Cm Chandrababu on Garbage Tax Cancellation : నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చెత్త పన్ను వసూలు చేయకూడదని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. తక్షణమే చెత్త పన్నును రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. మచిలీపట్నంలో గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన స్వచ్ఛతే సేవ ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొన్న సీఎం, చెత్త నుంచి సంపద సృష్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు.
చెత్త నుంచి కరెంట్ ఉత్పత్తి చేయడం ఒక ఎత్తు అయితే, ఆ చెత్త నిల్వలు ఆశించిన స్థాయిలో లేకపోతే వాటితో కాంపోస్ట్ ఎరువులు తయారు చేస్తామన్నారు. దీంతో అవి పంటలకు ఉపయోగపడి, అధిక దిగుబడి ఇస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో ఇలాంటి కార్యక్రమాలు చేసి ఎక్కడ కూడా చెత్తను వేస్ట్ చేయకుండా అవసరమైతే రీసైకిల్ చేశామని చెప్పుకొచ్చారు.
చెత్తలో రెండు రకాలు ఉంటాయని, ఒకటి తడి చెత్త, రెండోది పొడి చెత్త అని సీఎం చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో 2 లక్షలకు పైగా వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించామని, దీంతో ఏపీని ఓడీఎఫ్ రాష్ట్రంగా మార్చామని వివరించారు.
స్వచ్ఛాంధ్రప్రదేశ్ స్ఫూర్తితోనే మనం ముందుకెళ్లామని గుర్తు చేశారు. నీతి ఆయోగ్‌లో స్వచ్ఛ భారత్‌పై ఉప సంఘం ఏర్పాటు చేశారన్న సీఎం, దానికి తానే ఛైర్మన్‌గా ఉన్నట్లు చెప్పారు. 2019లో ఏర్పడిన ప్రభుత్వం అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించిందన్నారు.
also read : ఆ హీరోయిన్ల జీవితాలతో కేటీఆర్ ఆడుకున్నారు.. మంత్రి కొండా సురేఖ కామెంట్స్
రోడ్లపై పేరుకుపోయిన 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను ఏడాదిలోగా పూర్తిగా శుభ్రం చేయించే దిశగా కార్యచరణ రూపొందించాలని పురపాలక శాఖ మంత్రి నారాయణకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారంటే అందుకు కారణం స్వచ్ఛ సేవకులేనని, వాళ్ల విలువైన సేవలకు వెలకట్టలేమని కీర్తించారు. 2029 నాటికి స్వచ్ఛ్ ఆంధ్రప్రదేశ్ సాధించాలంటే, ప్రతి వ్యక్తి స్వచ్ఛ సేవకులుగా అవతరించాలన్నారు. త్వరలోనే జాతీయ జెండా రూపశిల్పి అయిన పింగళి వెంకయ్య పేరిట మెడికల్ కాలేజీ స్థాపిస్తామన్నారు.