Betting On AP Elections: ఎన్నికల వేళ ఏపీలో బెట్టింగ్‌లు మొదలయ్యాయి. ఉత్కంఠ రేకెత్తిస్తోన్న ఎన్నికల ఫలితాలపై భీమవరం బెట్టింగ్ బాబులు ఫోకస్ పెట్టారు. నెల క్రితం కూటమికి 100 నుంచి 110 సీట్లు వస్తాయని అంచనా వేయగా.. ఇప్పుడు లెక్కలు మార్చేస్తున్నారు. కూటమికి 120 నుంచి 130 పైగా స్థానాలు వస్తాయని 1 కి 2 చొప్పున పందెం వేస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే పార్టీపై 1 కి 5 చొప్పున అంటే లక్ష రూపాయలకు 5 లక్షలు, పులివెందులలో జగన్, కుప్పంలో చంద్రబాబు మెజారిటీలపై 1కి 2, YCP, TDP, జనసేన, BJP సాధించే సీట్లపై 1కి 1 చొప్పున కోట్ల రూపాయల్లో పందేలు సాగుతున్నాయని తెలుస్తోంది.
కోడి పందేలకు పేరుపొందిన గోదావరి జిల్లాల్లో లక్షకు లక్షన్నర నుంచి 5 లక్షలు బెట్టింగ్ వేస్తూ కాయ్ రాజా కాయ్ అంటున్నారు. చోటా నేతలు, కొందరు వ్యాపారులు బెట్టింగ్‌లో మధ్యవర్తుల అవతారమెత్తారు. ఎవరు గెలిచినా తమకు 1 నుంచి 5 శాతం కమీషన్ ఇవ్వాలని డీల్ చేసుకుంటున్నారు. సినీ, రాజకీయ, వ్యాపార రంగాల వారితోపాటు ప్రైవేట్ ఉద్యోగులు, యువకులు, చిరు వ్యాపారులు 50 వేల నుంచి కోటి వరకు పందెం కాస్తున్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వంపైనే ఎక్కువ బెట్టింగ్ జరుగుతుంది.
రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన నేతలు, ప్రజాదరణ భారీగా ఉన్న నాయకులు బరిలో ఉన్నచోట పందేలు కూడా భారీగానే సాగుతున్నాయి. ఈ విషయంలో టాప్ 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పిఠాపురం, మంగళగిరి, గన్నవరం, గుడివాడ, ఉండి, కాకినాడ సిటీ, రాజోలు, విజయవాడ తూర్పు, నగరి, ధర్మవరం ఉన్నట్టు సమాచారం. తర్వాతి స్థానాల్లో నెల్లూరు రూరల్, చీరాల, దర్శి, గుంటూరు పశ్చిమం, విజయవాడ సెంట్రల్, రాజానగరం, రాజమహేంద్రవరం, విశాఖపట్నం తూర్పు, అవనిగడ్డ, మచిలీపట్నం, సత్తెనపల్లి, గురజాల, ఆళ్లగడ్డ, నందిగామ, మైలవరం, పోలవరం ఉన్నట్టు చెప్తున్నారు. ఆ నియోజకవర్గాల్లో TDP-YCP అభ్యర్థుల గెలుపోటములపై లక్షల్లో బెట్టింగ్‌లు జరుగుతున్నాయి.
Also Read: కడపలో జగన్ కు షర్మిల చెక్ పెడుతుందా.?
పిఠాపురంలో పవన్ 50 వేలకు పైగా మెజారిటీ సాధిస్తారని కాకినాడకు చెందిన ఓ వ్యాపారి 2.5 కోట్లు దళారి వద్ద ఉంచినట్టు తెలుస్తోంది. ఉండిలో కూటమి అభ్యర్థి రఘురామ కృష్ణంరాజుపై 1కి 2 లెక్కన పందేలు సాగుతున్నాయి. కుప్పంలో చంద్రబాబు, పులివెందులలో జగన్ మెజారిటీపై బెట్టింగులు తారా స్థాయిలో ఉన్నాయి. ఇక చంద్రబాబు ఇలాఖా కుప్పంలో బాబు మెజారిటీ తగ్గుతుందని ఒకరు బెట్ పెడితే కాదు గతంకంటే పెరుగుతుందని మరికొందరు బెట్టింగ్ వేస్తున్నారు. పులివెందులలో జగన్ రికార్డ్ మెజార్టీపై 1కి 3 చొప్పున పందేలు సాగుతున్నాయి.