CM Chandrababu: రాబోయే 2029 ఎన్నికలకు టీడీపీ ఇప్పుటి నుంచే రెడీ అవుతోందా? పదే పదే నేతలతో సమావేశాలు అందుకేనా? ఓ వైపు సర్వేలు.. మరోవైపు సమావేశాలు పెట్టి హెచ్చరికల వెనుక కారణం అదేనా? కొందరు నేతలు తీరు మారడం లేదా? అందులో పాతవారితోపాటు కొత్తవారు ఉన్నారా? పార్టీ ఆఫీసులో ఆదివారం జరిగిన సమావేశానికి 56 మంది డుమ్మా కొట్టడంపై ఆయా నేతలు సీఎం చంద్రబాబు లిస్టులో ఉన్నట్టేనా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
ఏపీలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయిన సందర్భంగా టీడీపీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఆదివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో దాదాపు ఏడు గంటలపాటు సుదీర్ఘంగా సాగింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సమావేశం.. సాయంత్రం 6 గంటలకు సాగింది. ఏడాది పాలన గురించి నేతలు, కార్యకర్తలకు వివరిస్తూనే.. అమలు చేసినవాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి వివరించాలని దిశానిర్దేశం చేశారు.
ప్రత్యర్థుల వ్యూహాలు.. గతంలో జరిగిన కొన్ని పరిణామాలను వివరించారు. సుమారు రెండు గంటలు మాట్లాడిన సీఎం చంద్రబాబు.. తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు చురకలు అంటించారు. రాబోయే రెండు, మూడు దశాబ్దాల నాటికి అవసరమైన నాయకత్వాన్ని తీసుకురావాలనే ఆలోచనతో అవకాశం ఇచ్చానని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
పని చేయకుండా సలహాలకే పరిమితమైన ఎమ్మెల్యేలు రాబోయేది కష్టకాలమని స్పష్టంగా చెప్పేశారు. నిత్యం ప్రజల్లో ఉండి వారి మద్దతు ఉన్నవారికే పదవులైనా, టికెట్లయినా ఇస్తామని మరోసారి క్లారిటీ ఇచ్చేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేల పనితీరుపై ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్నానని తెలిపారు.
ALSO READ: క్వాంటమ్ వ్యాలీ సదస్సు.. ఐటీ కంపెనీల ప్రతినిధులకు సీఎం చంద్రబాబు డిన్నర్
సర్వేలను విశ్లేషించి బేరీజు వేస్తున్నానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నట్లు తెలిపారు. రోజుకు నలుగురు ఎమ్మెల్యేలతో వన్ టు వన్ మాట్లాడుతున్నానని వెల్లడించారు. మీరు చెప్పింది వింటానని, తాను సలహాలు ఇస్తానని అన్నారు సీఎం చంద్రబాబు.
నేతలు మారితే ఓకేనని.. మారకుంటే ఆ విధంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుందని కాస్త నవ్వుతూ సున్నితంగా హెచ్చరించారు. ఎలాంటి మొహమాటానికి తావు లేదని తేల్చి చెప్పేశారు. కేవలం ఎమ్మెల్యేలకు మాత్రమేకాదని, సొంత నియోజకవర్గంలో ఎవరు తప్పుచేసినా పక్కన పెడతానని అన్నారు.
ఇప్పుడు గెలిచిన వాళ్లు మళ్లీ మళ్లీ గెలవాలన్నదే నా ఆశ అని, పార్టీలో నేతలంతా ఆ విధంగా ఆలోచన చేయాలని సూచన చేశారు. డబ్బులు పంచి ఎన్నికల్లో గెలుస్తామనే ధీమా వద్దని, గత ఎన్నికల్లో ఎక్కువ ఖర్చు పెట్టిన వాళ్లు కేవలం 11 సీట్లకు పరిమితమయ్యారని గుర్తు చేశారు.
సమావేశానికి గైర్హాజరు కావడానికి కారణాలు తెలుసుకున్నారు అధినేత చంద్రబాబు. కొందరు విదేశీ పర్యటనలని చెప్పారు. మరికొందరు దేవుడి దర్శనానికి వెళ్తున్నామని సమాధానం ఇచ్చారని వివరించారు. నేతలు నియోజకవర్గాల ప్రజలకు దూరంగా ఉండటం సరికాదన్నారు. ఆహ్వానితుల్లో 56 మంది హాజరుకాలేక పోవడంపై అసహనం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు.
ఆదివారం సమావేశానికి ఎంతమంది వచ్చారు? సంతకాలు పెట్టి ఎంతమంది వెళ్లారు? చివరివరకు ఎంతమంది ఉన్నారో తన వద్ద జాబితా ఉందని హెచ్చరించారు. పార్టీ కార్యక్రమాలకు రానివారు నియోజకవర్గాల్లో ఏం తిరుగుతారు? ఏం పని చేస్తారని మండిపడ్డారు. మొత్తానికి కొందరు నేతలకు అధినేత రెండో హెచ్చరిక ఇచ్చారని అంటున్నారు.
CM Warning to MLAs
"నిన్నే స్టార్ట్ చేశా… రోజుకు నలుగురు ఎమ్మెల్యేలు… One to One మాట్లాడతా…"#ChandrababuNaidu #TDPTwitter pic.twitter.com/8svOSIHnSD
— 𝗧𝗗𝗣 𝗧𝗿𝗲𝗻𝗱𝘀 (@Trends4TDP) June 29, 2025