AP Cabinet – Nagababu: మెగా బ్రదర్ నాగబాబుకు అదృష్టం రన్నింగ్ చేసుకుంటూ తలుపు తట్టిందని చెప్పవచ్చు. అన్న మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులతో నాగబాబు సినిమా రంగంలో రాణిస్తే, తమ్ముడు పవన్ చొరవతో పొలిటికల్ గా కూడా హిట్ కొట్టారు నాగబాబు. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు భేటీ కాగా, నాగబాబు విషయంపై సుధీర్ఘ చర్చ సాగిందని టాక్.
ఇటీవల మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. అది కూడా ప్రకటన విడుదల చేసి మరీ చెప్పడం విశేషం. జనసేన పార్టీని స్థాపించిన సమయం నుండి ప్రత్యక్ష రాజకీయాల్లో నాగబాబు ఉన్నారు. పవన్ కళ్యాణ్ కు తోడుగా జనసేన పార్టీలో లుకలుకలను సర్ది చెప్పడంలో నాగబాబు పాత్ర కీలకమని క్యాడర్ అంటుంటారు. అందుకే కాబోలు అన్న నాగబాబుకు పవన్ కళ్యాణ్ ఎలాగైనా కీలక పదవి దక్కేలా చేయాలని నిర్ణయించుకున్నారు.
ఈ నేపథ్యంలో తొలుత నాగబాబుకు రాజ్యసభ పదవి ఖాయమని వార్తలు వినిపించాయి. ఆ తర్వాత రాజ్యసభ సీటు లేదని బహిర్గతం కాగా, ఏకంగా ఏపీ కేబినెట్ లో బెర్త్ ఖరారు చేశారు సీఎం చంద్రబాబు. దీనితో వెతుకుతున్న తీగ కాలికి తగిలినట్లు, మంత్రి పదవి నాగబాబుకు దక్కిందని చెప్పవచ్చు.
సీఎం చంద్రబాబు తో పవన్ కళ్యాణ్ భేటీ కాగా, అందులో ప్రధానంగా నాగబాబుకు ఇచ్చే మంత్రిత్వ శాఖలపైనే చర్చ సాగిందని తెలుస్తోంది. ముందుగా నాగబాబుకు ఎమ్మెల్సీ పదవిచ్చి, ఆ తర్వాత కేబినెట్ లోకి తీసుకోనున్నారు. అది కూడా సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ ఇస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ శాఖలకు జనసేనకు చెందిన కందుల దుర్గేష్ మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీటిని నాగబాబుకు అప్పగించి, దుర్గేష్ కు పవన్ కళ్యాణ్ వద్ద ఉన్న అటవీ శాఖను అప్పగించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
Also Read: Pitapuram: పవన్ ఇలాఖాలో.. కలెక్టర్ పై కాంట్రాక్టర్ ఆగ్రహం.. ఆ బిల్లుల కోసమేనట!
ఏదిఏమైనా పర్యాటక నాగబాబుకు అప్పగిస్తే, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మంత్రి గా గల రోజాకు చెక్ పెట్టాలన్నది కూటమి టార్గెట్ గా తెలుస్తోంది. మాజీ మంత్రి రోజా టూరిజం మంత్రిగా అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, నాగబాబు మంత్రిగా భాద్యతలు చేపడితే రోజాకు ఇబ్బందులు తప్పవని కూడా చెబుతున్నారు జనసేన పార్టీ క్యాడర్. ఇంతకు నాగబాబుకు ఏ శాఖ కేటాయిస్తారో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.