Black Magic: ఆధ్యాత్మికతకు కేంద్రబిందువుగా నిలిచిన మహానంది క్షేత్రంలో.. తాజాగా క్షుద్రపూజల సంఘటన తీవ్ర కలకలం రేపుతోంది. దశాబ్దాలుగా భక్తుల విశ్వాసానికి చిరునామాగా నిలిచిన ఈ శైవ పుణ్యక్షేత్రంలో క్షుద్రపూజల ఆనవాళ్ళును స్థానికులు గుర్తించారు. ఎన్నడూ లేని విధంగా మహానంది ఆలయం సమీపంలో.. ఈ ఘటన జరగడం అందరిని భయభ్రాంతులకు గురి చేస్తోంది.
శివాలయం సమీపంలో కలకలం
గరుడనంది దేవాలయం వెనక భాగంలో ఉన్న నిర్మానుష్య ప్రదేశంలో.. చెట్ల పొదల మధ్య పసుపు, కుంకుమ, సున్నం, నిమ్మకాయలు, మహిళ దుస్తులు, కొబ్బరికాయలు వంటి అనుమానాస్పద వస్తువులను స్థానికులు గుర్తించారు. ఈ దృశ్యాలు చూస్తే ఒళ్లు గగుర్పాటుకు గురి కావాల్సిందే..
ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అంతేకాక, ఘటన జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలన ప్రారంభించారు. ఆలయం సమీపంలో భద్రత ఉన్నప్పటికీ.. అయినా ఇలాంటి దృశ్యాలు వెలుగులోకి రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
భక్తుల్లో భయం, భవిష్యత్తుపై ఆందోళన
ఈ ఘటన ఆలయ భక్తులకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రతి రోజూ వేలాది భక్తులు దర్శనం కోసం వచ్చే మహానంది క్షేత్రం వద్ద.. ఇలాంటి క్షుద్రపూజలు జరగడం దారుణమని స్థానికులు పేర్కొంటున్నారు. ఇది కేవలం క్షుద్రపూజలు మాత్రమే కాదు. శివక్షేత్రాల పవిత్రతను భంగపరిచే ప్రయత్నం. ఇలాంటి చర్యలు చేయడం మహా పాపం అని కొందరు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు
ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో.. విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. చెట్ల పొదల మధ్య కుంకుమ, నిమ్మకాయలు, రక్తం వలె కనిపించే ద్రవాలు ఉన్న దృశ్యాలు నెటిజన్లను షాక్‌కు గురిచేస్తున్నాయి. చాలా మంది సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
అధికారులు స్పందన
ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు స్పందిస్తూ.. ఇలాంటి తంత్ర పూజలు జరిగి రెండు రోజులు అయ్యే అవకాశం ఉంది. భద్రతపై మేము ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. ఇప్పటికే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అని పేర్కొన్నారు. పోలీసులు ఫోరెన్సిక్ బృందంతో సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. సాంకేతిక ఆధారాలతోపాటు స్థానికుల వాంగ్మూలాల ఆధారంగా మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు.
చర్యల కోసం డిమాండు
గ్రామస్థులు, భక్తులు ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇలాంటి వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా.. ఆలయ పరిసరాల్లో సీసీ కెమెరాలను మరింత పెంచాలి అని వారు సూచిస్తున్నారు.
Also Read: పెళ్లయ్యాక మరొకరితో లవ్.. చివరికి చెట్టుకి వేలాడుతూ.. దారుణం!
భక్తుల విశ్వాసానికి పునాది అయిన మహానంది ఆలయం వద్ద.. ఇటువంటి తంత్రచర్యలు జరగడం గమనార్హం. ఇది కేవలం నేరపూరిత చర్య మాత్రమే కాదు, సమాజంలో మూఢనమ్మకాల వ్యాప్తికి సూచిక. ఇందుకు పాల్పడిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా.. సమగ్ర చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.