Bonda On Pawan: ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ప్రశ్నోత్తరాల సమయంలో చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విచారణకు ఆదేశించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులపై బొండా ఉమా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటు పవన్ పై తీవ్రంగా స్పందించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అసలు బొండా ఉమా ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేయవలసి వచ్చిందో పూర్తి స్థాయి విచారణకు పవన్ సిద్ధమయ్యారనే ప్రచారం సాగింది.
ఈ ఎపిసోడ్ ను సీఎం చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్లాలని పవన్ అధికారులకు సూచించారని ప్రచారం జరిగింది. ఈ తరుణంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పవన్ కల్యాణ్ నాయకత్వాన్ని పొగుడుతూ బొండా ఉమా ఎక్స్ వేదికగా వరుస ట్వీట్లు పెట్టారు.
‘అసెంబ్లీలో ప్రస్తావించిన సమస్యను విని తక్షణమే స్పందించి పరిష్కరించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు నా ధన్యవాదాలు. ప్రజా సమస్యలపై ఇంత వేగంగా, నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోవడం మీలో ఉన్న సేవా తపనకు నిదర్శనం. ఇలాంటి నాయకత్వం వల్లే ప్రజల్లో మీపై మరింత గౌరవం, విశ్వాసం, మంచి పేరు పెరుగుతోంది’ అని బొండా ఉమా ట్వీట్ పెట్టారు.
బొండా ఉమా కాలుష్య నియంత్రణ మండలి పనితీరుపై లేవనెత్తిన ప్రశ్నలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సభలో సమాధానం ఇచ్చారు. ఈ వీడియోను డిప్యూటీ సీఎం అధికారిక ఖాతాలో పోస్టు చేశారు. వీడియోపై స్పందిస్తూ…అసెంబ్లీలో తాను ప్రస్తావించిన సమస్యపై తక్షణమే స్పందించి పరిష్కరించిన డిప్యూటీ సీఎంకు ధన్యవాదాలు అని బొండా ఉమా ట్వీట్ చేశారు. దీంతో వివాదం ముగిసినట్లేనని పలువురు నెటిజన్లు ట్వీట్లు చేస్తు్న్నారు.
విజయవాడలోని ఓ పరిశ్రమ వల్ల కాలుష్యం జరుగుతోందని, దానిని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దృష్టికి తీసుకెళ్తే స్పందించలేదని ఎమ్మెల్యే బొండా ఉమా శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ కూడా అందుబాటులో ఉండడంలేదని అన్నారు. దీంతో జనసైనికులు హర్డ్ అయ్యారు. ఉదయం నుంచి బొండా ఉమాపై ఎక్స్ వేదికగా సెటైర్లు మారుమోగాయి. దీంతో డ్యామేజ్ కంట్రోల్ కు దిగిన బోండా ఉమా.. పవన్ పై పొగడ్తలు కురిపించారు.
Also Read: ఏపీపై ఉపరితల ద్రోణి ఎఫెక్ట్.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
శాసన సభ వర్షాకాల సమావేశాలలో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పీసీబీ పనితీరుపై సందేహాలు లేవనెత్తారు. ఈ ప్రశ్నలకు, సుదీర్ఘంగా సమాధానం ఇస్తూ, కాలుష్య నియంత్రణ మండలిలో ఉన్న ఇబ్బందులను, సిబ్బంది కొరత, నిధుల సమస్యను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సభకు తెలియజేశారు. పవన్ మాట్లాడుతూ.. కేవలం వైసీపీకి సంబంధించిన వ్యక్తుల కంపెనీలను టార్గెట్ చేసేలా కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా కాలుష్య నియంత్రణను ఉల్లంఘించే ప్రతీ ఒక్కరిపై చర్యలు తీసుకునేలా, అదే సమయంలో ఈ చర్యల కారణంగా కార్మికులు ఇబ్బంది పడకుండా చూస్తున్నామన్నారు.
అదే విధంగా సభ్యులు కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఉన్న ఇబ్బందులు అర్థం చేసుకోవాలని, త్వరలో పూర్తిస్థాయిలో బోర్డు సిబ్బంది కొరత పరిష్కరించడం ద్వారా పూర్తిస్థాయిలో కార్యకలాపాలు నిర్వహించేలా తానే పర్యవేక్షించనున్నట్లు పవన్ తెలిపారు.