CM Chandrababu: ఆంధప్రదేశ్ రాష్ట్రంలో తిరంగ యాత్ర వైభవంగా నిర్వహించారు. విజయవాడలో ఈ సాయంత్రం తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు. కూటమి సర్కార్ నిర్వహించిన ఈ తిరంగా ర్యాలీలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గబాటి పురంధేశ్వరి పాల్గొన్నారు.
అయితే, ఈ తిరంగా యాత్రకు ప్రజలు భారీగా పోటెత్తారు. ఈ నేపథ్యంలో విజయవాడలో నిర్వహించిన తిరంగా ర్యాలీలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ముందుగా పాకిస్థాన్ కాల్పుల్లో రాష్ట్రానికి చెందిన తెలుగు వీర జవాన్ మురళీనాయక్ వీర మరణం పొందారని గుర్తుచేశారు. మురళీ నాయక్ చేసిన త్యాగానికి దేశం రుణపడి ఉంటుందని చెప్పారు. ఈ క్రమంలో ఇండియన్ ఆర్మీపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసల వర్షం కురిపించారు. త్రివిద ధళాలు దాయాది దేశాన్ని ముప్పుతిప్పలు పెట్టాయని అన్నారు.
ఉగ్రవాదం అంతం చేయడానికి రక్షణ దళాలు చేస్తున్న పోరాటానికి సెల్యూట్ చేస్తున్నానని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అంతా గర్వించదగ్గ దళాలు మన దేశానికి ఉండడం గర్వకారణమని చెప్పారు. జాతీయ జెండాను చూడగానే దేశభక్తి ఉప్పొంగుతుందని తెలిపారు. జాతీయ జెండాను రూపొందించిన పింగళి వెంకయ్య మన ప్రాంతం వారే కావడం మన అదృష్టమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఇక పహల్గమ్ అనగానే మనలో ఖబర్దార్ అనే హెచ్చరించే పౌరుషం వస్తోందని అన్నారు. ఈ తిరంగా ర్యాలీలో జాతీయ జెండాలు చేతబట్టి దేశభక్తి నినాదాలు చేస్తూ సైనికులకు సీఎం మద్దతు తెలిపారు. పాక్ ఉగ్రవాదుల స్థావరాలపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ చేపట్టిన తిరంగా యాత్ర వైభవంగా నిర్వహించారు.
తిరంగా ర్యాలీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా మాట్లాడారు. కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడితో సహా భారత్‌లో జరిగిన అనేక ఉగ్రదాడుల వెనుక దాయాది దేశం పాకిస్థాన్ హస్తం ఉందని ఆరోపించారు. పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలకు శిక్షణ, ఆయుధాలు, ఆశ్రయం ఇస్తోందని ఆయన ఫైరయ్యారు. తాజ్ హోటల్ పై జరిగిన ఉగ్రదాడిలో పట్టుబడిన కసబ్ ఎంతోమందిని అమాయకులను చంపేశాడని.. ఇలాంటి దారుణాల వెనుక ఉన్న పాక్ ను ఎప్పటికీ క్షమించే ప్రసక్తే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమ దేశాన్ని ఎలుకునే శక్తి లేక, మన దేశపు అభివృద్ధిని చూసి ఓర్వలేక, మనల్ని వెనక్కి నెట్టాలని ఈ దాడులు చేస్తున్నారని ఆయన ఫైరయ్యారు. దేశ విభజన జరిగిన నాటి నుంచి మనం ప్రశాంతంగా లేమని ఆయన చెప్పారు. సుమారు 5000 మందితో సాగిన ఈ యాత్రలో జాతీయ జెండాలతో దేశభక్తి నినాదాలు చేస్తూ, ఉగ్రవాదాన్ని అంతం చేయాలని, పీవోకేని ఖాళీ చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. దేశ భద్రత కోసం జనసేన శ్రేణులు సర్వమత ప్రార్థనలు, సైనికులకు ఆధ్యాత్మిక మద్దతు అందించాలని ఆయన పిలుపునిచ్చారు.