Pithapuram: కాకినాడ జిల్లా పిఠాపురం చిత్రాడలో జరుగుతున్న జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ గంభీర వాతావరణంలో కొనసాగుతోంది. ఈ సభలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి (Balineni Srinivasa Reddy) చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. జగన్ తనపై ఎంతటి అన్యాయాన్ని చేశాడో, తన కుటుంబాన్ని ఎలా ఇబ్బందులకు గురి చేశాడో వేదికపై ఉద్వేగభరితంగా వివరించారు. పవన్ కళ్యాణ్ తనతో సినిమా తీయబోతున్నట్లు పేర్కొనడం, జనసేన పట్ల తన నమ్మకాన్ని వ్యక్తీకరించడం సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
బాలినేని ఏమన్నారంటే..
బాలినేని తన ప్రసంగాన్ని పిఠాపురం అమ్మవారి సాక్షిగా ప్రారంభించారు. “పిఠాపురం అమ్మవారి సాక్షిగా చెప్తున్నాను – నా జీవితం మొత్తం జనసేనకే అంకితం చేస్తానని ఉద్వేగంగా ప్రకటించారు. జగన్ నాపై చేసిన అన్యాయాలను ఇప్పుడు చెప్పాలంటే సమయం చాలదు. కానీ ప్రజలకు వాటి గురించి తెలియాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నాకు జరిగిన అన్యాయం మరెవరికీ జరగకూడదు. నేను ఎదుర్కొన్న అనుభవాలను ప్రజలకు తెలియజేస్తానని బాలినేని అన్నారు.
జగన్‌పై తీవ్ర ఆరోపణలు
బాలినేని తన ప్రసంగంలో జగన్‌పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. జగన్ నా ఆస్తులను లాక్కున్నారు. నా కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. నా తండ్రి సంపాదించిన ఆస్తిలో సగం పోగొట్టుకున్నాను. జగన్ వల్ల నా ఆస్తులు, నా వియ్యంకుడి ఆస్తులు కూడా కోల్పోయానన్నారు. 2019-24 మధ్య కాలంలో అధికారంలో ఉన్న వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు కోట్లు కోట్లు లంచాలు తీసుకున్నారు. ఈ క్రమంలో వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Read Also: Nagababu on YCP: జగన్ పెద్ద కమిడియన్.. ఇంకో 20 ఏళ్లు …
పవన్ స్వశక్తితో పైకి వచ్చాడు
జగన్ తన తండ్రి (వైఎస్ రాజశేఖర రెడ్డి) దయతో సీఎం అయ్యారు. కానీ పవన్ కళ్యాణ్ స్వశక్తితో పైకి వచ్చారని బాలినేని అన్నారు. పవన్ రాజకీయ ప్రస్థానం పోరాటాలతో నిండింది. ఆయన కష్టాలను ప్రజలు గుర్తించాలని బాలినేని స్పష్టం చేశారు. జగన్ ప్రజల కోసం ఏమీ చేయలేదు. కానీ పవన్ ప్రజల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
సినిమా చేయాలనేది
ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలనేది నా చిరకాల కోరిక అని బాలినేని తన ప్రసంగంలో పవన్ కళ్యాణ్ పై ఉన్న తన అభిమానాన్ని ప్రస్తావించారు. అది నా జీవితంలో ముఖ్యమైన విషయమని బాలినేని వెల్లడించారు. సినిమా కంటే రాజకీయంగా పవన్ గారి నాయకత్వంలో పని చేయడమే నా ప్రధాన లక్ష్యం బాలినేని వెల్లడించారు.
రాగానే లోపల వేస్తా
కుటుంబ సభ్యులను తిడితే ఎలా ఊరుకుంటారు? కూటమి ప్రభుత్వం కనుక ఆరు నెలలు సహనంతో ఉంది. కానీ నేను అధికారంలోకి రాగానే చర్యలు తీసుకుంటానన్నారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన అవినీతిని ప్రజల ముందు బయటపెడతానని హెచ్చరించారు.