
Pawan Kalyan today news(AP latest news) : జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏలూరులో వాలంటీర్లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఏపీ చాలామంది మహిళలు కనిపించకుండా పోతున్నారన్న ఆరోపణలపై 10 రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. వివరణ ఇవ్వకపోతే క్షమాపణ చెప్పాలని కోరింది.
ఏపీలో మహిళలు కనిపించకుండా పోతున్నారని ఏ కేంద్ర నిఘా వ్యవస్థ చెప్పిందో సమాచారం ఇవ్వాలని పవన్ ను మహిళా కమిషన్ కోరింది. తప్పిపోయిన మహిళల వివరాలు ఇవ్వాలని నోటీసుల్లోపేర్కొంది. ఆ వివరాలు తెలిపిన కేంద్ర అధికారి ఎవరు? అని ప్రశ్నించింది.
రాష్ట్రంలో మహిళల అదృశ్యాలకు వాలంటీర్లే కారణమని ఏలూరు సభలో పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన అధ్యక్షుడు చేసిన ఈ వ్యాఖ్యలపై తమకు ఫిర్యాదులు వస్తున్నాయని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు. ఈ-మెయిల్స్ ద్వారా మహిళా సంఘాలు, వాలంటీర్లు ఫిర్యాదులు చేస్తున్నారని వెల్లడించారు. పవన్ వ్యాఖ్యలు వాలంటీర్లకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందనే అనుమానం కలిగిస్తున్నాయని అన్నారు. 30 వేల మంది మహిళల మిస్సింగ్ కేసులపై లెక్క చెప్పాలని కోరారు.
మరోవైపు పవన్ వ్యాఖ్యలను ఖండిస్తూ వాలంటీర్లు నిరసనకు దిగారు. తమపై నిరాధార ఆరోపణలు చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జనసేనాని దిష్టిబొమ్మలను దహనం చేశారు. వెంటనే పవన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.