Ponguleti Srinivas Reddy : గత కొంత కాలంగా తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం పడిపోయిందన్న ప్రచారంలో వాస్తవం లేదని.. కావాలనే కొంత మంది ఈ తీరుగా ప్రచారం చేస్తున్నారంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. హైదరాబాద్ సహా ఇతర నగరాల్లో రియల్ ఎస్టేట్ రంగం చాలా బాగుందని, ఎలాంటి డోకా లేదని వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన మంత్రి పొంగులేటి.. రియల్ ఎస్టేట్ రంగం, రాష్ట్ర అప్పులు సహా ప్రభుత్వంపై వ్యతిరేకత వంటి వివిధ అంశాలపై మాట్లాడారు. అనేక ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు.
హైదరాబాద్ లోని చెరువులు, కుంటల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అక్రమ నిర్మాణాల కూల్చివేతల్ని సమర్థించిన పొంగులేటి.. వాటి వల్ల పెట్టుబడి దారుల్లో ఎలాంటి భయాందోళనలు లేవని స్పష్టం చేశారు. కొన్ని రోజులుగా.. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైయ్యిందని, ప్రభుత్వ విధానాలతో ఇన్వెస్టర్లల్లో భయం నెలకొందన్న ప్రచారంలో వాస్తవం లేదన్న మంత్రి.. అవ్వన్నీ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకేనని అన్నారు.
అక్కడి నుంచి రియల్ ఎస్టేట్ మొత్తం ఆంధ్రా తరలిపోతుందని చాలా మంది వ్యాఖ్యానిస్తున్నారని, కానీ.. ఇటీవల వరదల్ని మర్చిపోవద్దని గుర్తుచేశారు. కొన్ని రోజుల క్రితం విజయవాడ బుడమేరుకు వచ్చిన వదరలతో విపరీతమైన నష్టం వాటిల్లింది. అక్కడి అనేక ప్రాంతాలు పూర్తిగా రోజుల తరబడి నీటిలో మునిగిపోగా.. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం నానా ఇబ్బందులు పడింది. ఆ విషయాన్ని గుర్తు చేసిన మంత్రి పొంగులేటి.. అలాంటి పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు కచ్చితంగా ఆలోచిస్తారని వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఐతే హైదరాబాద్ లేదా బెంగళూరు వైపు పెట్టుబడిదారులు ఆసక్తి చూపిస్తున్నారని అన్నారు. చంద్రబాబు రాగానే అంత అటు వైపు వెళతారనే వాదన సరైంది కాదని వ్యాఖ్యానించారు. అమరావతిలో వరద వల్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్లకు బయం పట్టుకుందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైడ్రా భయం ప్రజల్లో లేదన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి.. హైడ్రా గురించి మొదట్లో తప్పుడు ప్రచారం జరిగినా ఇప్పుడు అందరికీ నిజం తెలిసింది అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ అప్పులు, ఖర్చుల విషయంలో బీఆర్ఎస్ పార్టీ అబద్దాలు చెబుతోందని మండిపడ్డారు. అసలు వారి హయంలో చేసిన అప్పులుపై నిజాలు తెలుసుకోవాలని సూచించారు. ప్రభుత్వ అప్పులంటే… కేవలం రాష్ట్ర ప్రభుత్వం పేరుతో చేసినవి మాత్రమే కాదని, కార్పొరేషన్ల పేరుతో చేసిన అప్పుల్ని ప్రభుత్వమే తీర్చాలని తెలిపారు. అవన్నీ కలిసి ప్రభుత్వం చేసిన అప్పు ఎంతో బీఆర్ఎస్ నేతలే చెప్పాలని డిమాండ్ చేసారు. పదేళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో ఇష్టారాజ్యంగా అప్పులు తెచ్చిన కేసీఆర్.. రాష్ట్ర ప్రజల నెత్తిపై రూ. 7 లక్షల 20వేల కోట్ల అప్పులు మోపారని దుయ్యబట్టారు.పైగా.. ఇప్పుడు అన్ని అప్పులు లేవని చెప్పడం వారి అమాయకత్వానికి నిదర్శనమని అన్నారు.
ప్రస్తుత శాసనసభ సమావేశాలపై స్పందించిన మంత్రి పొంగులేటి.. సభలో ఎవరి పాత్ర వారిదేనని అన్నారు. సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇవ్వడం వారి హక్కు అని వ్యాఖ్యానించిన మంత్రి పొంగులేటి.. వారికున్న హక్కుల్ని వాడుకోవచ్చని, వాటిపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. ఇక కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రాకపోవడాన్ని ప్రశ్నించిన మంత్రి పొంగులేటి.. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే వ్యక్తిగతంగా కూర్చుని మాట్లాడాలనే కోరిక ఉందని అన్నారు.
Also Read : అద్భుతం, ఆశ్చర్యం ఈ దృశ్యం.. హైడ్రా ఎఫెక్ట్ తో విదేశీ పక్షుల కోలాహలం..
కాంగ్రెస్ ఏడాది పాలనపై స్పందించిన మంత్రి పొంగులేటి.. ప్రభుత్వంపై ఎలాంటి వ్యతిరేకత లేదని అన్నారు. గతంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ ఇలానే ప్రచారం జరిగిందని కానీ.. రెండోసారి వైఎస్ఆర్ గెలిచారని పేర్కొన్నారు. అప్పుడు కూడా రెండు, మూడు ఏళ్లల్లో అన్ని సర్దుకున్నాయని, వర్షాలు బాగా పడ్డాయని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా.. రెండు, మూడేళ్ల అయితే పరిపాలన కుదురుకుంటుందని తెలిపారు.