వైసీపీ నేతలు మొన్నటివరకు సిద్ధం.. సిద్ధం అని ఎగిరిపడ్డారని, అసెంబ్లీకి వచ్చేందుకు సిద్ధమా..? అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు సీఎం చంద్రబాబు. మొన్న జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట ఉప ఎన్నికలపై తాము చర్చకు సిద్ధమని, వివేకా హత్య, కోడికత్తి డ్రామా, గులకరాయి నాటకాలపై కూడా చర్చకు సిద్ధమని అన్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం మునక్కాయలవారిపల్లెలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ప్రతిపక్షంగా కూడా వైసీపీ విఫలమైందని ధ్వజమెత్తారు. వైసీపీకి 11మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, వారంతా అసెంబ్లీకి రావాలని చంద్రబాబు కోరారు. సూపర్ సిక్స్ పై అవాకులు చెవాకులు పేలుతున్నారని, అసెంబ్లీకి వస్తే.. ఏ పథకం కింద ఎంతమంది లబ్ధిదారులున్నారో చెప్పడానికి తాము సిద్ధంగా ఉన్నామని, వారి ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం, సత్తా తమ ప్రభుత్వానికి ఉందని చెప్పారాయన.
సిద్ధం .. సిద్ధం అని నినాదాలు చేసిన వారికి సవాల్.. నేను సిద్ధం…
అసెంబ్లీకి వచ్చేందుకు మీరు సిద్ధమా ?
అసెంబ్లీలో ఎవరిది విధ్వంసమో, ఎవరిది అభివృద్ధో,
ఎవరిది సంక్షేమమో చర్చిద్దాం..
బాబాయ్ హత్యపై కూడా చర్చకు సిద్ధం.
మరి నువ్వు సిద్ధమా? @ysjagan ? #ChandrababuNaidu… pic.twitter.com/hRjBl7uLBK— Telugu Desam Party (@JaiTDP) September 1, 2025
తప్పుడు ప్రచారం ఆపండి..
వైసీపీ హయాంలో రాయలసీమలో రక్తం పారించారని, కూటమి ప్రభుత్వం వచ్చాక సాగునీరు పారుతోందని చెప్పారు సీఎం చంద్రబాబు. కష్టాల్లో ఉన్న మామిడి రైతులను తమ ప్రభుత్వమే ఆదుకుందని గుర్తు చేశారు. మామిడికాయలు రోడ్డుపై పోసి వైసీపీ నేతలు డ్రామాలాడారని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేముందు పదిసార్లు ఆలోచించాలని హితవు పలికారు. కడప, రాజంపేట మీదుగా కోడూరుకు నీళ్లు తీసుకెళ్తామని.. రాజంపేట ప్రాంతంలో ఉద్యానపంటలు, డెయిరీ, పశుసంపద బాగా పెరిగాయని చెప్పారు చంద్రబాబు. రాయలసీమ ఇక నుంచి రాళ్ల సీమ కాదని, రతనాల సీమ అని ఆయన అన్నారు. ఆడవారిపై అఘాయిత్యాలు చేసేవారికి అదే చివరి రోజు అవుతుందని, మహిళల ఆత్మగౌరవం దెబ్బతీస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
సవాళ్లను అధిగమించాం..
దేశంలో ఆర్థిక సంస్కరణలు అమలు చేస్తేనే మంచి మార్పులు వస్తాయని చెప్పారు సీఎం చంద్రబాబు. పేదవారి జీవితాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పని చేస్తోందన్న్నారు. సంపద సృష్టించడం చేతనైతేనే సంక్షేమ పథకాలు అమలు చేయవచ్చన్నారు. అప్పులు చేసి ఖర్చులు పెంచుకుంటే ఏ కుటుంబం కూడా బాగుపడదని, ఆదాయాన్ని పెంచుకున్నప్పుడే జీవితాల్లో మార్పు సాధ్యం అవుతుందని వివరించారు. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రకు అనేక కష్టాలు వచ్చాయని గుర్తు చేశారు చంద్రబాబు. విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన తాము 2014-19 మధ్య కాలంలో దేశంలో ఎక్కడా జరగని అభివృద్ధిని చేసి చూపించామన్నారు. ఆ తర్వాత ఐదేళ్లు అరాచకం రాజ్యమేలిందని, తిరిగి కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలకు మళ్లీ స్వేచ్ఛ లభించిందన్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలు విజ్ఞత చూపించి ఓటు వేశారని చెప్పారు.
అర్హులకు అన్యాయం జరగదు..
దివ్యాంగుల పెన్షన్లపై వైసీపీ విష ప్రచారం చేస్తోందని మండిపడ్డారు సీఎం చంద్రబాబు. వైసీపీ హయాంలో అనర్హులకు కూడా పెన్షన్లు ఇచ్చారని, వాటిని సరిచేస్తుంటే తమపై నిందలు వేస్తున్నారని అన్నారు. దివ్యాంగుల పెన్షన్ల విషయంలో అర్హులైన ఏ ఒక్కరికీ అన్యాయం జరగగని, అనర్హులకు మాత్రం ఆర్థిక సాయం ఆగిపోతుందన్నారు. అనర్హులు పెన్షన్లు తీసుకోకుండా ప్రజలే ఆపాలని సూచించారు.