AP Cabinet : ఎన్నాళ్లని అలా వదిలేస్తాం.. ఎవరికైనా చూపించండి.. అలా ఊరికే వదిలేయొద్దు.. అనేలా విశాఖ రిషికొండ భవనాలపై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఏపీ కేబినెట్‌లో ప్రత్యేకంగా మాట్లాడారు. రిషికొండ భవనాలను ఎలా ఉపయోగంలోకి తీసుకురావాలో మంత్రులతో ముఖ్యమంత్రి చర్చించారు. వారి సూచనలు కోరారు. మంత్రులంతా రుషికొండను సందర్శించి ఆ తర్వాత ఓ అభిప్రాయానికి రావాలని సూచించారు. ఇదే ఇప్పుడు ఆసక్తికర పరిణామం.
రిషికొండ ప్యాలెస్‌లో ఏముంది? ఎంత ఖర్చు అయింది?
జగన్ హయాంలో పర్యావరణ నిబంధనలకు తూట్లు పొడిచి.. విశాఖలోని రుషికొండను తవ్వేసి.. రెండు భారీ భవనాలను నిర్మించారు. నాలుగున్నర ఎకరాల్లో.. 400 కోట్లతో.. 5 లగ్జరీ బ్లాక్‌లు కట్టారు. కరెంట్ బిల్లులే నెలకు 25 లక్షల వరకూ వచ్చేలా అందులో హంగులు ఉన్నాయి. ఏపీ టూరిజం ఆధ్వర్యంలో కట్టినా.. అది జగన్ నివాసం కోసమేనని అన్నారు. సముద్ర తీరంలో.. విశాలంగా.. బెడ్‌రూమ్స్, డైనింగ్, లివింగ్, కన్వెన్షన్ రూమ్స్‌తో .. రాజభవనంలా ఉంటుంది. మొత్తం 1,48,413 చదరపు అడుగుల విస్తీర్ణం. స్క్వేర్ ఫీట్‌కు 30 వేలు ఖర్చు చేశారని అంటున్నారు. మెయిన్ డోర్ ఖరీదే 30 లక్షలకు పైనే. బాత్రూంలో అమర్చిన కమోడ్ రేట్ సుమారు 12 లక్షలు. స్నానం చేసే బాత్ టబ్‌కు ఇంకో 12 లక్షలు. వాష్‌బేషిన్ రెండున్నర లక్షలు. ఇంతటి లగ్జరీ ప్యాలెస్ చూసి అంతా అవాక్కయ్యారు.
రిషికొండ ప్యాలెస్‌ను ఏం చేయాలి?
ఆ ఖరీదైన భవనాలను ఏం చేయాలో కూటమి ప్రభుత్వానికి అర్థం కావట్లేదు. ఏదైనా దేశపు ఎంబసీకి కానీ.. 7 స్టార్ట్ హోటల్‌కి కానీ అద్దెకు ఇవ్వాలనే ప్రపోజల్స్ ఉన్నాయి. తొలినాళ్లలో కాస్త హడావుడి చేసినా.. ఆ తర్వాత సద్దుమనింగింది. లేటెస్ట్ కేబినెట్ మీటింగ్‌లో మళ్లీ రిషికొండ భవనాల మేటర్ తెరమీదకు వచ్చింది. త్వరలోనే మంత్రుల బృందం రిషికొండ ప్యాలెస్‌ను సందర్శించనుంది. ఆ తర్వాత సీఎం చంద్రబాబుకు సూచనలు చేయనున్నారు. ప్రస్తుతం ఆ బిల్డింగ్స్ కంప్లీట్‌గా వాడుకలో లేవు. కొందరు సెక్యూరిటీ గార్డ్స్ పర్యవేక్షిస్తున్నారు. రిషికొండ భవనాలను వాడుకలోకి తీసుకువస్తే జీవీఎంసీపై పడుతున్న భారమైనా తగ్గుతుందని భావిస్తున్నారు.
Also Read : పాస్టర్ ప్రవీణ్ కేసు కంప్లీట్ డీటైల్స్
పల్లె నిద్రకు చంద్రబాబు పిలుపు
ఇక, ఏపీ కేబినెట్‌లో మరో కీలక ప్రతిపాదన చేశారు సీఎం చంద్రబాబు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇకనుంచి గ్రామాల్లో “పల్లె నిద్ర” చేయాలని ఆదేశించారు. నెలలో 4 రోజులు పల్లె నిద్ర చేయాలని.. ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవాలని.. ప్రభుత్వ పథకాల గురించి వివరించి చెప్పాలని దిశానిర్దేశం చేశారు చంద్రబాబు.