Pawan Kalyan : ఎవరినైనా దూషించే ముందు ఒకటికి వంద సార్లు ఆలోచించుకో..లేదంటే కర్మ వదిలిపెట్టదు… ఇదేదో సినిమాలో డైలాగ్ కాదు. సోషల్ మీడియాలో పోస్టులపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరిక. కేవలం తమ అభిమాన నాయకులకు వ్యతిరేకంగా రాజకీయాల్లో ఉన్నారనో, ఏవైనా విషయాల్లో విభేదిస్తే చాలు.. ప్రతివిమర్శల పేరుతో నాయకుల్ని, వారి కుటుంబ సభ్యుల్ని తిడుతూ, ఇస్టారాజ్యంగా కామెంట్లు, పోస్టులు పెట్టేవారికి.. జనసేనాని ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. ఏమైనా అనే ముందు ఆలోచించుకో అంటూ.. పవర్ ఫుల్ డైలాగ్ తో ఆదివారం రాత్రి ఎక్స్ (ట్విట్టర్) (Twitter)లో పోస్ట్ పెట్టారు.
ప్రజాస్వామ్యంలో నిర్మాణాత్మక విమర్శలు ఆరోగ్యకరమన్న పవన్ కళ్యాణ్… దూషించడం, హత్యలు, అత్యాచార బెదిరింపులు సరికాదని అన్నారు. ప్రజాస్వామ్యంలో మనమంతా వివిధ అంశాలపై విభేదించవచ్చు.. అసమ్మతి వ్యక్తం చేయవచ్చు కానీ, ఇది విధానాల వరకే పరిమితం కావాలని సూచించారు. ఆయా విషయాల్ని వ్యక్తిగతంగా తీసుకోవడం, వ్యక్తిగత విమర్శలకు దిగడం తగదని అన్నారు.
రాజకీయాల్లో నాయకుల కుటుంబాలు, వ్యక్తులను లాగడం ఏంటని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్.. కుల దూషణలు, ఎదుటి వ్యక్తుల విశ్వాసాలను దెబ్బతీయడం లాంటి వాటితో పాటు దేవుళ్లపై దాడి చేసేలా వారి ప్రవర్తన ఉండొద్దని అన్నారు. కండబలం, ధనబలం, క్రిమినల్ గ్యాంగులతో ఈ దేశంలోని సగటు భారతీయుడిని బెదిరించలేరు అంటూ పరోక్షంగా వైసీపీని హెచ్చరించారు జనసేనాని పవన్ కళ్యాణ్. అందుకే.. క్రిమినల్ ముఠాలు, గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా దుర్వినియోగానికి పాల్పడిన వారికి ఒకటే చెబుతున్నా ‘దూషించే ముందు ఒకటికి వంద సార్లు ఆలోచించుకోండి.. కర్మ వదలిపెట్టదు’ అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు.