
Chandrababu Health Issues : ఏపీ స్కిల్ డెవల్మెంట్ కేసులో అరెస్టైన మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గత కొన్ని రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఈ కేసుపై ప్రస్తుతం వివిధ కోర్టులలో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే జైలులో ఉన్న నారా చంద్రబాబు నాయుడు పలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని టీడీపీ నాయకులు చెబుతున్నారు.
చంద్రబాబుకు చర్మ సంబంధిత సమస్యలు ఉండడంతో కోర్టు అనుమతితో ఆయనకు జైలులో ఎయిర్ కండీషనర్ ఏర్పాటు చేశారు. అయితే టీడీపీ అధినేతకు మరిన్ని అరోగ్య సమస్యలు ఉన్నాయని.. వాటిని జైలు అధికారులు బహిర్గతం చేయడం లేదని పార్టీ నాయకులు చెప్పారు.
మూడు నెలల క్రితం చంద్రబాబు ఎడమ కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ జరిగిందని, ఇప్పుడు కుడి కంటికి ఆపరేషన్ చేయాల్సి ఉందని టీడీపీ నేతలు పేర్కొన్నారు. స్కిన్ అలర్జీతోపాటు శరీరంపై దద్దుర్లు వ్యాపించి నొప్పి, ఇతరత్రా సమస్యలు వచ్చాయి. ఏసీ పెట్టినప్పటికీ దద్దుర్ల సమస్య తగ్గలేదని తెలిపారు.
వెన్ను కింది భాగంలో నొప్పిగా ఉందని, కూర్చున్నప్పుడు ఇబ్బందిపడుతున్నట్లు గుర్తించారు. దీంతోపాటు చంద్రబాబుకు మల విసర్జన సమస్యలు ఉన్నాయని సమాచారం. దీనిపై చంద్రబాబు కుటుంబసభ్యులు వారి కుటుంబ వైద్యులను సంప్రదిస్తే విరోచనం సాఫీగా కాకపోవడం, నడుం కింది భాగంలో నొప్పి ఉండటం వంటివి లోపల ఏదో సమస్య ఏర్పడుతుందని సూచిస్తున్నట్లు తెలిపారు. దీనిపై ప్రాక్టోస్కోపీ, బ్లడ్, కిడ్నీ, లివర్ వంటి ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహిస్తేనే అసలు సమస్య తెలుస్తుందని, అలాగే వదిలేస్తే ఫిషర్ లాంటి సమస్యకు దారితీసే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు.
తెలుగుదేశం నేత, రాజమహేంద్రవరం అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ జైలులో ఉన్న టీడీపీ అధినేత ఆరోగ్యంపై పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారని, ఆయన ఆరోగ్య సమస్యలను హైకోర్టు దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.
ఈ నేపథ్యంలో న్యాయవాదులు చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాలని హైకోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
NBK: బాలయ్యా.. నోరు అదుపులో పెట్టుకోవయ్యా! పిల్లలతో చెప్పించుకోకయ్యా!!