“ఓటమికి కారణం నేనే..” ఇలా ధైర్యంగా స్టేట్ మెంట్స్ ఇచ్చే నేతలు చాలా అరుదు. కానీ అసెంబ్లీ సెషన్ లో చంద్రబాబు ఇలాంటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2004, 2019లో తన వల్లే పార్టీ ఓడిపోయిందని చెప్పారాయన. పని పని అని పరిగెట్టడం వల్ల కొంత నష్టం జరిగిందన్నారు. తనని ఎవరూ ఓడించలేదని, తన ఓటమికి తానే కారణం అని అన్నారు.
ఓటమికి కారణాలు వెదకమంటే, తాను మినహా మిగతా వారందర్నీ దానికి బాధ్యులుగా చేస్తుంటారు కొంతమంది. ఇప్పటికీ వైసీపీ నేతలు తమ ఓటమికి ఈవీఎంలే కారణం అని అంటుంటారు. 2019లో జరిగిన ఎన్నికల్లో కూడా ఈవీఎంలు ఉన్నా, అప్పుడు వైసీపీ గెలిచినా దాన్ని మాత్రం ప్రస్తావించరు. 2024 ఎన్నికల్లో తమ ఓటమికి ఈవీఎంలదే తప్పంతా అని తేల్చి చెబుతుంటారు. కానీ చంద్రబాబు మాత్రం అలా కాదు. 2004, 2019లో తమ పార్టీ ఓటమికి తానే కారణం అని చెప్పుకొచ్చారు. అప్పట్లో పని పని అంటూ పరిగెట్టే వాడినని, ఎమ్మెల్యేలను, పార్టీని సమన్వయం చేయడం సాధ్యం కాలేదని, అందుకే ఓడిపోయామన్నారు.
తాజాగా ఏపీ అసెంబ్లీలో స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ పై సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నియోజకవర్గాలకు కూడా విజన్ డాక్యుమెంట్లను తయారు చేసుకోవాలని, వాటిని అమలు పరిచే బాధ్యత ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలపై ఉంటుందని చెప్పారాయన. అయితే ప్రభుత్వం ఈ విషయంలో పూర్తిగా సహకరిస్తుందని భరోసా ఇచ్చారు. 2047నాటికి రాష్ట్ర జీడీపీ 2.4 ట్రిలియన్లకు చేరాలని టార్గెట్ ఫిక్స్ చేశామని, ఆ దిశగా ముందడుగు వేయాలన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 17.11 శాతం వృద్ధి సాధించే లక్ష్యాన్ని చేరుకుంటామన్నారు. ప్రధాని మోదీ.. వికసిత్ భారత్-2047 ను అమలు చేస్తున్నారని, రాష్ట్రంలో స్వర్ణాంధ్ర విజన్ ను అమలు చేస్తామని చెప్పారు చంద్రబాబు.
https://x.com/JaiTDP/status/1901476405130723507
వైసీపీ పాలనలో ఏపీ ఆర్థికంగా ధ్వంసమైందని, మళ్లీ ట్రాక్ లో పెట్టగలిగామని చెప్పుకొచ్చారు చంద్రబాబు. జిల్లాలవారీగా ఆర్థిక పరిస్థితుల్ని అధ్యయనం చేస్తున్నామని, మారిన ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా కొత్త ప్రణాళికలు తెరపైకి తెస్తున్నామని చెప్పారు. రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని అన్నారు చంద్రబాబు.
ఇక సూపర్ సిక్స్ అమలుపై కూడా సీఎం చంద్రబాబు అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సూపర్ సిక్స్ అమలు చేసి తీరుతామన్నారు. మే నెలలో తల్లికి వందనం అమలు చేస్తామన్నారు. ఎంతమంది అర్హులుంటే అందరికీ తల్లికి వందనం నిధులు విడుదల చేస్తామని స్పష్టం చేశారు. రైతులకోసం మూడు ఇన్ స్టాల్ మెంట్లలో అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేస్తామన్నారు. మత్స్యకార భరోసా నిధులు కూడా విడుదల చేస్తామన్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్నాయని, గుక్క తిప్పుకోలేని సమస్యలున్నా చెప్పినవి చేసి చూపిస్తామని చెప్పారు. ఇదంతా జరగాలంటే ముందు సంపద సృష్టించాలన్నారు. ఆదాయం పెంచాలని, పెరిగిన ఆదాయంలో కొంత సంక్షేమం కోసం, మిగతాది తిరిగి సంపద సృష్టికోసం వాడాలన్నారు. ఆ సిద్ధాంతాన్ని అమలు చేస్తామని చెప్పారు చంద్రబాబు.
సమాజం ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుందని, నాయకులు, ప్రజలు శాశ్వతం కాదని చెప్పారు చంద్రబాబు. ఈరోజు మనం చేసే పని భావి తరాల భవిష్యత్ ని సృష్టిస్తుందని చెప్పారు. తన కల నెరవేరుతుందని, తన ఆలోచన ద్వారా స్వర్ణాంధ్ర 2047 సాకారమవుతుందని అన్నారు చంద్రబాబు. అందరూ సహకరిస్తే 2047కి భారత్ లో ఏపీ నెంబర్ -1 రాష్ట్రంగా మారుతుందన్నారు. విద్య ఉపయోగాన్ని గతంలో తాను బాగా ప్రచారం చేశానని, తన మాటల వల్ల చాలామంది విద్య గొప్పతనం తెలుసుకున్నారని, పిల్లల్ని బాగా చదివించారని, వారంతా నేడు గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నారని చెప్పారు చంద్రబాబు. పిల్లలకు భూమి ఇవ్వడం వల్ల లాభం లేదని, వారు ప్రయోజకులైతే వందల ఎకరాలు వారే సంపాదిస్తారని, వేల కోట్లు ఆర్జిస్తారని అన్నారు. విద్య ద్వారానే పిల్లలు ప్రయోజకులవుతారన్నారు. విద్య లేకుండా అప్రయోజకులుగా మిగిలిపోతే తల్లిదండ్రులు సంపాదించింది కూడా వృథాయే అన్నారు చంద్రబాబు.
ఇక త్రిభాషా వివాదంపై కూడా చంద్రబాబు స్పందించారు. మూడు భాషలతోనే ఎవరూ ఆగిపోకూడదని అవకాశం ఉంటే ఎన్ని భాషలైనా నేర్చుకోవాలని చెప్పారు. త్రిభాషా సూత్రంపై అనవసర రాజకీయాలు మంచివి కావన్నారు. మాతృభాషలో చదువుకున్నవారు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా రాణిస్తున్నారని, హిందీ నేర్చుకుంటే ఉత్తరాదికి వెళ్లినప్పుడు ఉపయోగపడుతుందని, అంతర్జాతీయ భాషగా ఇంగ్లిష్ కూడా నేర్చుకోవాలని చెప్పారు చంద్రబాబు.