CM Chandrababu: దేశంలో రాజకీయాలు పూర్తిగా మారిపోయాయా? ముఖ్యంగా ఏపీ మరింత దారుణంగా తయారయ్యాయా? సోషల్ మీడియా మరీ దారుణంగా తయారైందా? రాజకీయాల్లోకి ఆర్థిక ఉగ్రవాదులు వస్తున్నారా? ముమ్మాటికీ అవుననే అంటున్నారు సీఎం చంద్రబాబు. ముఖ్యమంత్రి మాటల వెనుక అర్థం ఏంటి? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావడంతో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించింది. ఎంపీలు, మంత్రులు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు హాజరయ్యారు. నేతలను ఉద్దేశించి సీఎ చంద్రబాబు మాట్లాడారు.
రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా పని చేస్తున్నామని చెప్పిన అధినేత, సుపరిపాలనలో తొలి అడుగు వేశామన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని చెబుతూనే వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచన చేశారు. సంక్షేమం అంటే ఏంటో చూపించామని, చేసిన పనిని ప్రజలకు చెప్పడం ముఖ్యమన్నారు.
ఇదే క్రమంలో ఏపీ రాజకీయాలపై తనదైన శైలిలో కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు పూర్తిగా మారిపోయాయని చెప్పకనే చెప్పారు. రాజకీయాల్లో ఆర్థిక ఉగ్రవాదులు వస్తున్నారని మనసులోని మాట బయపెట్టారు. 2019లో పార్టీ గెలిచి ఉంటే రాష్ట్రం మరోలా ఉండేదని వెల్లడించారు. రౌడీషీటర్, గంజాయి బ్యాచ్‌ను ప్రతిపక్ష నేత పరామర్శించడం ఎక్కడైనా చేశామా అంటూ ప్రశ్నించారు.
ALSO READ: అన్నదాత సుఖీభవ..రైతులు కళ్లలో ఆనందమే
పల్నాడు జగన్ టూర్‌లో జరిగిన ఓ విషయాన్ని బయటపెట్టారు. కారు కింద పడి మనిషి చనిపోతే ఆయనను బయట పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చిన ఓ పాస్టర్ ప్రమాదంలో చనిపోతే.. ప్రభుత్వమే చంపిదని తప్పుడు ప్రచారం చేశారని దుయ్యబట్టారు. సోషల్ మీడియా మరీ దారుణంగా ఉంటోందని చెప్పకనే చెప్పారు.
వైసీపీ హయాంలో ఏపీ ధ్వంసమైందన్నారు. ఐదేళ్లపాటు కేంద్ర పథకాలు పక్కదారి పట్టించారని ఆరోపించారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలు మనం ఏనాడూ చేయలేదన్నారు. ఏపీకి కేంద్రం బాగా సాయం చేస్తోందన్నారు. సమస్యలన్నీ పరిష్కారం అయ్యాయని చెప్పలేదని, ఇంకా చాలానే ఉన్నాయని తెలిపారు.
సర్వీసు, ఇండస్ట్రీస్, వ్యవసాయ రంగాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన విషయాన్ని గుర్తు చేశారు. అమరావతి నిర్మాణానికి 15 వేల కోట్ల రూపాయలు మంజూరు చేశామని, రాజధాని ప్రాంతంలో పనులు జరుగుతున్నాయని వివరించారు. పోలవరానికి కేంద్రం రూ.12,500 కోట్లు ఇచ్చిందని ఏడాదిన్నరలో ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తామని క్లారిటీ ఇచ్చేశారు.
2027 పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామన్నారు. ఐటీ విప్లవాన్ని అందిపుచ్చుకున్నామని చెబుతూనే, వాట్సప్ గవర్నెన్స్‌తో సుమారు 500 సేవలు ఆన్‌లైన్‌లో అందిస్తున్నట్లు వెల్లడించారు. రాబోయే ఆగస్టు నాటికి 703 సేవలు ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల చాలావరకు అవినీతి తగ్గుతుందని, ప్రజలకు మంచి పాలన అందించే అవకాశం ఉంటుందన్నారు.