ఏపీ సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు సోషల్ మీడియా ద్వారా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఆయన కూడా పేరు పేరునా అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ లు పెడుతూనే ఉన్నారు. ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. కేంద్ర మంత్రులు, రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన తాజా మంత్రులు, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. ఇలా అందరికీ చంద్రబాబు తన వ్యక్తిగత ట్విట్టర్ అకౌంట్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. ఇక ప్రజలకు కూడా ఆయన ఒక సుదీర్ఘ సందేశాన్ని ఉంచారు. ఇది తనకు లభించిన అరుదైన గౌరవం అని, ఇది ఓ అపురూప అవకాశం అంటూ ఆసక్తికర ట్వీట్ వేశారు చంద్రబాబు.
జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ ముఖ్యమంత్రి @revanth_anumula గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. https://t.co/WWyVwBfueI
— N Chandrababu Naidu (@ncbn) April 20, 2025
నాలుగోసారి అవకాశం ఇచ్చారు..
తన పుట్టినరోజున ప్రజలు అందించిన శుభాకాంక్షలు, వారు చూపించిన అభిమానం, ఆప్యాయతతో తన మనసు ఉప్పొంగిందని తన ట్వీట్ లో తెలిపారు చంద్రబాబు. 75 ఏళ్ల తన జీవన ప్రయాణం, 47 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో తనకు ఎల్లప్పుడూ తోడు నీడగా ఉండి, ముందుకు నడిపించిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు చెప్పారు. ప్రజాసేవ చేసేందుకు నాలుగోసారి ముఖ్యమంత్రిగా అవకాశమిచ్చిన తెలుగు ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. ఇలాంటి గౌరవం అరుదైనదని చెప్పారు.
నా పుట్టినరోజున మీరు అందించిన శుభాకాంక్షలు, మీరు చూపించిన అభిమానం, ఆప్యాయతతో నా మనసు ఉప్పొంగింది. ఇప్పటివరకు నా ప్రయాణంలో నాకు తోడుగా నిలిచినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు.
75 ఏళ్ల నా జీవన ప్రయాణంలో, 47 ఏళ్ల నా రాజకీయ ప్రస్థానంలో నాకు ఎల్లప్పుడూ తోడునీడగా ఉండి, నన్ను ముందుకు…
— N Chandrababu Naidu (@ncbn) April 20, 2025
పునరంకితం అవుతా..
ప్రజలు తనపై చూపించిన ఆదరాభిమానాలు, తనపై ఉంచిన నమ్మకం తనలో బాధ్యతను, నిబద్ధతను మరింత పెంచిందని తెలిపారు చంద్రబాబు. తెలుగు సమాజ పురోగతి కోసం అలుపులేకుండా పనిచేసేలా ప్రజలంతా తనలో ఉత్సాహం నింపారన్నారు. ప్రజల భవిష్యత్ కలలు, ఆకాంక్షలను సాకారం చేయాడానికి నిరంతరం కష్టపడి పనిచేస్తానని చంద్రబాబు మాటిచ్చారు. రాష్ట్ర అభివృద్ధి కోసం, తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం పునరంకితమవుతానని తన జన్మదినం రోజున వినమ్రంగా తెలియజేస్తున్నట్టు ప్రకటించారు.
స్వర్ణాంధ్ర-2047 విజన్
మూడు దశాబ్దాల క్రితం తాను ప్రవేశపెట్టిన ‘జన్మభూమి’ కార్యక్రమం సమాజంలో ఎంతో మార్పుతెచ్చిందని, ఈసారి ‘పీ4’ విధానంతో రాష్ట్రంలో పేద కుటుంబాలను, స్వర్ణ కుటుంబాలుగా చేయాలనేది తన ప్రయత్నం అన్నారు చంద్రబాబు. ప్రతి సంపన్న వ్యక్తి పేదవాడి శ్రేయస్సు కోసం పాటుపడాలని, వ్యక్తి శ్రేయస్సే… సమాజ శ్రేయస్సుగా తాను నమ్ముతానని చెప్పారు. జనం మన బలం అని, జనాభా సమర్ధ నిర్వహణ ద్వారా సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. విజన్ -2047 ప్రజలందరి ఆకాంక్షల సమాహారం అని, ప్రజలందరి మద్దతుతో, సమష్టి కృషితో దాన్ని నిజం చేస్తానన్నారు. ప్రతి పౌరుడి భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా పాలన అందిస్తానన్నారు. ‘థింక్ గ్లోబల్లీ-యాక్ట్ గ్లోబల్లీ’ విధానంతో రాష్ట్రాన్ని నాలెడ్జ్ ఎకానమీగా తీర్చిదిద్దుకుందామని చెప్పారు చంద్రబాబు. 2047 నాటికి ప్రపంచంలోనే శక్తివంతమైనదిగా తెలుగు జాతిని నిలుపుతానన్నారు.
తన పుట్టినరోజు సందర్భంగా పల్లెటూళ్ల నుంచి విదేశాల వరకు తన అభిమానులు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారని, వారందరికీ ధన్యవాదాలు అని చెప్పారు చంద్రబాబు. ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం తెలుగు ప్రజల రక్తంలోనే ఉందని, వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధనకు చేయిచేయి కలుపుదామంటూ తన పుట్టినరోజు సందేశాన్నిచ్చారు.