CM Chandrababu: ప్రజలందరికీ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే నాణ్యమైన వైద్యం అందించేందుకు కృషి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులను ఆదేశించారు. కలెక్టర్లతో జరిగిన సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ, ఆసుపత్రుల పని తీరుపై పలు కీలక సూచనలు చేశారు. ఓపెన్ మార్కెట్‌తో పోటీ పడేందుకు ప్రయత్నించడంతో పాటు ప్రజారోగ్యానికి పెద్ద పీట వేయాలని అన్నారు. సామాన్యులకు మెరుగైన వైద్యం అందుబాటులోకి రావాలని, ఖర్చు చేసిన ప్రతి రూపాయికి తగిన వైద్యం అందాలని ఆకాక్షించారు.
Also Read: అధికారులకు సీఎం చంద్రబాబు వార్నింగ్.. స్పీడ్ పెంచాలంటూ.. త్వరలో తనిఖీలు..
కార్పొరేట్ ఆసుపత్రులు లాభాలు ఆశించి మెరుగైన వైద్యం అందిస్తున్నప్పుడు మనం ఏ లాభాపేక్ష లేకుండా మెరుగైన వైద్యం ఎందుకు అందించలేకపోతున్నామని అధికారులను సీఎం ప్రశ్నించారు. ఈ అంశంపై దృష్టి సారించాలని సూచించారు. రాబోయే రోజుల్లో ప్రయివేట్ ఆసుపత్రులతో ప్రభుత్వ ఆసుపత్రులు పోటీ పడాలని దీనిని సవాల్‌గా తీసుకుని యంత్రాంగం పనిచేయాలని అన్నారు. అంతే కాకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు, వసతులు, విశాలమైన స్థలం అన్నీ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రయివేట్ ఆసుపత్రులకు దీటుగా వైద్యం అందించాలని ఆదేశించారు.