Parakamani Theft: ఏపీలో వైసీపీ రూటు మార్చిందా? తిరుమల చుట్టూ రాజకీయాలు మొదలుపెట్టిందా? తిరుమల వ్యవహారం చెప్పి ఏదో విధంగా లైమ్‌లైట్‌లో ఉండేందుకు భూమన తహతహలాడు తున్నారా? గతంలో పింక్ డైమండ్ కాగా, ఇప్పుడు పరకామణి వంతైంది? ఈ వ్యవహారం హైకోర్టులో నడుస్తోందా? రేపోమపో సీఐడీ కూడా రంగంలోకి దిగనుందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
శనివారం మంత్రి లోకేష్ చేసిన ఆరోపణలపై వైసీపీ రియాక్ట్ అయ్యింది. ఆదివారం ఉదయం మీడియా ముందుకొచ్చిన టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సవాల్ విసిరారు. తిరుమల శ్రీవారికి చెందిన పరకామణిలో ఫారిన్ కరెన్సీ దోపిడీకి సంబంధించి నా హాయంలో ఈ ఘటన జరిగినట్టు నిరూపిస్తే అలిపిరి దగ్గర నా తల నరుక్కుంటానని చెప్పారు.
దీంతో ఒక్కసారిగా పరకామణి రాజకీయాలు వేడెక్కాయి. అంతేకాదు ఈ కేసును సీఐడీతో కాదు సీబీఐతో విచారణ జరిపించాలని ఛాలెంజ్ విసిరారు. మరోవైపు ఈ వ్యవహారం తారాస్థాయికి చేరడంతో సీఐడీ చేత విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది.
తిరుమల పరకామణిలో రవికుమార్ ఓ మఠం తరపున ఉన్నాడు. ఏళ్ల తరబడి గుమస్తాగా పని చేసిన ఆయన, శ్రీవారికి వచ్చిన విదేశీ కరెన్సీ లెక్కించేవారు. అయితే ఆయన విదేశీ కరెన్సీని పక్కదోవ పట్టించారనే ఆరోపణలు తీవ్రమయ్యాయి.
ALSO READ: పవన్‌ను పొగుడుతూ బొండా ఉమ వరుస ట్వీట్లు
వైసీపీ హయాంలో అంటే 2023 ఏప్రిల్ 29న విదేశీ కరెన్సీని లెక్కిస్తూ అందులో కొన్నినోట్లను పంచెలో దాచారు. దీనికి సంబంధించిన దృశ్యాలు శనివారం టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాష్‌రెడ్డి బయటపెట్టారు. ఈ వ్యవహారంపై నిగ్గు తేల్చాలంటే సీఐడీ చేత విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. దీంతో పరకామణి చుట్టూ రాజకీయ చర్చ మొదలైంది.
ఈ వ్యవహారంపై అధికార-విపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఈ వ్యవహారం హైకోర్టు వరకు వెళ్లింది. దీనిపై శనివారం కీలక ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం. దర్యాప్తు బాధ్యతను సీఐడీకి అప్పగించింది. శ్రీవారి కానుకల చోరీపై తిరుమల పోలీసులు నమోదు చేసిన కేసు రికార్డులను వెంటనే సీజ్ చేయాలని సీఐడీని ఆదేశించింది.
నిందితుడు రవికుమార్ లోక అదాలత్ ద్వారా ఈ వ్యవహారాన్ని రాజీ చేయడంపై న్యాయస్థానం విస్మయం వ్యక్తం చేసింది. గతంలో లోక్ అదాలత్ ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. వీటికి సంబంధించి టీటీడీ బోర్డు తీర్మానాలు, అధికారుల ఉత్వర్వులు ఏమైనా ఉంటే వాటిని సీజ్ చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 13కు వాయిదా వేసింది హైకోర్టు.
చాలాకాలంగా పరకామణిలో చేతివాటం చూపిన రవికుమార్ కోట్లకు పడగలెత్తారనే ఆరోపణలు లేకపోలేదు. ఈ విషయం తెలుసుకున్న అప్పటి వైసీపీ పెద్దలు రంగంలోకి దిగారట. నిందితుడు, అతడి కుటుంబసభ్యుల పేర్లతో తిరుపతి, చెన్నై ప్రాంతాల్లో ఉన్న కోట్ల విలువైన ఆస్తులను టీటీడీలో పని చేసే కొందరు అధికారులు, నాయకులు బినామీల పేరిట రాయించినట్టు విమర్శలు మొదలయ్యాయి. ఈ క్రమంలో నిందితుడ్ని అరెస్టు చేయకుండా లోక్ అదాలత్ ద్వారా రాజీ చేయించినట్టు తెలుస్తోంది. తాజాగా న్యాయస్థానం ఆదేశాలతో పరకామణి వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చినట్లయ్యింది.
నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పరకామణి చోరీ వ్యవహారం జరిగిందని నిజమని నిరూపిస్తే నా తల అలిపిరిలో నరుక్కుంటా
– భూమన కరుణాకర్ రెడ్డి, టీటీడీ మాజీ ఛైర్మన్ pic.twitter.com/N4jzB9qA2A
— BIG TV Breaking News (@bigtvtelugu) September 21, 2025