Chandrababu govt: శాంతి భద్రతలపై చంద్రబాబు సర్కార్ ఫోకస్ చేసిందా? కేవలం నెల రోజులు మాత్రమే టార్గెట్ పెట్టుకుందా? కింది స్థాయి నుంచి పోలీసు శాఖలో ప్రక్షాళన అప్పుడే మొదలయ్యిందా? డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యల తర్వాత అసలు విషయం ముఖ్యమంత్రికి తెలిసిందా? వేటు పడే అధికారుల జాబితా సిద్ధమయ్యిందా? ముగ్గురు ఎస్పీలు, ఐదుగురు డీఎస్పీలు ఇన్నారా? ఇప్పటికే అధికారుల జాబితా డీజీపీ ఆఫీసుకు చేరిందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
ఏపీలో చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చి ఐదునెలలు గడిచిపోయింది. అయినా శాంతి భద్రతల విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదనే విమర్శలు జోరందుకున్నాయి. హోం మంత్రి అనిత, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రభుత్వంలో చలనం వచ్చినట్టు కనిపిస్తోంది.
ఈ క్రమంలో కడప ఎస్పీ హర్షవర్థన్ రాజుపై బదిలీ వేటు పడింది. వైఎస్ భారతి పీఏ రవీందర్‌రెడ్డి విషయంలో ఖాకీలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఆయన వైసీపీకి అనుకూలంగా ఉన్నారనే దానిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ప్రభుత్వం యాక్షన్ మొదలుపెట్టింది.
బుధవారం చంద్రబాబు కేబినెట్ మీటింగ్ జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెళ్లేసరికి సోషల్ మీడియా అంశంపై చర్చ జరుగుతోంది. మహిళలను చూడకుండా అసభ్యకరంగా పోస్టింగులు పెడుతున్నారని అన్నారట. ఈ విషయంలో ఎందుకు చర్యలు చేపట్టలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారట డిప్యూటీ సీఎం.
ALSO READ: టీడీ కొత్త టీమ్ ఏం చేయబోతుందంటే..?
పవన్ అభిప్రాయంతో మంత్రులంతా ఏకీభవించారని తెలుస్తోంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు మూడు అంశాలు వివరించారట. ఉమ్మడి ఏపీలోని హైదరాబాద్‌లో మత కల్లోలాలు అణిచివేయడం, ఫ్యాక్షనిజం, మావోయిస్టులను కంట్రోల్ చేసిన విషయాన్ని గుర్తు చేశారట.
ఆ రోజు పక్కాగా ప్లాన్ చేసి అమలు చేశామని, ఇప్పుడు డిజిటల్ వేదికగా రెచ్చిపోతున్న వారిపై నెలరోజుల్లో ఉక్కుపాదం మోపుదామని సూచన చేశారు. ఈ విషయంలో పోలీసులు యాక్షన్ తీసుకోని పక్షంలో వారిని మార్చివేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు అంతర్గత సమాచారం.
రవీందర్‌రెడ్డి వ్యవహారంలో సీఐని సస్పెండ్ చేయడంతోపాటు ఎస్పీ హర్షవర్థన్ రాజును డీజీపీ ఆఫీసుకి అటాచ్ చేశారు. రాబోయే ప్రభుత్వం ఎంత సీరియస్‌గా వ్యవహరించబోతోందనే దానికి ఇదొక ఉదాహరణ మాత్రమే.
వైసీపీకి ఎవరైతే తొత్తులుగా వ్యవహరిస్తున్నారో ఆ లిస్టు ఇప్పటికే డీజీపీ ఆఫీసుకు చేరినట్టు పోలీసు వర్గాల చెబుతున్నమాట. వారిలో ముగ్గురు ఎస్పీలు, ఐదుగురు డీఎస్పీలు, 15 మంది సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు ఉన్నారట. రేపోమాపో వీరిపై చర్యలు తప్పవని అంటున్నారు. మొత్తానికి ఇప్పటికైనా శాంతిభద్రతల విషయంలో పోలీసులు మొద్దు నిద్ర వీడుతారేమో చూడాలి.