Pawan Kalyan: సనాతన ధర్మాన్ని నమ్ముతామని, కాపాడతామని చాలామంది సినీ సెలబ్రిటీలు బలంగా నిర్ణయించుకుంటారు. కానీ అందులో కొందరు మాత్రమే ఆ విషయాన్ని ఓపెన్‌గా చెప్తారు. అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. తను రాజకీయ నాయకుడిగా జనసేన అనే పార్టీని స్థాపిస్తున్న సమయంలోనే సనాతన ధర్మాన్ని కాపాడతానంటూ అందరికీ మాటిచ్చారు. ఇప్పటికే సందర్భం వచ్చినప్పుడల్లా అదే విషయాన్ని పదేపదే అందరికీ గుర్తుచేస్తుంటారు. అసలు పవన్ సనాతన ధర్మ పరిరక్షకుడిగా మారడానికి కారణం ఏంటి అనే విషయాన్ని వివరిస్తూ తాజాగా ఒక ఏవీని విడుదల చేసింది జనసేన టీమ్. ఆ వీడియో చూస్తే గూస్‌బంప్స్ గ్యారెంటీ అంటూ పవన్ ఫ్యాన్స్ అప్పుడే కామెంట్స్ మొదలుపెట్టేశారు.
దేవాలయాలపై దౌర్జన్యం
కొన్నేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లోనే దేవాలయాల్లో వరుసగా విగ్రహాలను ధ్వంసం చేయడం మొదలుపెట్టారు దుండగలు. అలా ఎన్నో ప్రముఖ ఆలయాల్లో విగ్రహాలు చాలావరకు ధ్వంసం అయ్యాయి. అలా ధ్వంసం అయిన విగ్రహాలను చూపించడంతో జనసేన స్పెషల్ వీడియో ప్రారంభమవుతుంది. ‘డెంగ్యూ, మలేరియా, కరోనా లాంటి వ్యాధుల్లాగానే సనాతన ధర్మం కూడా’ అంటూ ఉదయనిధి స్టాలిన్ ఇచ్చిన స్టేట్‌మెంట్ కూడా ఈ వీడియోలో ఉంది. ఆ తర్వాత అసలు హిందూ ధర్మం ఎక్కడ ఉంది? అంటూ తెలుగు రాష్ట్రాల్లో దేవాలయాల్లో జరుగుతున్న అన్యాయాలను ఒక మహిళ ప్రశ్నిస్తుంది. అప్పుడే సనాతన ధర్మాన్ని కాపాడతానంటూ పవన్ ఎంటర్ అవుతాడు.
ఇది కర్మభూమి
‘‘ఇది సనాతన ధర్మం మీద నడుస్తున్న దేశం. కర్మభూమి. పిచ్చి పిచ్చి వేశాలు వేయకండి. నాశనమైపోతారు. నలిగిపోతారు. దిక్కుమొక్కు లేకుండా పారిపోతారు’’ అంటూ జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ అన్న మాటలను ఈ వీడియో ద్వారా గుర్తుచేశారు. ఇది మాత్రమే కాదు.. పలు సభల్లో, పలు సందర్భాల్లో పవన్ మాట్లాడిన ఎన్నో గుర్తుండిపోయే మాటలు కూడా ఈ వీడియోలో యాడ్ చేశారు. ‘‘సెక్యూలరిజం అనేది రెండు పాదాలపై నడుస్తుంది. నా హైందవ సనాతన ధర్మాన్ని ఆరాధిస్తాను. ఇస్లాం, క్రిస్టియన్, సిక్, బౌద్ధం మొదలగు అన్య మతాలను గుండెల నిండుగా గౌరవిస్తాను’’ అని చాలా సందర్భాల్లో అన్ని మతాలు ఒక్కటే అన్నట్టుగా మాట్లాడారు పవన్ కళ్యాణ్.
Also Read: బెస్ట్ కోర్ట్ రూమ్ డ్రామాస్.. టాప్ 5 సినిమాలపై ఓ లుక్కేయండి..
ప్రాయశ్చిత్త దీక్ష
తిరుపతి లడ్డును తయారు చేసే నెయ్యిలో జంతువు కొవ్వు కలిసింది అని తెలిసినప్పుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆగ్రహం వ్యక్తం చేసిన తీరు కూడా ఈ వీడియోలో ఉంది. దానికి తను చేసిన ప్రాయశ్చిత్త దీక్ష కూడా చూపించారు. తిరుపతి లడ్డులో జంతువు కొవ్వు కలిసుందని తెలిసినప్పుడు దానికి ప్రాయశ్చిత్తంగా తిరుమల మెట్లను కడుక్కుంటూ వాటిపై నడుస్తూ దీక్షను పూర్తిచేశాడు పవన్. ‘‘ఓట్లు రాకపోయినా పర్వాలేదు నా ధర్మాన్ని నేను కాపాడుకోవాలి. ఇది నేను తీసుకున్న కచ్చితమైన నిర్ణయం’’ అని కూడా ఒకానొక సందర్భంలో స్టేట్‌మెంట్ ఇచ్చాడు పవన్. ‘‘నేను ఒక సనాతని హిందు అని గర్వంగా చెప్తున్నాను’’ అంటూ పవన్ చెప్పే మాటతో ఈ వీడియో ముగుస్తుంది.