CM Chandrababu: వాన.. వరద.. కృష్ణా ఉధృతి.. ఈ సీజన్‌లో ప్రకృతి తన శక్తి చూపిస్తోంది. ఆ శక్తి ముందే ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ఎటు చూసినా మబ్బుల దండు, ఎప్పుడెప్పుడు కురుస్తుందో అన్నట్టుగా వాన గర్జనలు.. లోతట్టు ప్రాంతాల్లో ప్రజల్లో ఆందోళన.. మరోవైపు కృష్ణా పరివాహక ప్రాంతం నుంచి వరద ప్రవాహాల రెడ్ అలర్ట్ హెచ్చరికలు. ఇలాంటి సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా రంగంలోకి దిగారు. రాష్ట్రం నిండా కురుస్తున్న భారీ వర్షాల పరిస్థితిని మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఏ ప్రాంతం కూడా నిర్లక్ష్యం కాకూడదని, ప్రతి చర్య వేగంగా, సమర్ధంగా ఉండాలని ఆయన ఆదేశించారు.
బుధవారం సీఎం క్యాంపు కార్యాలయంలో అత్యవసర సమీక్షా సమావేశం జరిగింది. మంత్రులు వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, సీఎస్ విజయానంద్‌తో పాటు విపత్తు నిర్వహణ, వ్యవసాయం, జలవనరులశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం వచ్చే రెండు మూడు రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు.
కృష్ణా పరివాహక ప్రాంతంలో వాగులు, వంకల నుంచి వచ్చే ఆకస్మిక వరదలను ముందుగానే గుర్తించి దిగువన ఉన్న ప్రజలకు సమాచారం అందించాల్సిందిగా సూచించారు. రేపటికల్లా కృష్ణా నదిలో 5 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉందని అధికారులు వివరించగా, ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ నుంచి 3.09 లక్షల క్యూసెక్కుల నీటిని 35 గేట్లు ఎత్తి విడుదల చేస్తున్నట్టు తెలిపారు. కాలువలకు 5 వేల క్యూసెక్కుల నీటిని పంపుతున్నట్టు కూడా వివరించారు.
దీనిపై సీఎం స్పందిస్తూ.. ప్రకాశం బ్యారేజీ దిగువన ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలను వెంటనే అప్రమత్తం చేయాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎగువన నాగార్జునసాగర్, పులిచింతల గేట్లు కూడా ఎత్తి నీరు విడుదల చేస్తున్నందున జాగ్రత్తలు మరింత పెంచాలని సూచించారు.
వరద నీటిని వృథా చేయకూడదు
ఎగువ నుంచి వచ్చే వరద నీటిని సమర్ధంగా వినియోగించుకోవాలని సీఎం ప్రత్యేకంగా ఆదేశించారు. రోజుకు 4 టీఎంసీల చొప్పున నీటిని తరలించి సోమశిల, కండలేరు ప్రాజెక్టులను నింపాలని చెప్పారు. సముద్రంలోకి పోకుండా ఆ నీటిని నిల్వ చేసుకోవడం అత్యవసరమని స్పష్టం చేశారు. మైలవరం పరిసరాల్లో కురిసిన వర్షం బుడమేరు, వెలగలేరులకు భారీగా చేరుతుందని, ఈ నీరు కృష్ణా నదిలోకి డిశ్చార్జ్ అవుతోందని అధికారులు తెలిపారు. బుడమేరు డైవర్షన్ ఛానల్ పనులు వేగంగా జరుగుతున్నాయని, రూ.40 కోట్లతో బుడమేరు-వెలగలేరు యూటీ నిర్మాణానికి ఆయన అనుమతి ఇచ్చారు.
Also Read: Bus accident: రాత్రి వేళ బస్సు బోల్తా… క్షణాల్లో కేకలు, అరుపులు.. ఎక్కడంటే?
గండ్లు పడకుండా గట్లు పటిష్టం చేయాలి
భారీ వర్షాల కారణంగా కొండవీటి వాగు, పాల వాగుల నుంచి వచ్చే నీటిని 4 పంపుల సాయంతో కృష్ణా నదిలోకి ఎత్తి పోస్తున్నామని అధికారులు వివరించారు. వర్షాకాలంలో కాలువల్లో నీటి ప్రవాహం అడ్డంకులు లేకుండా ఉండేలా గుర్రపు డెక్క, తూడును తొలగించాలని సీఎం ఆదేశించారు. కాలువలు, చెరువులకు గండ్లు పడకుండా గట్లను పటిష్టం చేయడం అత్యవసరమని ఆయన స్పష్టం చేశారు.
జిల్లా కలెక్టర్లు పరిస్థితిని నిమిషానికోసారి పరిశీలిస్తూ రైతులకు తక్షణ సమాచారం అందించాలని సీఎం ఆదేశించారు. భూగర్భ జలాలను రీఛార్జ్ చేసేలా చెరువుల వద్ద ట్రెంచ్‌లు తవ్వే ప్రణాళికలు సిద్ధం చేయాలని పంచాయతీరాజ్, అటవీ శాఖ అధికారులకు సూచించారు. ఈ పనులను గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా వేగంగా అమలు చేయాలని చెప్పారు.
ప్రజల ప్రాణాలు, ఆస్తులు కాపాడడమే ప్రథమ కర్తవ్యమని, దానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఈ సమీక్షలో స్పష్టం చేశారు. వర్షం ఎక్కడ పడితే అక్కడ కురుస్తోంది, కానీ ప్రభుత్వ యంత్రాంగం మాత్రం ఎక్కడా వెనుకడుగు వేయడం లేదు.. ఇదే ఈ సమీక్షా సమావేశం ఇచ్చిన స్పష్టమైన సందేశం.