Zero fare ticket AP: ఆగస్టు 15 నుంచి ఏపీలో మహిళల కోసం పూర్తిగా ఫ్రీ బస్ స్కీమ్ అమల్లోకి రానుంది. అయితే ఈ స్కీమ్‌ను కేవలం ఫ్రీగా చూపించకుండా, ప్రతీ ఒక్కరికి దీని వల్ల ఎంత ప్రయోజనం కలిగిందో తెలిపే విధంగా రూపొందించాలనే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. మహిళలు ప్రయాణించేటప్పుడు అందించే టికెట్‌పై.. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారో, ఆ ప్రయాణం ఖర్చు ఎంత అయ్యేదో, ఆ మొత్తాన్ని ప్రభుత్వం ఎన్ని శాతాల్లో భరిస్తుందో వంటి పూర్తి వివరాలు ఇవ్వాలని సీఎం ఆదేశించారు.
‘జీరో ఫేర్ టికెట్’కి సీఎం గ్రీన్ సిగ్నల్
మహిళలకు అందించే టికెట్ పేరు ‘జీరో ఫేర్ టికెట్’. దీనిపై రూట్, దూరం, సాధారణ టికెట్ ధర, ప్రభుత్వం ఇచ్చిన రాయితీ మొత్తం వివరాలు స్పష్టంగా ఉంటాయి. ఇందువల్ల మహిళలు తాము ఎంత డబ్బు ఆదా చేసుకున్నామో ప్రత్యక్షంగా అర్థం చేసుకోవచ్చు. తాము గౌరవంగా ప్రయాణించామని కూడా భావిస్తారు. ఇది కేవలం ప్రయాణానికి టికెట్ మాత్రమే కాకుండా, ప్రభుత్వ నిబద్ధతను తెలిపే గుర్తింపుగా మారనుంది.
ప్రత్యేక సాఫ్ట్‌వేర్ సిద్ధం చేయాలని ఆదేశం
ఈ టికెట్‌ను అందించేందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను తక్షణమే అభివృద్ధి చేయాలని సంబంధిత అధికారులకు సీఎం సూచించారు. టికెట్ డిజైన్ వినియోగదారుకు పసందుగా ఉండాలని, స్పష్టంగా అర్థమయ్యేలా ఉండాలని స్పష్టం చేశారు. టెక్నాలజీ సహాయంతో డేటా క్రమబద్ధంగా నిల్వ చేసేందుకు కూడా ఈ టికెట్ కీలకంగా మారనుంది.
ఇతర రాష్ట్రాల వ్యయాలను అధ్యయనం
ఇప్పటికే తెలంగాణ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో మహిళల ఉచిత ప్రయాణ పథకాలు అమల్లో ఉన్నాయి. వాటివల్ల ఆ రాష్ట్రాలకు ఎంతమేర ఆర్ధిక భారం పడిందో సమీక్షించిన సీఎం.. రాష్ట్రంలో ఇది ఎంత వ్యయంతో అమలవుతుందో కూడా అధికారులతో చర్చించారు. అయినా సరే, సామాజిక న్యాయం కోసం ఈ పథకాన్ని బలంగా అమలు చేయాలని నిశ్చయించుకున్నారు.
ఆగస్టు 15నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయాలి
ఈ పథకం ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలులోకి రావాల్సిందేనని, ఎలాంటి వాయిదా ఉండకూడదని సీఎం అధికారులను స్పష్టం చేశారు. అందుకు అన్ని అవసరమైన చర్యలు, టెక్నికల్ సపోర్ట్, ట్రైనింగ్, టికెట్ ప్రింటింగ్ వంటి అంశాలపై సకాలంలో ముందస్తు ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు.
Also Read: Amrit Bharat Express in AP: విజయవాడ to విశాఖ అమృత్ భారత్ ట్రైన్.. ఏయే స్టేషన్లో ఆగనుందంటే?
సౌకర్యంతో పాటు గౌరవం
ఈ టికెట్ రూపకల్పనలో ఉన్న ముఖ్య ఉద్దేశ్యం.. మహిళలకు కేవలం ఉచిత ప్రయాణం కల్పించడం కాదు. ప్రభుత్వం వారిని ఎంతగా గౌరవిస్తోంది, సామాజికంగా ప్రోత్సహించేందుకు ఎంత ముందుంటుందో తెలియజేయడమేనట. మహిళలు ప్రయాణించిన ప్రతిసారి ఆ టికెట్ చూస్తే.. ఇది ప్రభుత్వ సాయంతో సాధ్యమైందని గుర్తు చేసేలా ఉంటుందట టికెట్.
ఈ పథకం అమలుతో కోట్లాది మహిళలకు ప్రయోజనం కలుగనుంది. ఉపాధికి వెళ్లే మహిళలు, విద్యార్థినులు, రోజూ ప్రయాణించే వృద్ధులు.. అన్ని వర్గాలకూ ఇది వరంగా మారనుంది. ప్రయాణ ఖర్చు నుంచి విముక్తి పొందడంతో పాటు, నెలకు వేల రూపాయలు ఆదా చేసుకునే అవకాశముంటుంది.
ఈ ‘జీరో ఫేర్ టికెట్’ ద్వారా ప్రయాణించే ప్రతీ మహిళా ప్రయాణికురాలు.. ఒక గౌరవప్రదమైన పౌరురాలిగా భావించబడుతుంది. ఇది కేవలం పథకం కాదు.. మహిళల ఆత్మగౌరవానికి ప్రభుత్వ అభివాదంగా చెప్పవచ్చు. ఆగస్టు 15 నుంచి రోడ్డు మీద ఎక్కడ చూసినా మహిళల ముఖాల్లో సంతృప్తి, గమ్యస్థానానికి చేరిన వారి పయనం వెనక కనిపించే ‘జీరో ఫేర్ టికెట్’ సాక్షిగా నిలుస్తుంది.