Betting Apps Promotions: గత కొద్ది కాలంగా దేశ వ్యాప్తంగా బెట్టింగ్ యాప్స్ పై తీవ్ర చర్చ జరుగుతున్నది. చాలా మంది యువత ఈ యాప్స్ కు బానిసలై.. అప్పుల బారిన పడుతున్నారు. తీర్చే దారి కనిపించక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అంతేకాదు, చాలా మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న నేపథ్యంలో యువతలో మంచి క్రేజ్ ఏర్పడుతోంది. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆశతో ఈ ఊబిలోకి దిగి జీవితాలను ఆగం చేసుకుంటున్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేందుకు ఇన్‌ఫ్లుయెన్సర్లు పెద్ద మొత్తంలో సంపాదిస్తున్నారనే ప్రచారం ఉంది. ఇంతకీ, ఒక్కో ప్రమోషన్ కు వాళ్లు ఎంత తీసుకుంటారు? ఎంత మంది ఫాలోవర్లు ఉంటే ఎన్ని డబ్బులు వస్తాయి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
బెట్టింగ్స్ యాప్ ప్రమోషన్స్ ద్వారా ఇన్‌ఫ్లుయెన్సర్స్ సంపాదన ఎంత?
ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ ఎంత సంపాదిస్తారో నిర్ణయించేది వారి రీచ్, ఎంగేజ్ మెంట్. పెద్ద సంఖ్యలో ఫాలోయింగ్స్, ఎక్కువ ఎంగేజ్ మెంట్ రేట్లు ఉన్న ఇన్‌ఫ్లుయెన్సర్లు ఎక్కువగా ఛార్జ్ వసూళు చేస్తారు. ఇన్‌ఫ్లుయెన్సర్స్ లో ఎన్ని కేటగిరీలో ఉంటారు? ఏ కేటగిరీ వాళ్లు ఎంత సంపాదిస్తారంటే..
⦿ టాప్ టైర్ ఇన్‌ఫ్లుయెన్సర్లు- మిలియన్ కు పైగా ఫాలోవర్లు
లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్న ఇన్‌ఫ్లుయెన్సర్లను బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల కోసం పలు బ్రాండ్లు సంప్రదిస్తాయి. వారికి ఉన్న ఫాలోయింగ్ ను బేస్ చేసుకుని చెల్లింపులు చేస్తారు. మిలియన్, ఆ పైన ఫాలోవర్లు ఉన్న వారికి పెద్ద మొత్తంలో డబ్బులు ముట్టజెప్పుతారు. మిలియన్ ప్లస్ ఫాలోవర్లు ఉన్న వారు ప్రతి పోస్టుకు రూ. 1 లక్ష నుంచి రూ. 5 లక్షల వరకు సంపాదిస్తారు. కొంత మంది అంతకంటే ఎక్కువ డబ్బులు కూడా తీసుకుంటారు.
⦿ మిడ్ టైర్ ఇన్‌ఫ్లుయెన్సర్లు- 50K–500K ఫాలోవర్లు
ఇక 50 వేల నుంచి 5లక్షల ఫాలోవర్లు ఉన్న వారిని మిడ్ టైర్ ఇన్‌ఫ్లుయెన్సర్లుగా పిలుస్తారు. వారికి ఉన్న రీచ్, ఎంగేజ్ మెంట్ ప్రకారం ఒక్కో పోస్టుకు రూ.20 వేల నుంచి రూ. 1 లక్ష రూపాయల వరకు వసూళు చేసే అవకాశం ఉంటుంది. కొంత మందికి మరికొంత ఎక్కువ అమౌంట్ కూడా సంపాదిస్తారు.
⦿ మైక్రో ఇన్‌ఫ్లుయెన్సర్లు- 10K–50K ఫాలోవర్లు
చిన్న స్థాయి ఇన్‌ఫ్లుయెన్సర్లు కూడా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల నుంచి మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. ఒక్కో పోస్ట్ కు రూ. 5 వేల నుంచి రూ. 20 వేల మధ్య సంపాదించే అవకాశం ఉంటుంది. వారి ఫాలోవర్స్ పరిమాణం తక్కువగా ఉన్నప్పటికీ, మైక్రో ఇన్‌ఫ్లుయెన్సర్లు తరచుగా ఎక్కువ మొత్తంలో ఎంగేజ్‌మెంట్ రేట్లను కలిగి ఉంటారు.
⦿ ఉపయోగించే ప్లాట్ ఫామ్ బట్టి పేమెంట్
సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ కూడా ఇన్‌ఫ్లుయెన్సర్ రెమ్యునరేషన్ ను ప్రభావితం చేస్తుంది. ఇన్‌స్టాగ్రామ్ దేశంలో ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ కు మెయిన్ ప్లాట్ ఫామ్ గా కొనసాగుతోంది. ఇందులో చేసిన పోస్టులు ఎక్కువ రీచ్ అవుతయి. అందుకే ఎక్కువ మొత్తంలో రెమ్యునరేషన్ పొందుతారు. యూట్యూబ్ వీడియోలు కూడా ఇన్ స్టాగ్రామ్ మాదిరిగానే డబ్బును సంపాదిస్తాయి. ట్విట్టర్, ఫేస్ బుక్ లో పోస్టింగ్స్ లో సంపాదన ఉన్నప్పటికీ ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ తో పోలిస్తే తక్కువగా పేమెంట్ లభిస్తుంది.
⦿ కంటెంట్ రకం
కంటెంట్ రకాన్ని బట్టి పేమెంట్ ఉంటుంది. ఇన్ స్టా, ట్విట్టర్ లో సింగిల్ పోస్ట్ లు పెట్టడం వల్ల తక్కువ అమౌంట్ లభిస్తుంది. యూట్యూబ్ లో బెట్టింగ్ యాప్ గురించి రివ్యూ ఇచ్చే వారికి ఎక్కువ మొత్తంలో రెమ్యునరేషన్ ఇస్తారు. ఇక బెట్టింగ్ యాప్‌లు ముఖ్యంగా యువకులు, స్పోర్ట్స్, టెక్ నాలెడ్జ్ ఉన్న ప్రేక్షకులను టార్గెట్ చేస్తాయి. వారికి అనుగుణంగా ఇన్‌ఫ్లుయెన్సర్స్ చేత ప్రమోషన్స్ చేయిస్తారు.
Read Also: రెండు చేతుల్లేవ్.. గుండె బరువెక్కిస్తున్న జొమాటో బాయ్ వీడియో!