Rayalaseema Lift Irrigation: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం ఊహించని షాక్ ఇచ్చింది. కృష్ణా నది నీటిని రాయలసీమకు తరలించేందుకు నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు నిరాకరించింది. ఫిబ్రవరి 27న జరిగిన సమావేశంలో ఎక్స్‌పర్ట్ అప్రైజల్ కమిటీ ప్రాజెక్టు అనుమతులపై ఆక్షేపణ వ్యక్తం చేసింది.
అసలేం జరిగింది?
తెలంగాణకు చెందిన శ్రీనివాస్ జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో దాఖలు చేసిన కేసులో ఎన్జీటీ ఉత్తర్వులపై గత నెలలో జరిగిన సమావేశంలో ఈఏసీ చర్చించింది. పర్యావరణ అనుమతులకు దరఖాస్తు చేసే ముందు ప్రాజెక్టు ప్రాంతంలో ఎలాంటి పనులు చేపట్టలేదని తీసుకెళ్లారు. ప్రాజెక్టు ప్రాంతానికి సంబంధించిన ఆధారాలు, పునరుద్ధరణ పద్ధతులు, ఫొటోలు జత చేయాలని సూచించింది.
అక్రమంగా చేపట్టిన ఆ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వబోమని చెప్పకనే చెప్పింది. ప్రాజెక్టును ఆపాలంటూ కాంగ్రెస్ సర్కారు చేస్తున్న పోరాటం ఫలితంగా ఏపీకి ఈఏసీ వార్నింగ్ ఇచ్చింది. తాజాగా విడుదల చేసిన ఎక్స్‌పర్ట్ అప్రైజల్ కమిటీ- ఈఏసీ మినిట్స్‌లో పలు అంశాలను ప్రస్తావించింది.
ఏవైనా పక్కదారి పట్టించే చర్యలకు పాల్పడితే చర్యలు ఉంటాయని పేర్కొంది. ప్రాజెక్టు అనుమతులు పొందాలంటే పూర్వ స్థితితో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు 3 టీఎంసీలు (34,722 క్యూసెక్కులు) తరలించేలా ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టింది.
ALSO READ: శ్రీవారి దర్శనం పేరుతో భక్తురాలికి కుచ్చుటోపీ
ఏంటి రాయలసీమ లిప్ట్ ఇరిగేషన్
శ్రీశైలం జలాశయం నుంచి తాగు నీటి అవసరాలకు 797 అడుగుల స్థాయి నుంచి నీటిని ఎత్తిపోసేలా నిర్మాణాన్ని చేపట్టారు. ఆ జలాలను పోతిరెడ్డిపాడు దిగువన శ్రీశైలం కుడి ప్రధాన కాలువలో పోసి అక్కడి నుంచి చెన్నైకి తాగునీటి సరఫరాతో పాటు ఇతర పథకాల ద్వారా తరలించాలనేది ప్రధాన లక్ష్యం.
ఈ నిర్మాణంపై జాతీయ హరిత ట్రైబ్యునల్-చెన్నైలో పిటిషన్ దాఖలైంది. ఇందులో తెలంగాణ కూడా ఇంప్లీడ్ అయ్యింది. ఎన్జీటీ ఆదేశాల మేరకు కేంద్ర కమిటీ ఏర్పాటైంది. డీపీఆర్ రూపొందించే స్థాయి కన్నా ఎక్కువ పనులు జరిగాయని తేల్చింది. పర్యావరణ అనుమతులు లేకుండా చేస్తున్నారంటూ కమిటీ నివేదిక ఇచ్చింది.
ప్రాజెక్టులో తొలి దశకు పర్యావరణ అనుమతులు అవసరంలేదని ఏపీ పేర్కొంది. ఈ క్రమంలో రెండోదశ అనుమతులకు దరఖాస్తు చేసింది. చివరకు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ పర్యావరణ అనుమతులు ఇచ్చేందుకు నిరాకరించింది.
తెలంగాణ ప్రభుత్వం రియాక్షన్
రాయలసీమ ఎత్తిపోతలకు పథకానికి ఈఏసీ అనుమతుల నిరాకరణ రాష్ట్రప్రభుత్వం ఫలితమేనని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. కరవు పీడిత కృష్ణా పరీవాహకంలోని రైతులకు ఊరటనిచ్చే అంశమన్నారు. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు అంశంలో అంతర్ రాష్ట్ర నిబంధనల ఉల్లంఘనలు ఉన్నాయన్నారు.
కేఆర్‌ఎంబీ, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేకుండా పూర్తి చేయాలన్నది ఏపీ సర్కార్ లక్ష్యం. పర్యావరణ చట్టాలను ఉల్లంఘించి పనులు మొదలు పెట్టారని తెలిపారు. రాయలసీమ ఎత్తిపోతల పనులను అడ్డుకునేందుకు కాంగ్రెస్ సర్కార్ తీవ్రప్రయత్నాలు చేసిందన్నారు. ఎన్జీటీ, పర్యావరణ మంత్రిత్వశాఖ, జలశక్తి శాఖ, కృష్ణా బోర్డు, బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్, సుప్రీంకోర్టుల్లో తనవంతు ప్రయత్నాలు ముమ్మరం చేసిందన్నారు.
తెలంగాణ నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాతోపాటు తాము పలుమార్లు కేంద్ర పర్యావరణ అటవీశాఖ మంత్రికి రాయలసీమకు పర్యావరణ అనుమతులు ఇవ్వొద్దంటూ లేఖలు రాశామన్నారు. వీటి ఫలితమే ఆ ప్రాజెక్టుకు అనుమతుల జారీ నిలిచిపోయిందన్నారు. రాయలసీమ నిర్మాణాన్ని అడ్డుకోకుంటే కృష్ణా పరీవాహక ప్రాంతంలో సాగు, తాగునీటికి దుర్భర పరిస్థితి ఏర్పడి ఉండేదన్నారు.