CM Chandrababu: ఈ మధ్యకాలం దక్షిణాది రాష్ట్రాల అధినేతలు సంతానంపై ఫోకస్ చేశారు. పిల్లలను ఎక్కువ మంది కనాలని సమయం, సందర్భం బట్టి చెబుతున్నారు. సీఎం స్టాలిన్, సీఎం రేవంత్‌రెడ్డి, సీఎం చంద్రబాబు ఈ విషయంలో కాస్త ముందు ఉన్నారనే చెప్పవచ్చు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అడుగులు వేయకుంటే ఇబ్బందులు తప్పవన్నది ఆ నేతల మాట.
మహిళా ఉద్యోగులకు తీపి కబురు
తాజాగా ఏపీలో మహిళా ఉద్యోగులకు శుభవార్త చెప్పేశారు సీఎం చంద్రబాబు. ఉత్తర భారతదేశంలో ఒక్కో జంట ముగ్గురు పిల్లలను కలిగి ఉన్నారని చెప్పుకొచ్చారు. దక్షిణాదిలో అలాంటి పరిస్థితి లేవన్నారు. ఇక్కడి ప్రజలు తక్కువ మంది సంతానాన్ని కలిగి ఉంటారని మనసులోని మాట బయటపెట్టారు. కొంతమంది పిల్లలను కనడానికి ఇష్టపడటం లేదన్న విషయాన్ని గుర్తు చేశారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ రోజు ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు. ఈ సందర్భంగా మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ గతంలో అధిక సంతానం వద్దని తాము చెప్పామని అన్నారు. పిల్లలు లేకుంటే భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పవన్నది సీఎం చంద్రబాబు మాట.
ఎంతమంది ఉన్నా ఇస్తా.. సెలవులు ఖాయం
ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అందరికీ తల్లికి వందనం ఇస్తామని మరోసారి స్పష్టం చేశారు ముఖ్యమంత్రి. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. ఇద్దరు పిల్లలకు ప్రసూతి సెలవులు ఇప్పటివరకు ఇస్తున్నారు. ఇకపై ఎంతమందిని పిల్లలను కన్నా ప్రసూతి సెలవులు మంజూరు చేస్తామని ప్రకటించారు. వీటితోపాటుగా ఇతర ప్రయోజనాలను కల్పిస్తామని చెప్పకనే చెప్పేశారు. ఈ లెక్కన ఉద్యోగాలు చేసే మహిళలకు అన్ని కాన్పులకు ప్రసూతి సెలవులు ఇవ్వడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
ALSO READ: తిరుమలలో ఈ-కేవైసీ, శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు
అసలు విషయానికొద్దాం. సాధారణంగా మహిళా ప్రభుత్వ ఉద్యోగినికి రెండు కాన్పులకు మాత్రమే ప్రసూతి సెలవులు ఇప్పటివరకు ఇస్తున్నారు. ఆరు నెలల జీతంతో కూడిన ప్రసూతి సెలవులు ఇస్తున్నారు. ఎక్కువ మంది పిల్లల్ని కనాలని సూచిస్తున్న ముఖ్యమంత్రి, అన్ని కాన్పులకు ప్రసూతి సెలవులు ఇస్తామని మహిళా దినోత్సవం రోజున వెల్లడించారు. ఒక విధంగా చెప్పాలంటే మహిళా ఉద్యోగులకు ఇదొక తీపి కబురు అన్నమాట.
అంతకుముందు హోంమంత్రికి
అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శుక్రవారం జరిగాయి. ఈ కార్యక్రమానికి హోం మంత్రి అనిత ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన హోం మంత్రి, మహిళా పోలీసులు సందేహాలు ఏమైనా ఉంటే అడగాలంటూ అన్నారు. దీంతో సదరు మహిళా కానిస్టేబుల్ హోంమంత్రి అనితకు ఓ ప్రశ్న వేశారు.
పిల్లలను కనాలని చెబుతున్నారు, ఇప్పటివరకు రెండు కాన్పులకు మాత్రమే ప్రసూతి సెలవులు ఇస్తున్నారని, మూడో కాన్పుకు ఇస్తారా అని ప్రశ్నించారు సదరు కానిస్టేబుల్. మంచి ప్రశ్న అడిగావంటూ సదరు కానిస్టేబుల్‌ను మెచ్చుకున్నారు మంత్రి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తాను తీసుకెళ్తానని హామీ నిచ్చారు.
కొద్దిగంటలకే సీఎం చంద్రబాబు.. అన్ని కాన్పులకు ప్రసూతి సెలవులు ఇస్తామని ప్రకటన చేశారు. రానున్న రోజుల్లో దేశం వృద్దాప్య సమస్యను ఎదుర్కోకుండా ఉండేలా కుటుంబ నియంత్రణకు దూరంగా ఉండాలన్నారు. జనాభా నియంత్రణ వల్ల పాశ్చాత్య దేశాల్లో అనేక సమస్యలు మొదలయ్యాయని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలుంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అనర్హులు అనే నిబంధనను ఎత్తివేసింది.
యువ భారత్ లక్ష్యంగా, పాప్యులేషన్ మ్యానేజ్మెంట్ గురించి గత కొంత కాలంగా విస్తృత ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, దీనికి అనుగుణంగా ఈ మధ్య కొన్ని కీలక నిర్ణయాలు ప్రకటిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే స్థానిక… pic.twitter.com/0b7hY0Lilk
— Telugu Desam Party (@JaiTDP) March 8, 2025