Botsa on Pawan Kalyan: గబ్బర్ సింగ్ – 1 చూశాను. అదే సినిమా పార్ట్ – 2 కూడా చూశాను. కానీ పార్ట్ – 3 రిలీజ్ కాలేదని భాదపడుతున్నాను. అది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుణ్యమా అంటూ మొన్న కాకినాడలో చూశానని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఇటీవల కాకినాడలో పవన్ కళ్యాణ్ పర్యటన సినిమాటిక్ గా ఉందని బొత్స తెలిపారు.
ఇటీవల కాకినాడ పోర్టును పవన్ కళ్యాణ్ సందర్శించిన విషయం తెలిసిందే. ఆ పర్యటనలో సీజ్ దిస్ షిప్ అంటూ పవన్ అన్న వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారింది. అలాగే కాకినాడ పోర్టు కేంద్రంగా అక్రమ రేషన్ రవాణా సాగుతున్న విషయం పవన్ పర్యటనతో దేశవ్యాప్త చర్చకు దారితీసింది. అలాగే కేంద్రం కూడా పోర్టు గురించి పూర్తి స్థాయిలో ఆరా తీస్తుందట. ఇది ఇలా ఉంటే తాజాగా మాజీ మంత్రి బొత్స కాకినాడ పోర్టు గురించి కీలక కామెంట్స్ చేశారు.
బొత్స మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో ఎప్పుడూ ముందుంటుందన్నారు. ఒకవైపు అప్పులు చేస్తూనే.. మరోవైపు ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపడం ధర్మమేనా అంటూ ఆయన ప్రశ్నించారు. ఐదేళ్లు కరెంట్ ఛార్జీలు పెంచమని హామీలిచ్చి.. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే రూ.15 వేల కోట్లు ప్రజలపై భారం మోపడం తగదన్నారు. ఇది మీకు తగునా సీఎం చంద్రబాబు గారూ అంటూ బొత్స ప్రశ్నించారు.
Also Read: KCR – Jagan: పొంగల్‌కు పొలిటికల్ బొమ్మ.. అజ్ఞాతం నుంచి అమాంతంగా జనాల్లోకి కేసీఆర్, జగన్
ఇక కాకినాడ పోర్టుపై మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ పార్ట్ – 3 రాలేదని అనుకొనేవాడినని, మొన్న పవన్ స్వయంగా పోర్టులో ఆ సినిమా చూపించారని సెటైర్స్ వేశారు బొత్స. అలాగే పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణా సాగించడం ముమ్మాటికి తప్పేనని, మరీ అసలు దోషులను ఎప్పుడు ప్రకటిస్తారన్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా సాగుతుందంటే, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విఫలమైనట్లేనని, ఈ విషయంపై జనసేన ఏవిధంగా సమాధానం ఇస్తుందన్నారు.
మరోవైపు సచివాలయంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడులు రేషన్ బియ్యం అక్రమ రవాణా అరికట్టేందుకు ఉన్నతస్థాయి సమీక్షను నిర్వహించారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా అరికట్టడంపై చర్చ సాగగా, ఏపీలో పోర్టుల నుంచి పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై వారు చర్చించారు.