
Heavy Rains : ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. హిమాచల్‌ప్రదేశ్, జమ్మూ-కశ్మీర్, ఢిల్లీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. యమునా నదితోపాటు మరికొన్ని నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీకి వరద ముప్పు పొంచిఉంది.
ఢిల్లీలోని పాత రైల్వే బ్రిడ్జి వద్ద యమునా నదిలో నీటి మట్టం 203.33 మీటర్లకు చేరుకుంది. మరోవైపు హర్యానాలోని హతిన్ కుంద్ బ్యారేజ్ నుంచి యమునా నదిలోకి 2.79 లక్షల క్యూసెక్కుల నీటిని వదిలారు. దీంతో నీటిమట్టం బాగా పెరిగింది. నీటిమట్టం 204.50 మీటర్లకు చేరితే ఢిల్లీకి వరదల ముప్పు పొంచి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే 16 కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేశారు. ఢిల్లీ, నొయిడా, గురుగ్రామ్‌లలో విద్యాసంస్థలకు సెలవు ఇచ్చేశారు. హస్తినలో లోతట్టు ప్రాంతాలు ముంపులో ఉన్నాయి. అక్కడ నివశించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రగతి మైదాన్ టన్నెల్‌ను మూసివేశారు.
హిమాచల్‌ప్రదేశ్‌లో బియాస్ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరద ప్రవాహం దాటికి అనేక చోట్ల వంతెనలు కొట్టుకుపోయాయి. రహదారులు దెబ్బతిన్నాయి. మరోవైపు రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ ప్రకటించింది. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హిమాచల్ ప్రదేశ్ సీఎం ప్రజలకు సూచించారు. రాష్ట్రంలోని అనేక నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో గృహాలు కొట్టుకుపోవడంతోపాటు భారీ వృక్షాలు నేలకూలాయి. ఓ బస్సు నదిలో కొట్టుకుపోయింది.
ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో నదిలో ఓ బస్సు చిక్కుకుపోయింది. అందులోని ప్రయాణికులు కిటికీల నుంచి కిందకు దూకి బయటకు వచ్చాయి. స్థానికులు వారిని రక్షించారు. ఉత్తరప్రదేశ్‌లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. యూపీలోని లోతట్టు ప్రాంతాలు జలదిగ్భందంలో ఉన్నాయి. ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం రంగంలోకి దిగి వరదల్లో చిక్కుకున్నవారిని రక్షిస్తున్నాయి.