BigTV English

Operation Lotus : వైసీపీపై బీజేపీ పార్టీ ఆపరేషన్ లోటస్.. టార్గెట్ ఆ నేతలే..

Operation Lotus : వైసీపీపై బీజేపీ పార్టీ ఆపరేషన్ లోటస్.. టార్గెట్ ఆ నేతలే..

BJP’s Operation Lotus on YSRCP Party Leaders: ఫస్ట్ ఆపరేషన్ లోటస్ ఆన్ వైసీపీ.. తమిళనాడు కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం చేసిన ఈ ట్వీట్ ఏపీ రాజకీయాలను షేక్ చేస్తోంది. మరీ ముఖ్యంగా వైసీపీలో అలజడి రేపింది. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ త్వరలోనే మొదలు పెడుతుందని.. దాని మొదటి టార్గెట్ వైసీపీ అని కార్తి చిదంబరం ట్వీట్ చేశారు. ఢిల్లీ రాజకీయాలపై ఓ అవగాహన ఉన్న చిదంబరానికి ఎంతో కొంత సమాచారం ఉండే ఉంటుంది. అందుకే ఆయన ఈ ట్వీట్ చేశారు. లోక్‌సభలో బీజేపీ బలాన్ని చూస్తూ.. మోడీ, అమిత్ షా ఆ రకంగా అడుగులు వేయరని చెప్పలేం. ఎన్డీఏ శకం మొదలైన తర్వాత మొదటిసారి లోక్‌సభలో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ కు 32 సీట్ల దూరంలో ఉండిపోయింది.


ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన ఎంపీలు బీజేపీకి రాకపోవడంతోనే చంద్రబాబు, నితీష్ కుమార్‌కు హై ప్రియారిటీ ఇవ్వాల్సి వస్తుంది. సరిగ్గా 6 నెలల ముందు చంద్రబాబు.. ఢిల్లీ వెళ్తే మోడీ, అమిత్ షా అపాయింట్‌మెంట్ కూడా దొరకడం కష్టమైంది. ఇప్పుడు పరిస్థితి మారింది. దానికి కారణం బీజేపీకి మెజార్టీ రాకపోవడమే. ఇప్పటికిప్పుడే చంద్రబాబుతో ఎన్డీఏకు వచ్చిన నష్టం ఏమీ లేదు కానీ.. నితిష్ కుమార్‌ను మోడీ, అమిత్ షా నమ్మి కేంద్రంలో ప్రభుత్వాన్ని నడిపించలేరు. కాబట్టి.. సొంతంగా ఎంపీల సంఖ్య పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. దీని కోసం అమిత్ షా, రాజ్‌నాథ్ రంగంలోకి దిగారట. కుదిరితే ఇతర పార్టీ ఎంపీలను బీజేపీలోకి చేర్చుకోవాలని.. లేదంటే ఎన్డీఏలో ఇతర పార్టీలను చేర్చుకునే ఆపరేషన్ త్వరలోనే మొదలుకానుందని ఢిల్లీ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగా వైసీపీనే మొదట టార్గెట్ చేస్తున్నారని కార్తి చిదంబరం ట్వీట్ చేశారు.

Also Read: PM Modi AP Tour : రేపు ఏపీకి ప్రధాని.. సస్పెన్స్ లోనే ఒడిశా సీఎం ఎంపిక ?

బీజేపీకి వైసీపీ టార్గెట్ అయితే.. ఆపరేషన్ లోటస్‌ను జగన్ అడ్డుకోగలరా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టమనే చెప్పాలి. వైసీపీ నుంచి నలుగురు ఎంపీలు మొన్నటి ఎన్నికల్లో గెలిచారు. కడప నుంచి అవినాష్ రెడ్డి, రాజంపేట ఎంపీగా మిథున్ రెడ్డి, తిరుపతి పార్లెమంట్ నుంచి మద్దిల గురుమూర్తి, అరకు లోక్‌సభ స్థానంలో తనూజారాణి గెలిచారు. బీజేపీ ఆపరేషన్ మొదలు పెడితే మద్దిల గురుమూర్తి, తనూజారాణి మొదట వైసీపీని వీడే అవకాశం ఉంది. జగన్ టికెట్ ఇచ్చారనే కారణం తప్పా.. పార్టీతో కొనసాగడానికి వాళ్ల దగ్గర బలమైన కారణం లేదు. అదే బీజేపీలో ఉంటే నియోజకవర్గ ప్రజలకు ఏదైనా చేయొచ్చు అనే కారణం చూపించి కమలం గూటికి చేరొచ్చు. ఇక మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి విషయానికి వస్తే జగన్ ని కాదని వాళ్లు పార్టీ మారే ప్రసక్తే లేదు. కానీ.. బీజేపీ నుంచి ఎలాంటి ఒత్తిడి వస్తుంది? అనేదానిపైనే వారి రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.

వివేకా హత్య కేసులో అవినాష్ ప్రధాన నిందితుడుగా ఉన్నారు. గత ఐదేళ్లు కేవలం వైసీపీకి, బీజేపీకి మధ్య ఉన్న అవసరాల రీత్యా వివేకా హత్యకేసు దర్యాప్తు నత్తనడకన సాగింది. కానీ.. అదే కేసును తమకు అనుకూలంగా బీజేపీ వాడుకుంటే.. అవినాష్ రెడ్డి వైసీపీనే అంటిపెట్టుకుని ఉంటారని చెప్పలేం. ఆ మాటకొస్తే.. జగనే స్వయంగా అవినాష్ రెడ్డికి బీజేపీలోకి వెల్లడమే మంచిదని సూచించే అవకాశమూ లేకపోలేదు.

Also Read: అమెరికా నుంచి వచ్చిన విజయమ్మ, జగన్‌బాబుకు ఓదార్పు.. దూకుడు వద్దంటూ

ఇక వైసీపీ దగ్గర 11 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. గతంలో టీడీపీ రాజ్యసభ సభ్యులను బీజేపీ విలీనం చేసుకుంది. ఇప్పుడు అదే ప్లాన్ వైసీపీ విషయంలో కూడా చేస్తుందనే వాళ్లు కూడా ఉన్నారు. వైసీపీ రాజ్యసభ ఎంపీల్లో పార్టీకి వీర విధేయులు తక్కువే. పరిమళ్ సత్వానీ, ఆర్ కృష్ణయ్య లాంటి వారు బీజేపీ నుంచి పిలుపు రావడమే ఆలస్యం అన్నట్టు ఉంటారు. ఇక, బీద మస్తాన్ రావు, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీని కాదని జగన్‌ను అంటిపెట్టుకుని ఉంటారని చెప్పలేం. విజయసాయిరెడ్డి విషయం అంత ఈజీగా అంచనా వేయలేం. కానీ, జగన్ కంటే కేంద్రం దగ్గర విజయసాయి రెడ్డికే పలుకుబడి ఉంది. కాబట్టి ఆయన మోడీ, అమిత్ షా పిలిస్తే కాదంటారని అంటే ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే.. సుజనా చౌదరి లాంటివాళ్లు టీడీపీని వీడినపడు విజయసాయి రెడ్డి వైసీపీని ఎందుకు వీడరనే ప్రశ్నలు తలెత్తుతాయి.

జగన్ కు ఈ ఎన్నికల ఫలితాలు ఊహించని షాక్ ఇచ్చాయి. ఒకవేళ ఆపరేషన్ లోటస్ కు వైసీపీ టార్గెట్ అయితే.. అవినాష్, విజయసాయిరెడ్డి లాంటివారు పార్టీ వీడితే వైసీపీ ఇప్పట్లో కోలుకునే పరిస్థితి ఉండదు. కానీ, అవినాష్ రెడ్డి, విజయసాయి రెడ్డి.. జగన్ అనుమతితోనే పార్టీని వీడొచ్చు. కేసుల నుంచి తప్పించుకోవాలంటే తప్పదని జగన్ కూడా అర్థం చేసుకోవచ్చు. కేసుల విషయంలో జగన్ కు కూడా అది మంచే చేయొచ్చు. అదే జరిగితే ప్రజల్లో పార్టీ పరపతి మాత్రం తగ్గుతుందని చెప్పడంలో సందేహం లేదు.

Tags

Related News

YS Jagan: వాళ్లు ఫోన్ చేస్తే మీరెందుకు మాట్లాడుతున్నారు.. పార్టీ నేతలపై జగన్ ఫైర్!

AP Politics: గుంటూరు టీడీపీ కొత్త సారథి ఎవరంటే?

APSRTC employees: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. ప్రమోషన్స్ పండుగ వచ్చేసింది!

Mega Projects in AP: ఏపీకి భారీ పెట్టుబడి.. అన్ని కోట్లు అనుకోవద్దు.. జాబ్స్ కూడా ఫుల్!

Vinayaka Chavithi 2025: దక్షిణ భారతదేశంలోనే ఎత్తైన మట్టి గణేష్ విగ్రహం.. దర్శిస్తే కలిగే భాగ్యం ఇదే!

Heavy Rain Andhra: ఏపీకి భారీ వర్షసూచన.. రాబోయే 48 గంటలు కీలకం.. అప్రమత్తం అంటూ హెచ్చరిక!

Big Stories

×