AP Govt: కొత్త ఏడాది ప్రారంభమైంది. తొలిరోజు కూడా మొదలైంది. ఏపీ సీఎం చంద్రబాబు కూడా తొలిరోజు తొలి సంతకం చేశారు. అది కూడా నేరుగా నగదు జమ గురించి, ఆ సంతకం చేయడంతో ఇదొక శుభవార్తగా చెప్పవచ్చు.
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు పూర్తి కావస్తోంది. ఇప్పటికే దీపం పథకం 2.o, డీఎస్సీ నోటిఫికేషన్ కై కసరత్తు, రహదారుల అభివృద్ది, వరద సాయం, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం, పెట్టుబడుల సాధన ఇతర అంశాలు, పథకాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. అలాగే పలు పథకాలను కూడ విజయవంతంగా కొనసాగిస్తోంది. పింఛన్ పెంపుపై అయితే ప్రభుత్వం వరుస శుభవార్తలు చెప్పింది. పింఛన్ దారుడు చనిపోతే వెంటనే అతని భార్యకు పింఛన్ మంజూరు చేయాలని కూడ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అంతేకాదు అర్చకులకు, పాస్టర్స్, ఇమామ్ లకు గౌరవ వేతనం అందించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడ జారీ చేసింది.
2025 ఏడాది వచ్చింది. తొలిరోజు కూడా ప్రారంభమైంది. ఈ దశలో కీలక ఫైలుపై సీఎం చంద్రబాబు సంతకం చేశారు. సీఎంఆర్ఎఫ్ నిధుల విడుదల కోసం ఎన్నో కుటుంబాలు ఎదురుచూపుల్లో ఉన్నాయి. సామాన్య కుటుంబాలకు కష్టకాలంలో ఆదుకొనేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి డబ్బులను వారి ఖాతాల్లో జమ చేస్తారు. ఆనారోగ్యంతో భాద పడుతున్న వారికి ఈ నిధులు ప్రాణవాయువు లాంటిదని చెప్పవచ్చు.
అందుకే నూతన సంవత్సరం తొలిరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదలకు లబ్ది చేకూర్చేలా సీఎంఆర్ఎఫ్ నిధుల విడుదలకు సంబంధించిన ఫైలుపై మొదటి సంతకం చేశారు. దీంతో 1,600 మంది దరఖాస్తుదారులకు రూ. 24 కోట్ల మేర నిధులు విడుదల కానున్నాయి. గత ఏడాది అధికారం చేపట్టిన దగ్గర నుంచి డిసెంబర్ 31 వరకు రూ. 100 కోట్లకు పైగా సీఎంఆర్ఎఫ్ నిధులు పేదవర్గాలకు ఇచ్చారు. ఇప్పటివరకు 7,523 మందికి లబ్ది కలిగింది. బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా చేసిన సంతకంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు సీఎంఆర్ఎఫ్ కోసం విడుదల చేసిన నిధుల మొత్తం రూ. 124.16 కోట్లకు చేరింది. 9,123 మంది మొత్తంమ్మీద ప్రయోజనం పొందినట్లయ్యింది.