AP News : ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు. భారత ప్రధానిగా నరేంద్ర మోదీ. కేంద్ర, రాష్ట్రాల్లో ఉన్నది కూటమి సర్కారు. ఇది చాలదా. ఇంకేం కావాలి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి రేసుగుర్రంలా పరుగులు పెడుతోంది. ఆంధ్రుల రాజధాని అమరావతి నుంచి.. విశాఖపట్నం వరకు నిధుల వరద పారుతోంది. ఏపీని వెతుక్కుంటూ మరీ కేంద్ర నిధులు క్యూ కడుతున్నాయి. అందుకు ఈ లెక్కలే ఎగ్జాంపుల్.
ఇప్పుడే కాదు. గత సర్కారు హయాంలోనూ ఏపీకి ఇవ్వాల్సిన నిధులు ఇచ్చామంటోంది కేంద్ర ప్రభుత్వం. ప్రధానంగా అమరావతి, విశాఖలకు భారీగా డబ్బులు కుమ్మరించామని చెబుతోంది. సిటీ ఇన్వెస్ట్‌మెంట్స్ టు ఇన్నోవేట్, ఇంటిగ్రేట్ అండ్ సస్టైన్ (CITIIS) పథకం 1.0 & 2.0 లో భాగంగా అమరావతికి 72 కోట్లు, విశాఖకు 52 కోట్లు ఇచ్చినట్టు వెల్లడించింది. పార్లమెంట్‌లో ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర గృహనిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ సహాయ మంత్రి తోఖన్ సాహు లిఖిత పూర్వకంగా ఆన్సర్ ఇచ్చారు.
2019 మార్చి 6న CITIIS పథకం అమలుకు ఏపీలో ఒప్పందం జరిగిందని కేంద్రమంత్రి తెలిపారు. గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తున్న 39 స్కూల్స్‌ల అప్‌గ్రేడేషన్ కోసం కేంద్రం 52 కోట్లు ఇచ్చినట్టు చెప్పారు.
సీఐటీఐఐఎస్ 1.0 కింద అమరావతి నగరానికి 15 ఇ-హెల్త్, వెల్‌నెస్ సెంటర్‌లు, 15 మోడల్ అంగన్‌వాడీ కేంద్రాలు, 14 ప్రైమరీ స్కూల్స్, ఒక బహుళ ప్రయోజన స్మశాన వాటిక అభివృద్ధికి ప్రతిపాదించామని కేంద్రమంత్రి తెలిపారు. ఇందుకోసం 72 కోట్లు మంజూరు చేస్తే.. అయితే 66.47 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని కేంద్ర మంత్రి లోక్‌సభకు తెలిపారు.
2023 మే 31న CITIIS 2.0 పథకం స్టార్ట్ అయింది. నగరాల్లో వ్యర్థాల నిర్వహణ, రాష్ట్రాల్లో వాతావరణ సంస్కరణలు ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. 21 స్టేట్స్‌ను ఎంపిక చేయగా ఇందులో ఏపీ కూడా ఉంది. 2025 మార్చి 3 కుదిరిన ఒప్పందం మేరకు ఆంధ్రప్రదేశ్‌కు 23 కోట్లు కేటాయించింది కేంద్రప్రభుత్వం.