BigTV English

Income Tax Bill 2025: ట్యాక్స్ కట్టే వారికి కేంద్రం ఝలక్

Income Tax Bill 2025: ట్యాక్స్ కట్టే వారికి కేంద్రం ఝలక్

Income Tax Bill 2025: 12 లక్షల వరకు నో ట్యాక్స్ అని బడ్జెట్‌లో ప్రకటించగానే దేశం మొత్తం అవాక్కైంది. ఇక్కడిదాకా ఓకే. ఇప్పుడు చెప్పబోయే విషయం వింటే.. 12 లక్షల ఆదాయం దాటి పన్ను కట్టేవాళ్లంతా కచ్చితంగా షాక్ అవుతారు. ఏదో రకంగా.. ఎంతో కొంత ట్యాక్స్ ఎగ్గొట్టాలనుకునేవాళ్లందరికీ ఇదో హెచ్చరిక. ఇకపై.. మీ వాట్సాప్ మెసేజ్‌ల్ని, ట్రావెల్ హిస్టరీని, టెక్ట్స్ మెసేజ్‌లన్నింటిని.. సర్కార్ యాక్సెస్ చేయబోతోంది. మీరు కట్టే పన్ను సాక్షిగా.. మీరు విన్నది నిజమే!


అధికారుల యాక్సెస్ లోకి జనం గూగుల్, వాట్సాప్ డేటా

పార్లమెంట్ సాక్షిగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్.. మైండ్ బ్లాంక్ అయ్యే ప్రకటన చేశారు. రాబోయే రోజుల్లో.. ఇన్‌కం ట్యాక్స్ అధికారులు దేశ ప్రజల గూగుల్, వాట్సాప్ డేటాని యాక్సెస్ చేయబోతున్నారు. ఇప్పటికే.. దేశంలోని టాక్స్ ఎగవేతదారుల్ని కనిపెట్టేందుకు.. సరికొత్త టెక్నాలజీతో కూడిన ఏఐ టూల్స్‌ని ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ వినియోగిస్తోంది. ఇందుకు అనుగుణంగా.. ఆదాయ పన్ను చట్టంలో కొత్త మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నారు. అక్రమార్కులను, పన్ను ఎగవేతదారుల్ని పట్టుకునేందుకు.. మరిన్ని డిజిటల్ ఆధారాల్ని సేకరించేందుకు రూట్ క్లియర్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ చర్యలు.. పన్ను ఎగవేతదారులకు పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పాలి.


డిజిటల్ ఆస్తుల్ని ట్రాక్ చేసేందుకు నిబంధనల్లో మార్పులు

కొత్త ఆదాయ పన్ను బిల్లు-2025 కింద.. డిజిటల్ ఆస్తుల్ని ట్రాక్ చేసేందుకు, చట్టపరమైన నిబంధల్ని బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మార్పులు చేస్తున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలియజేశారు. గతంలో ఉన్న ఇన్‌కం ట్యాక్స్ చట్టాలు.. ఈ తనిఖీలకు యాక్సెస్ ఇవ్వలేదని.. ఇప్పుడు మారిన పరిస్థితులకు అనుగుణంగా తీసుకొస్తున్న కొత్త ట్యాక్స్ చట్టంలో మార్పులు చేసినట్లు తెలిపారు. పన్నుఎగవేతదారుల్ని అడ్డుకునేందుకు.. చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పారు. ఈ మార్పులకు సంబంధించి.. లోక్‌సభలో సమాధానం ఇచ్చారు నిర్మల. నిజానికి.. చాలా మంది పన్నుఎగవేతదారులు లెక్కల్లో చూపని నల్లధనాన్ని వెలికితీయడంలో.. డిజిటల్ ఫోరెన్సిక్ కీలకపాత్ర పోషించింది.

లెక్కల్లో చూపని రూ.250 కోట్ల డబ్బు గుర్తింపు

మొబైల్ ఫోన్లలో ఎన్‌క్రిప్ట్ చేసిన మెసేజ్‌లని అనలైజ్ చేయడంతో.. లెక్కల్లో చూపని 250 కోట్ల డబ్బుని ఇన్‌కం ట్యాక్స్ అధికారులు వారి దర్యాప్తులో గుర్తించారు. అదేవిధంగా.. క్రిప్టో కరెన్సీ ఆస్తులకు సంబంధించిన ఆధారాల్ని కూడా వాట్సాప్ సందేశాల ద్వారా కనుగొన్నారు. వాట్సాప్ కమ్యూనికేషన్.. లెక్కల్లో చూపని 200 కోట్ల డబ్బుని వెలికితీసేందుకు సహాయపడిందని నిర్మలా సీతారామన్ చెప్పారు. అందువల్ల.. ప్రజల డిజిటల్ ఫుట్ ప్రింట్స్ ఇన్‌కం ట్యాక్స్ అధికారులకు కీలకంగా మారనున్నట్లు ఆవిడ బలంగా చెబుతున్నారు. అందువల్ల.. ట్యాక్స్ ఎగ్గొట్టాలనుకునేవారు.. తమ డబ్బుని దాచేందుకు తరచుగా ట్రావెల్ చేసిన ప్రదేశాల వివరాలని సైతం.. గూగుల్ మ్యాప్స్ హిస్టరీ నుంచి తీసుకున్నట్లు చెప్పారు. అలాగే.. బినామీ ఆస్తుల్ని నిరూపించేందుకు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను కూడా అనలైజ్ చేసినట్లు తెలిపారు నిర్మల.

బయటపడిన లావాదేవీలపై భారీ జరిమానాలు, జైలు శిక్ష

కొత్త ఆదాయపు పన్ను చట్టం అమల్లోకి వస్తే.. పన్ను ఎగవేతదారులు తమ ఆర్థిక లావాదేవీలను దాచేందుకు ఉపయోగించే డిజిటల్ మార్గాలన్నీ బయటకొస్తాయ్. క్రిప్టో కరెన్సీ, ఆఫ్‌షోర్ ఖాతాల రూపంలో వారు దాచిన ఆదాయాన్ని కనుగొనేందుకు అధికారులకు వీలవుతుంది. ఇలా బయటపడిన లావాదేవీలపై భారీ జరిమానాలు, వడ్డీతో కూడిన బకాయిలు, కొన్ని సందర్భాల్లో జైలు శిక్షలు కూడా విధించే అవకాశం ఉంటుంది. ఇది.. పన్ను ఎగ్గొట్టాలనుకునే వాళ్లందరికీ.. ఆర్థికంగానూ, చట్టపరంగానూ చిక్కుల్లో పడేస్తుంది.

ఎంత డబ్బు సంపాదించినా ట్యాక్స్ కట్టేయాలని సూచన

డిజిటల్ డేటా యాక్సెస్ వల్ల.. పన్ను ఎగవేతదారులు ఐటీ అధికారుల మానిటరింగ్‌లో ఉంటారు. దీని వల్ల.. వారు తమ ఆర్థిక కార్యకలాపాల్ని దాచడం కష్టమవుతుంది. ట్యాక్స్ ఎగవేతలో భాగంగా నగదు లావాదేవీలు, నకిలీ బిల్లులు ఉపయోగించే వాళ్లంతా.. డిజిటల్ ట్రాకింగ్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందువల్ల.. ఇకపై పన్ను ఎగ్గొట్టే ఆలోచన ఉన్నవాళ్లంతా మానుకోవాలని.. ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఎంత డబ్బైనా సంపాదించుకోండి గానీ.. పద్ధతిగా ట్యాక్స్ మాత్రం కట్టేయండి. మిగిలిన మొత్తాన్ని.. హాయిగా ఖర్చు పెట్టుకోండి. అనే సూచనలు వినిపిస్తున్నాయి.

కొత్త ఆదాయపు పన్ను చట్టంతో రాబోయే మార్పులేంటి?

ఇప్పటివరకు పన్ను ఎగవేతదారులు చూపిందే లెక్క. కట్టిందే ట్యాక్స్. కానీ.. ఇకపై అలా ఉండదు. మీరు చూపిన లెక్కతో పాటు చూపని లెక్కకు కూడా పన్ను కట్టాల్సిందే. కొత్త పన్ను చట్టం తీసుకొచ్చే డిజిటల్ యాక్సెస్‌ వెసులుబాటుతో.. మొత్తం సీనే మారబోతోంది. కొత్త ఆదాయపు పన్ను చట్టంతో రాబోయే మార్పులేంటి? దాని వల్ల.. దేశ పౌరుల గోప్యత విషయంలో సమస్యలు వస్తాయా?

చట్టపరమైన మద్దతు కోసం కొత్త నిబంధనలు

ప్రస్తుతం డిజిటల్ లావాదేవీలను విచారించేందుకు.. ఇప్పుడున్న ఆదాయ పన్ను చట్టంలో తగిన నిబంధనలు లేవు. దాంతో.. ప్రభుత్వం చట్టపరమైన మద్దతు కోసం కొత్త నిబంధనల్ని ప్రతిపాదించింది. దీని వల్ల.. లెక్కల్లో చూపని సంపదని వెలికితీసేందుకు డిజిటల్ ఫోరెన్సిక్ పాత్ర పెరుగుతుంది. దీని ద్వారా క్రిప్టో కరెన్సీతో పాటు వర్చువల్ డిజిటల్ ఆస్తులన్నీ.. ఐటీ శాఖ నజర్ నుంచి తప్పించుకోవు. ఇకపై కొత్త ట్యాక్స్ బిల్.. ఇన్‌కం ట్యాక్స్ అధికారులకు ప్రజల ఈ-మెయిల్స్, వాట్సాప్, టెలిగ్రామ్ లాంటి కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్స్‌కి యాక్సెస్ ఇవ్వనుంది.

పన్ను ఎగవేతలపై ఖచ్చితమైన మొత్తం లెక్కించే వీలు

అలాగే.. ఆర్థిక లావాదేవీలను దాచేందుకు ఉపయోగించే ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్, క్లౌడ్ స్టోరేజ్, సర్వర్లు యాక్సెస్ చేసేందుకు కూడా చట్టం అనుమతి కల్పించనుంది. డిజిటల్ అకౌంట్స్ నుంచి ఆధారాలు సేకరించడం ద్వారా కోర్టుల ముందు పన్ను ఎగవేతని నిరూపించనున్నారు. అలాగే.. పన్ను ఎగవేతలపై కచ్చితమైన మొత్తాన్ని లెక్కించేందుకు.. కొత్త ట్యాక్స్ చట్టం వీలు కల్పిస్తుందని చెబుతున్నారు.

పాస్ వర్డ్‌లు, యాక్సెస్ కోడ్‌ల లాంటివేవీ అసరం లేదు!

కొత్త ట్యాక్స్ బిల్ ప్రకారం.. ఐటీ అధికారుల దర్యాప్తు ఇకపై కాగితాలు, భౌతిక ప్రాంగణాలకు మాత్రమే పరిమితం కావు. కొత్త చట్టం.. పన్ను పరిశీలనని డిజిటల్ రంగానికి కూడా విస్తరిస్తుంది. కొత్త రూల్స్ ప్రకారం.. కీలకమైన సమాచారాన్ని నేరుగా పొందేందుకు పాస్‌వర్డ్‌లు, యాక్సెస్ కోడ్‌ల లాంటివేవీ అవసరం లేని అధికారాన్నిస్తాయి. దీని వల్ల.. భవిష్యత్తులో లెక్కల్లో చూపని నగదుకు సంబంధించి.. ప్రజలకు పన్ను ఎగవేత నోటీసులు సైతం వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక.. ఆస్తుల అటాచ్‌మెంట్‌లోనూ కీలక మార్పు రాబోతోంది.

డిజిటల్ లావాదేవీల సవాళ్లను పరిష్కరించడమే లక్ష్యం

గతంలో.. ఇన్ కం ట్యాక్స్ అధికారులు ఆస్తుల్ని స్వాధీనం చేసుకునే ముందు.. నోటీస్ జారీ చేయాల్సి వచ్చేది. ఇప్పుడలా కాదు.. ముందస్తు నోటీసు లేకుండానే.. సోదాల సమయంలోనే.. వెంటనే ఆస్తుల్ని ఆటాచ్ చేయొచ్చు. ఇది.. ఆరు నెలల వరకు అమలులో ఉంటుంది. ఈ సమయంలో.. యజమాని ఆస్తిని అమ్మకుండా, బదిలీ చేయకుండా నిరోధిస్తుంది. ప్రస్తుతం.. దేశంలో 1961 నాటి ఆదాయ పన్ను చట్టం అమల్లో ఉంది. ఇప్పుడు.. కొత్తగా తీసుకురాబోయే ఆదాయపు పన్ను బిల్లు 2025.. పార్లమెంటరీ కమిటీ సమీక్షలో ఉంది. ఇది.. భారతదేశ పన్ను చట్టాన్ని ఆధునీకరించడంతో పాటు డిజిటల్ లావాదేవీల వల్ల తలెత్త సవాళ్లను పరిష్కరించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

కొత్త బిల్లులో 23 అధ్యయాలకు తగ్గింపు

మన దేశంలో ప్రస్తుతం 1961 ఆదాయపు పన్ను చట్టం అమల్లో ఉంది. దీనిని సరళీకరించేందుకు, ఆధునీకరించేందుకు.. నూతన ఆదాయపు పన్ను చట్టం-2025 బిల్లుని తీసుకొచ్చారు. ప్రస్తుతం.. ఇది పార్లమెంట్ సెలెక్ట్ కమిటీ పరిశీలనలో ఉంది. ఇప్పుడున్న చట్టంలో 47 అధ్యాయాలు, 1200 రూల్స్, 900 స్పష్టీకరణలు ఉండగా.. కొత్త బిల్లులో దీనిని 23 అధ్యాయాలకు తగ్గించారు. మొత్తం పదజాలాన్ని 5.12 లక్షల పదాల నుంచి తగ్గించి 2.6 లక్షల పదాలకు సరళీకరించారు. ఇది.. పన్ను చెల్లించే ప్రతి ఒక్కరికీ.. చట్టాన్ని అర్థం చేసుకునేందుకు వీలవుతుంది. ప్రధానంగా.. డిజిటల్ లావాదేవీలు, క్రిప్టోకరెన్సీలు, ఆన్‌లైన్ ఆస్తులపై.. ఇన్ కం ట్యాక్స్ అధికారులకు మరింత యాక్సెస్ ఇవ్వడం ద్వారా పన్ను ఎగవేతలని అరికట్టేందుకు వీలవుతుంది.

వ్యక్తిగత సమాచార దుర్వినియోగానికి దారితీసే ప్రమాదం

అయితే.. డిజిటల్ డేటా యాక్సెస్ పెరగడం వల్ల.. పన్ను చెల్లింపుదారుల గోప్యతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అధికారులకు ఇచ్చిన ఈ అనుమతులు.. వ్యక్తిగత సమాచార దుర్వినియోగానికి దారితీసే ప్రమాదం ఉందని కొందరు భావిస్తున్నారు. ఈ బిల్లు గనక ఆమోదం పొందితే.. 2026 ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. మొత్తం.. ఈ కొత్త ట్యాక్స్ చట్టం.. పన్ను వ్యవస్థని సరళంగా, పారదర్శకంగా మార్చేందుకు ఉద్దేశించినప్పటికీ.. డిజిటల్ పర్యవేక్షణ పెరగడం, గోప్యత సమస్యలు కొత్త సవాళ్లను తెచ్చిపెట్టొచ్చనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి.

Related News

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

AP BJP: ఏపీలో బీజేపీకి అన్యాయం జరుగుతుందా?

Big Stories

×