు ఇచ్చింది. పీజీ వైద్య విద్యలో నివాస ప్రాంత ఆధారిత రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని గతంలో పంజాబ్-హరియాణా హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేయగా, తొలుత ఇద్దరు సభ్యుల ధర్మాసనం హైకోర్టు తీర్పును సమర్థించింది. కేసు ప్రాముఖ్యత దృష్ట్యా దానిని ముగ్గురు సభ్యుల ధర్మాసనానికి పంపించారు. ఇప్పుడు ఆ ధర్మాసనం కూడా హైకోర్టు తీర్పునే సమర్థించింది. 64 సీట్లలో సగాన్ని చండీగఢ్ పూల్ కోసం కేటాయించడాన్ని కోర్టు తప్పుబట్టింది.
రాష్ట్ర నివాసి అనేది ప్రత్యేకంగా లేదు
‘‘దేశంలో ఎక్కడైనా నివసించేందుకు, ఏ విద్యాసంస్థలోనైనా చదువుకునేందుకు హక్కును రాజ్యాంగం ప్రసాదించింది. మనమంతా భారత భూభాగంలో నివసిస్తున్నాం. రాష్ట్ర లేదా ప్రాంతీయ నివాసి అనేది ప్రత్యేకంగా లేదు. ఉన్నది ఒక్కటే నివాస ప్రాంతం. దేశంలో ఎక్కడైనా ఉద్యోగం, వ్యాపారం, వృత్తి చేసుకునే హక్కు ఉంది. అలాగే ఎక్కడైనా చదువుకునే హక్కును కూడా రాజ్యాంగం కల్పించింది. ఒక నిర్దిష్ట రాష్ట్రంలో నివాసం ఉంటున్నవారికి రిజర్వేషన్ ప్రయోజనాలు కల్పించడాన్ని ఎంబీబీఎస్ కోర్సుల వరకే అనుమతించవచ్చు. స్పెషలైజ్డ్ వైద్యుల ప్రాధాన్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఇలాంటి రిజర్వేషన్లను పీజీ వైద్య కోర్సుల్లో కల్పించడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే’’ అని ధర్మాసనం తరఫున తీర్పును చదువుతూ జస్టిస్ ధూలియా స్పష్టం చేశారు. ఈ రిజర్వేషన్లను అనుమతిస్తే, అది అనేకమంది ఇతరుల ప్రాథమిక హక్కుల్లో చొరబడటమే అవుతుందని, వేరే రాష్ట్రానికి చెందినవారనే కారణంతో వారిని వేరుగా చూసినట్లు అవుతుందని వ్యాఖ్యానించారు. సమానత్వ హక్కును ఇది వ్యతిరేకమన్నారు. ఆయా సంస్థల ఆధారిత సహేతుక రిజర్వేషన్లు మినహా, రాష్ట్ర కోటా సీట్లను అఖిలభారత పరీక్షల్లో ప్రతిభ ఆధారంగా భర్తీ చేయాల్సి ఉంటుందని చెప్పారు. నివాస ప్రాంత ఆధారంగా ఇప్పటికే రిజర్వేషన్ పొందినవారికి ఈ తీర్పు వర్తించదని ధర్మాసనం తేల్చిచెప్పింది. అలాగే ఆ కేటగిరీలో చేరి విద్యను పూర్తిచేసినవారిపై ఇది ప్రభావం చూపదని ధర్మాసనం స్పష్టం చేసింది.
Also Read: రేవంత్ సర్కార్ జర్రంతా మమ్ముల్ని యాది తెచ్చుకోండ్రి.. ఆ ఒక్కటి చేయకండి..!
తెలంగాణపై తీవ్ర ప్రభావం
పీజీ వైద్య విద్య అడ్మిషన్లలో సుప్రీంకోర్టు స్థానిక కోటాను రద్దు చేయడంతో తెలంగాణపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో 2,700 పీజీ మెడికల్ సీట్లు ఉన్నాయి. ఇందులో 50 శాతం ఆల్ ఇండియా కోటా అమలవుతుండగా, మిగతా 50 శాతం లోకల్ కోటా అమలు చేస్తున్నారు. స్థానిక కోటా కారణంగా రాష్ట్రంలో ఎంబీబీఎస్ చదివిన విద్యార్థులకు వెయ్యికి పైగా సీట్లలో అవకాశాలు లభిస్తున్నాయి. కానీ తాజా తీర్పుతో తెలంగాణ విద్యార్థులకు అవకాశాలు తగ్గిపోతాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా పరిశీలిస్తే, ఉత్తరాది కన్నా దక్షిణాది రాష్ట్రాల్లోనే మెడికల్ కాలేజీలు, పీజీ సీట్లు ఎక్కువగా ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఆల్ ఇండియా కోటాలో జరుగుతున్న అడ్మిషన్లను పరిశీలిస్తే ఉత్తరాది విద్యార్థులే ఎక్కువగా ఉంటున్నారని చెబుతున్నారు. భవిష్యత్తులోనూ ఇదే కొనసాగితే తెలంగాణ విద్యార్థులకు నష్టం తప్పదని పేరొంటున్నారు.
స్థానిక నిపుణుల కొరత
సుప్రీంకోర్టు గతంలోనే సూపర్ స్పెషాలిటీ సీట్లలో స్థానిక కోటాను రద్దు చేసింది. తాజాగా పీజీలోనూ స్థానిక కోటాను రద్దు చేయడంతో లోకల్‌గా నిపుణుల కొరత ఏర్పడుతుందని విశ్లేషకులు చెప్తున్నారు. రాష్ట్రంలో ఎంబీబీఎస్, పీజీ, సూపర్ స్పెషాలిటీ చదివే విద్యార్థుల్లో అత్యధిక శాతం మంది తెలంగాణలోనే వైద్య సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు స్థానిక కోటా రద్దుతో పీజీ సీట్లలో ఎక్కువగా ఇతర రాష్ట్రాల వారే చేరే అవకాశం ఉంది. దీంతో పీజీ కోర్సు అయిపోయిన తర్వాత వారు తమ సొంత రాష్ట్రాలకు వెళ్లిపోతారని, దీంతో స్థానికంగా నిపుణుల కొరత ఏర్పడుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ప్రభుత్వ ఆసుపత్రులకు నోటిఫికేషన్లు వెలువడినప్పుడు దరఖాస్తు చేసే వారి సంఖ్య కూడా తగ్గుతుందని విశ్లేషిస్తున్నారు.
‘ఇన్ సర్వీస్’ కోటాపై ప్రభావం?
ప్రస్తుతం ఎంబీబీఎస్ పూర్తి చేసి, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు అందించే డాక్టర్లకు ఇన్ సర్వీస్ కోటా కింద పీజీ సీట్లలో అవకాశం కల్పిస్తున్నారు. లోకల్ క్యాటగిరీలో కన్వీనర్ కోటా కింద వచ్చే సీట్లలో ఈ రిజర్వేషన్ అమలు చేస్తున్నారు. 20 శాతం క్లినికల్ సీట్లలో, 30 శాతం నాన్ క్లినికల్ సీట్లలో ఇన్ సర్వీస్ కోటా కింద రిజర్వ్ చేశారు. సుప్రీంకోర్టు స్థానిక కోటాను రద్దు చేసిన నేపథ్యంలో ఇన్ సర్వీస్ కోటాపై ప్రభావం చూపే అవకాశం ఉంది. గతంలో సూపర్ స్పెషాలిటీ సీట్లలో ఇన్ సర్వీస్ కోటా అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తే న్యాయస్థానాలు తిరస్కరించాయి. ఒకవేళ పీజీ సీట్లలో ఇన్ సర్వీస్ కోటా రద్దు అయితే, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసేందుకు డాక్టర్లు దొరకడం కష్టం అవుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, వైద్య ఆరోగ్యశాఖ.. సుప్రీంకోర్టు తీర్పుపై క్షుణ్ణంగా అధ్యయనం చేసి, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచిస్తున్నారు.