Amaravati: రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమానికి వైభవంగా నిర్వహించాలని భావిస్తోంది కూటమి సర్కార్. ఇందుకు సంబంధించి అంతా రెడీ అయ్యింది. ఇప్పటికే ప్రముఖులకు ఆహ్వానాలు పంపింది. ఆహ్వానాలు అందుకున్న వారిలో మాజీ సీఎం జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ కార్యకర్తల ఒత్తిడి మేరకు ఆయన హాజరయ్యే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అమరావతి పనుల పునఃప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. ప్రధాని నరేంద్రమోదీ రానున్న నేపథ్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. దాదాపు మూడు లక్షల మందిని సభకు వస్తారని అంచనా వేస్తోంది. మిగతా జిల్లాల కంటే ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి ప్రజలు రావచ్చని లెక్కలు వస్తోంది. కేవలం ప్రధాని మోదీ మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులకు ఆహ్వానాలు వెళ్లాయి.
భారీ ఎత్తున ఏర్పాట్లు
ముగ్గురు మంత్రుల (నారాయణ, పయ్యావుల కేశవ్, నాదెండ్ల) కమిటీ ఆహ్వానాలు పంపించింది. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. మాజీ సీఎం జగన్‌కు ఆహ్వానం పంపింది ఆ కమిటీ. తాడేపల్లి నివాసంలో జగన్ అందుబాటులో లేకపోవడంతో ఆయన పీఏకు ఆహ్వాన పత్రికను అందజేశారు ప్రొటోకాల్ అధికారులు. ఇంతకీ జగన్ వెళ్తారా? లేదా అన్నది ఏపీ అంతటా చర్చ మొదలైంది.
ఈ కార్యక్రమానికి జగన్ కచ్చితంగా వెళ్లరని దాదాపు 90 శాతం మంది చెబుతున్నారు. ఎందుకంటే రాజధాని అమరావతిని మూడు ముక్కలు చేసిన ఆయన, ఏ ముఖం పెట్టుకుని వస్తారన్నది కొందరి మాట. ఈవెంట్‌కు ఆయన హాజరుపై పెద్దగా చర్చ అవసరం లేదంటున్నారు. రైతులు ఉద్యమం చేస్తుంటే ఉక్కుపాదంతో అణిచి వేశారని, అలాంటి వ్యక్తి ఏ విధంగా వస్తారని అంటున్నారు.
ALSO READ: తిరుమల భక్తులకు అలర్ట్, దర్శన వేళల్లో మార్పులు
నవ్వుల పాలు చేసేందుకేనా?
అమరావతికి వ్యతిరేకం అన్న వ్యక్తి ఇన్విటేషన్ పంపారు? కేవలం మాజీ సీఎం అనే కారణం ఒక్కటేనా? ఆయన్ని అభాసుపాలు చేసేందుకు కూటమి ప్రభుత్వం ఈ స్కెచ్ వేసిందా? అంటూ ప్రశ్నించినవాళ్లు లేకపోలేదు. వైసీపీ ఎత్తుగడ మరోలా ఉంది. ప్రధాని సహా కేంద్రమంత్రులు అంతా రానుండడంతో మోదీతో మాట్లాడేందుకు జగన్‌కు ఇదే సరైన సమయమని అంటున్నారు. ఆ తరహా సందర్భం మళ్లీ రాదని అంటున్నారు.
ఇప్పుడు మాజీ సీఎం వెళ్తే గుంటూరు, కృష్ణా జిల్లాల ప్రజల మనసు మారుతుందని, వైసీపీకి అనుకూలంగా మారుతుందని అంటున్నారు. అమరావతిని చంపలేదని, మూడు రాజధానుల్లో అది కూడా ఒకటని మాత్రమేనని అంటున్నారు ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాజీ సీఎం ఆ ఈవెంట్‌కు వెళ్లరని బలంగా చెబుతున్నారు.
ఒకవేళ మాజీ సీఎం జగన్ ఈవెంట్‌కి వెళ్తే కూటమి నేతలు మరింత చులకనగా చూస్తారని అంటున్నారు. అయినా సీఎం ప్రమాణ స్వీకారానికి వెళ్లలేదని, ఇప్పుడు వెళ్లడం కష్టమని అంటున్నారు. ఇలాంటి సమయంలో మాజీ సీఎం వస్తారనేది లేదా అన్నదానికి రకరకాలుగా ఊహాగానాలు లేకపోలేదు.