గత ప్రభుత్వంలో పెట్టుబడిదారులు రాష్ట్రానికి వస్తే నాయకులు వాటాలు అడిగేవారని, ఈ ప్రభుత్వం పెట్టుబడిదారుల్ని అభివృద్ధిలో ప్రజలకు ఏవిధమైన వాటా ఇస్తారని అడుగుతోందని.. రెండు ప్రభుత్వాలకు తేడా అదేనని అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. గత ప్రభుత్వం ఏపీని అప్పుల్లో నెట్టి వేసిందన్నారు. ఆ పరిస్థితినుంచి బయటపడేయడానికే పీ4 విధానం అమలు చేస్తున్నామని వివరించారు.
అమరావతిలో పీ-4 కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబుతో కలసి ప్రారంభించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. పీ-4 లోగో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ద్వారా 30 లక్షల కుటుంబాల్లో మార్పులు వస్తాయని చెప్పారాయన. కష్టాల్లో ఉన్న కుటుంబాలకు కాస్త ధైర్యం చెబితే, అదే వారికి కొండంత అండ అని అన్నారు పవన్. తెలుగు ప్రజలు బాగుండాలనేదే తన కోరిక అని, సీఎం చంద్రబాబు కూడా నిరంతరం తెలుగు ప్రజల కోసమే పనిచేస్తున్నారని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులను నిర్లక్ష్యం చేసిందని, నిర్మాణ సామగ్రి రేట్లు పెంచేయడం ద్వారా కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని వివరించారు పవన్. గత ఐదేళ్లు రాష్ట్రం తీవ్ర కష్టాల్లో ఉందని చెప్పారు. ఆ కష్ట నష్టాలనుంచి రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించేందుకే తాను చంద్రబాబుకు మద్దతిచినట్లు తెలిపారు.
విజనరీ బాబు
చంద్రబాబుని మరోసారి పొగడ్తల్లో ముంచెత్తారు పవన్ కల్యాణ్. ఆయన సమర్ధ నాయుకుడని, అనుభవజ్ఞులు కాబట్టే చంద్రబాబుకి తాను మద్దతిచ్చానని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీలో కార్మికుల జీవితాల్లో మార్పు వచ్చిందని తెలిపారు. మనమంతా చిన్న చిన్న గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళమేనని, ఎదిగే క్రమంలో చిన్న చిన్న సలహాలు, కాస్త ఆసరా మనందరికి ధీమా ఇస్తుందని చెప్పారాయన. ఆ ధీమా కోసమే పీ-4 అమలు చేస్తున్నట్టు చెప్పారు. సీఎం చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రం స్వర్ణాంధ్రగా అభివృద్ది చెందుతుందని అన్నారు పవన్ కల్యాణ్. ఒక సాధారణ నాయకుడు రాజకీయాలు, ఎన్నికల గురించే ఆలోచిస్తాడని, కానీ చంద్రబాబు లాంటి నాయకుడు, విజనరీ నేత.. రాబోయే తరం గురించి ఆలోచిస్తారని పవన్ ప్రశంసించారు. అలాంటి నాయకులు అరుదుగా ఉంటారని, ఏపీకి చంద్రబాబు మార్గదర్శకుడుగా ఉన్నారని చెప్పారు.
గతంలో కూడా సందర్భం వచ్చినప్పుడల్లా చంద్రబాబు విజనరీ నేత అని ప్రశంసించేవారు పవన్ కల్యాణ్. ఇప్పుడు పీ-4 అనేది పూర్తిగా ఆయన బ్రెయిన్ చైల్డ్ కావడంతో బాబు ఆశయాన్ని, ఆలోచనని మెచ్చుకున్నారు. దూరదృష్టితో చంద్రబాబు పనిచేస్తారు కాబట్టే తాను ఎన్నికల్లో ఆయనకు మద్దతిచ్చానన్నారు. ఆయన సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు ఏపీలో కూటమి పార్టీల్లో ఎలాంటి పొరపొచ్చాలు రాకుండా ఉండేందుకే పవన్ పదే పదే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని తెలుస్తోంది. పై స్థాయిలో నేతల మధ్య సయోధ్య ఉన్నా, కింది స్థాయిలో పార్టీల మధ్య కూడా ఆ అవగాహన ఉండాలి. కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలకు ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతోటే పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తున్నామని పదే పదే చెబుతున్నారు. కూటమి మధ్య విభేదాలు రాకుండా చూసుకుంటున్నారు.