CM Chandrababu: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పైగానే అయ్యింది. కూటమి పాలనలో ఎక్కడ వేసిన గొంగళి అన్నచందంగా తయారైంది. ఈ క్రమంలో మంత్రులు, శాఖల కార్యదర్శులకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు సీఎం చంద్రబాబు. ఇకపై టీమ్‌గా పాలన అందించాలని పిలుపు ఇచ్చారు. అందుకోసం ఏడు గ్రూపులను ఏర్పాటు చేయనున్నారు.
మరో నాలుగు రోజుల్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు మంత్రులు-వివిధ శాఖల కార్యదర్శులతో శనివారం సచివాలయంలో సమావేశమయ్యారు. వారికి స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఇకపై మంత్రులు తమ శాఖలపై పూర్తి అవగాహనతో ఈ సమావేశాలకు రావాలని సీఎం నిర్దేశించారు. ఐదేళ్ల విధ్వంసం నుంచి ఏపీ ఇప్పుడిప్పుడే కుదుటపడుతోందన్నారు.
ఇకపై పాలనలో వేగం పెంచాలని మంత్రులు, కార్యదర్శులకు సూచించారు. ఆయా శాఖలు చూసే మంత్రులు, కార్యదర్శులు కలిసి పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్పకనే చెప్పారు. రాష్ట్రంలో మంచి పాలన అందించాలని చెబుతూనే, అందుకోసం ఏడు గ్రూపులను ఏర్పాటు చేయాలన్నారు.
వ్యవసాయం తదితర మౌలిక విభాగాలు, పరిశ్రమలు, సేవలు, యువజన వ్యవహారాలు-పర్యాటకం, రెవెన్యూ, శాంతిభద్రతలు, ఐటీ వంటి విభాగాలు ఉండనున్నాయి. రాష్ట్ర స్థూల ఉత్పత్తి కొన్ని జిల్లాల్లో పెరుగుతోందని, మరి కొన్నిజిల్లాల్లో తగ్గుతోందన్నారు. హెచ్చుతగ్గులను సరి చేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని చెప్పకనే చెప్పారు.
ALSO READ: బార్ల లైసెన్సులపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
అన్నిస్థాయిల అధికారులు ఎప్పటికప్పుడు కొత్త విషయాలపై అవగాహన ఉండాలన్నారు. వారికి శిక్షణ తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు సీఎం చంద్రబాబు. అమరావతిలో సిద్ధమవుతున్న సీఆర్డీయే భవనంలో హెచ్‌ఆర్‌డీని తాత్కాలిక విభాగాన్ని ఓ అంతస్తులో ఏర్పాటు చేయాలని తీర్మానించారు. వచ్చే నెల రెండున ఈ భవనం అందుబాటులోకి వస్తుందన్నారు.
ఆ రోజు హెచ్‌ఆర్‌డీ కేంద్రాన్ని కూడా ప్రారంభించాలని డిసైడ్ అయ్యారు. ప్రభుత్వం అందిస్తున్న సేవలు, అమలు చేస్తున్న పథకాలపై ప్రజల సంతృప్తి ముఖ్యమని తేల్చి చెప్పారు. అందుకు అనుగుణంగానే మంత్రులు,అధికారులు, ప్రజా ప్రతినిధులు పని చేయాలన్నారు. గత ప్రభుత్వంలో 3శాతం వృద్ధి తగ్గిన కారణంగా ఏపీ సుమారుగా రూ.6 లక్షల కోట్ల సంపద కోల్పోయిందని వివరించారు.
ప్రతి మూడు నెలలకు ఒకసారి కలెక్టర్లతో సమావేశాలు నిర్వహిస్తామని తేల్చిచెప్పారు. సోమవారం నుంచి జరగనున్న కలెక్టర్ల సదస్సు గురించి క్లారిటీ ఇచ్చారు సీఎం చంద్రబాబు. సంక్షేమం, సూపర్ సిక్స్, అన్న క్యాంటీన్లు, పీ4, లాజిస్టిక్స్, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు సంబంధించిన ప్రజంటేషన్ ఇవ్వనున్నారు.
మరుసటి రోజు మానవ వనరుల అభివృద్ధి, వైద్యఆరోగ్యం, విద్య, స్కిల్ డెవల్‌పమెంట్, ఐటీ, క్వాంటమ్ వ్యాలీ, వాట్సాప్ గవర్నెన్స్, డేటాలేక్, ఏఐ వంటి అంశాలు ఉండనున్నాయి. అలాగే రాష్ట్రంలో శాంతిభద్రతలపై ఎస్పీలు-కలెక్టర్లతో సమీక్షిస్తామన్నారు.