BJP : కర్ణాటక ఎన్నికల ఫలితాలు బీజేపీ దూకుడుకు బ్రేకులు వేశాయి. కర్ణాటక ఎన్నికల్లో గెలిచి అదే జోష్ తో తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టాలని భావించింది. కానీ కాషాయ నేతల కలలు ఫలించలేదు. కర్ణాటక ఓటర్లు షాక్ ఇవ్వడంతో ఆ ఎఫెక్ట్ తెలంగాణపై పడింది. ఇక రాష్ట్రంలో బీజేపీలో నేతల చేరికలు అంత ఈజీకాదు.
అటు ఏపీలోనూ బీజేపీ బలంగా లేదు. జనసేనతో కలిసి వెళ్లాలని ప్రయత్నిస్తోంది. కానీ పవన్ కల్యాణ్ బీజేపీ కంటే టీడీపీనే ముద్దు అంటున్నారు. చంద్రబాబుతో ఇప్పటికే మూడుసార్లు భేటీలు జరిగాయి. టీడీపీ-జనసేన పొత్తు ఉంటుందని తేలిపోయింది. ఇక మిగిలింది సీట్ల పంపకాలే. కలిసి వస్తే బీజేపీని కూడా కలుపుకుని వెళ్లాలనేది పవన్ ఆలోచన. కాదంటే బీజేపీనే వదులుకునేందుకు జనసేనాని సిద్ధంగా ఉన్నారని అర్ధమవుతోంది.
బీజేపీ నేతలు మాత్రం పవన్ కల్యాణ్ తోనే కలిసి వెళతామని ఇన్నాళ్లూ చెబుతున్నారు. టీడీపీతో కలిసి వెళ్లేది లేదని ఎన్నోసార్లు స్పష్టం చేశారు. కానీ కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ వెనక్కి తగ్గే అవకాశం కనిపిస్తోంది. అందుకే ఏపీలో పొత్తులపై కాషాయ నేతలు స్పందించారు. టీడీపీతో జనసేన పొత్తు అంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లామని ఎంపీ జీవీఎల్ నరసింహారావు వెల్లడించారు. పొత్తుపై అధిష్టానమే అంతిమ నిర్ణయం తీసుకుంటుందన్నారు. ప్రస్తుతానికి బీజేపీ, జనసేన మాత్రం కలిసే ఉన్నాయన్నారు.
వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని పవన్ పట్టుదలతో ఉన్నారు. జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు. అందుకే టీడీపీతో పొత్తుకు తహతహలాడుతున్నారు. బీజేపీని ఒప్పించి టీడీపీతో కలిసి వెళ్లాలన్నదే జనసేనాని వ్యూహం. మరి టీడీపీతో పొత్తుకు బీజేపీ ముందడుగు వేస్తుందా..? 2014 ఎన్నికల మాదిరిగా కలిసి పోటీ చేస్తుందా..? అంటే కర్ణాటకలో పరాజయంతో బీజేపీ వ్యూహం మారుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ దారిలోనే బీజేపీ నడుస్తుందనే అంటున్నారు.
బీజేపీ పొత్తుకు సై అంటే చంద్రబాబు వద్దనే పరిస్థితి లేదు. కలుపుకునేందుకు టీడీపీ అధినేత సిద్ధంగానే ఉన్నారు. అందుకే ఈ మధ్య ప్రధాని మోదీని కూడా ప్రశంసలతో ముంచెత్తారు. ఇక పొత్తు కోసం అడుగు వేయాల్సింది బీజేపీనే. జనసేనాని దారిలోనే బీజేపీ నడిస్తే.. మళ్లీ 2014 కాంబినేషన్ తో ఎన్నికలకు సిద్ధమైనట్టే..! ఇదే జరిగితే జగన్ కు పెనుసవాల్ తప్పదు..!