Vivekananda Case: వైఎస్ వివేకానంద హత్య కేసు సీబీఐ దర్యాప్తు ముగిసినట్టేనా? బాధితులు వేసిన పిటిషన్లపై మళ్లీ దర్యాప్తుకు న్యాయస్థానం ఆదేశిస్తుందా? ఏమైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే దర్యాప్తు మొదలు పెడుతుందా? ఈ విషయంలో బాధితులు ఏమన్నారు? మళ్లీ విచారణ జరిగితే కీలక నేతలు అరెస్టు కావడం ఖాయమా? అవుననే అంటున్నారు.
ఏపీ మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో దర్యాప్తు ముగిసినట్టు సీబీఐ వెల్లడించింది. మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా ధర్మాసనానికి తెలిపింది సీబీఐ. న్యాయస్థానం ఆదేశిస్తే తదుపరి దర్యాప్తు కొనసాగిస్తామని పేర్కొంది. ప్రస్తుతం ఈ కేసును జస్టిస్ సుందరేశ్ నేతృత్వంలోని ధర్మాసనం పరిశీలన చేస్తోంది.
సీబీఐ సమర్పించిన నివేదికపై పరిశీలించిన తర్వాత న్యాయస్థానం క్లారిటీ ఇవ్వనుంది. మళ్లీ విచారణ చేపడతారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. విచారణ చేపడితే ఓ ఎంపీ అరెస్టు కావడం ఖాయమనే వాదన బలంగా వినిపిస్తోంది.
వివేకా కూతురు సునీత తరఫు సీనియర్ న్యాయవాది మరో కోర్టులో ఉండటంతో సమయం కోరారు. దీంతో ధర్మాసనం విచారణను పాస్ ఓవర్ చేసినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత వాదనలు వినిపిస్తామని న్యాయవాది లూథ్రా తెలిపారు. భోజనం విరామం తర్వాత బెంచ్ కంటిన్యూ కాదని, మరో రోజు విచారణ చేపడతామని జస్టిస్ సుందరేశ్ వెల్లడించారు. దీంతో తదుపరి విచారణ ఈనెల 19కి వాయిదా పడింది.
ALSO READ: కూటమి ప్రభుత్వానికి షర్మిల ప్రశ్న.. బాబుగారి ఇది మీకు న్యాయమూ?
జులై 21న విచారణ సందర్భంగా మూడు అంశాలపై స్పష్టత ఇవ్వాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ తర్వాత అవినాష్‌రెడ్డి సహా మిగతా నిందితుల బెయిల్ రద్దు పిటిషన్లపై విచారణ చేపడతామని తెలిపింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు వివరాలను మంగళవారం సీబీఐ సుప్రీంకోర్టుకు సమర్పించింది.
ఈ కేసు దర్యాప్తు ఇంకా అవసరమా? సునీత దంపతులపై ఏపీ ప్రభుత్వం కడప సెషన్స్ కోర్టులో దాఖలు చేసిన క్లోజర్ రిపోర్టుపై అభిప్రాయం తెలపాలని కోరింది. ఈ కేసులో అవినాష్ రెడ్డి సహా పలువురికి తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. వారంతా సాక్షులను ప్రభావితం చేస్తున్నారని సునీత న్యాయవాది సిద్ధార్థ లూథ్రా న్యాయస్థానానికి వివరించిన విషయం తెల్సిందే. కేసు ట్రయల్, తదుపరి దర్యాప్తు ఏక కాలంలో జరిగే అవకాశం ఉందా? అనేదానిపై సీబీఐ వివరణ కోరింది.
వివేకానంద రెడ్డి 2019 మార్చి 15న కడప జిల్లా పులివెందుల తన ఇంట్లో హత్యకు గురయ్యారు. తొలుత పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ తర్వాత కేసు సీబీఐకి బదిలీ అయ్యింది. గడిచిన ఐదేళ్లుగా అనేక మలుపులు తిరిగింది. చివరకు ఈ కేసు వ్యవహారం కడప కోర్టు నుంచి హైదరాబాద్ హైకోర్టుకి చేరింది.
ఈ కేసులో పలువు నిందితులు అరెస్టయ్యారు. కొంతమంది సాక్షులు మృతి చెందగా, ఇంకొందరు అప్రూవర్‌లుగా మారిపోయారు. 2020 మార్చి 11న సీబీఐ దర్యాప్తు మొదలుపెట్టింది. 2023 ఫిబ్రవరి 20 వరకు సీబీఐ 248 మందిని విచారించింది. ఈ ఏడాది ఆగస్టు 5న దర్యాప్తు పూర్తయిందని సుప్రీంకోర్టుకు నివేదించింది సీబీఐ.