Vijayawada West Seat: ఎన్నికల నోటిఫికేషన్ వెడువడిన నుంచి రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు రోజురోజుకు మారుతున్నాయి. టీడీపీ+జనసేన+బీజేపీలు పొత్తులో భాగంగా ఇప్పటికీ కొన్ని స్థానాలపై ఓ కొలిక్కి రాలేకపోతున్నాయి. వీటిలో ప్రధానంగా విజయవాడ వెస్ట్ సీటు ఈ మూడు పార్టీలకు కీలకంగా మారింది. ఏ పార్టీ కూడా ఈ సీటును వదులుకునే అవకాశాలు కనిపించడం లేదు. సీటు తమదంటే తమదేనంటూ నేతలు చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ విజయవాడ వెస్ట్ సీటుపై కీలక వ్యాఖ్యలు చేశారు.
పొత్తులో భాగంగా త్యాగాలు సహజమేనని బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ అన్నారు. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులో భాగంగా విజయవాడ వెస్ట్ సీటు బీజేపీకే దక్కుతుందని శ్రీరామ్ ధీమా వ్యక్తం చేశారు. పొత్తు పెట్టుకున్నప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొన్ని సీట్లు తప్పకుండా వదులుకోవాల్సి వస్తుందని అన్నారు. అయితే ఇప్పటికే వెస్ట్ స్థానంలో జనసేనకే సీటు దక్కుతుందని పోతిన మహేశ్ అంతా సిద్ధం చేసుకున్నారు. ఇంతలో ఈ మూడు పార్టీలు పొత్తు పెట్టుకోవడంతో ఆయన ఆశలన్నీ ఆవిరయ్యాయి. అయితే ఈ సీటుపై రోజురోజుకు రాజకీయం ముదురుతోంది. వెస్ట్ స్థానంలో రెండు పార్టీలకు మంచి పట్టు ఉండడంతో బీజేపీ, జనసేన పార్టీలు ఎటూ తేల్చుకోలేక పోతున్నాయి.
ఇప్పటికే జనసేనాని పవన్ కళ్యాణ్ టీడీపీ-బీజేపీ పొత్తు పెట్టుకోవడం ప్రధాన పాత్ర పోషించడంతో జనసేన కొన్ని సీట్లు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో వెస్ట్ స్థానాన్ని కూడా వదులుకోవడానికి జనసేన నిరాకరిస్తుంది. పొత్తు కారణంగా జనసేన 3 అసెంబ్లీ స్థానాలను బీజేపీకి కేటాయించింది. ఈ విషయంలో పవన్ ఇప్పటికే ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పవన్ తన ఆదేవన వ్యక్తం చేస్తున్నాసరే.. ఇరు పార్టీలు రాజీపడడం లేదు. జనసేనాకు కేటాయించిన స్థానాన్ని తమకు కావాల్సిందేనని పట్టుబడుతున్నాయి.
Also Read: AP Elections 2024: ఏపీలో హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక
గురువారం విజయవాడ వెస్ట్ లో బీజేపీ ఆత్మీయ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ పాల్గొని వెస్ట్ సీటు బీజేపీకే ఫిక్స్ చేశారని వెల్లడించారు. 2021 ఎన్నికల లెక్క ప్రకారం సీటు బీజేపీకే వస్తుందన్నారు. పార్టీ అధిష్ఠానం వెస్ట్ సీటుపై డిసైడ్ అయ్యిందని.. అభ్యర్థి ఎవరనేది ఇంకా తేలాల్సి ఉందన్నారు. అభ్యర్థిగా ఎవరు ఎంపికైనా సరే విజయం తమదేనని అన్నారు. బీజేపీ గెలుపు కోసం జనసేన కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఆయన వ్యాఖ్యలపై జనసేన నేత మహేశ్ స్పందించారు. పొత్తులో భాగంగా ఆ సీటు జనసేనకు రావడమే న్యాయం అని అన్నారు.