రాజకీయ పార్టీలకు మతాన్ని ఆపాదించలేం కానీ.. మా నాయకుడు ఫలానా మతోద్ధారకుడు అని వారికై వారు చెప్పుకుంటే మాత్రం కాస్త ఆలోచించాల్సిందే. ఇప్పుడు ఏపీలో ఇదే జరుగుతోంది. జగన్ అసలు సిసలైన హిందూ జనోద్ధారకుడంటూ ఆమధ్య వైసీపీ సోషల్ మీడియా ఊదరగొట్టింది. హిందూ ధర్మ పరిరక్షకుడంటూ జగన్ కి ఒక ట్యాగ్ ఇచ్చి విపరీతమైన ప్రచారం చేశారు. మరోవైపు ముస్లింల రక్షకుడు జగన్ అంటూ మరో ప్రచారం కూడా ఏపీలో జోరుగా సాగుతోంది. వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకించి ముస్లిం సమాజానికి జగన్ మేలు చేశారని, వారి పక్షాన నిలబడ్డారని వైసీపీ నేతలంటున్నారు. చివరకు ఈ రెండు ప్రచారాలు వికటించేలా ఉన్నాయనేది విశ్లేషకుల వాదన.
హిందూ ధర్మ పరిరక్షకుడంటే..?
జగన్ ని హిందూ ధర్మ పరిరక్షకుడని చెప్పుకుంటున్నారు వైసీపీ నేతలు. వాస్తవానికి ఏపీలో మత రాజకీయాలకంటే కుల రాజకీయాలే ఎక్కువ. అందుకే జగన్ ని ఓ వర్గం ఓన్ చేసుకుంది, టీడీపీకి మరో సామాజిక వర్గం మద్దతుగా ఉంది. అయితే ఇక్కడ జగన్ హిందూ ధర్మ పరిరక్షకుడని చెప్పుకోవడమే కాస్త విశేషం. తిరుమలకి సతీసమేతంగా వెళ్లలేదనే విషయంలో ఇప్పటికీ జగన్ పై ట్రోలింగ్ నడుస్తోంది. ఏడుకొండల విషయంలో జగన్ తండ్రి దివంగత నేత వైఎస్ఆర్ పై కూడా అప్పట్లో తీవ్ర విమర్శలు చెలరేగాయి. జగన్ ఇంట్లో జరిగే ఏ కార్యక్రమం అయినా హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం జరగవని, అలాంటప్పుడు జగన్ ని హిందూ ధర్మ పరిరక్షకుడని ఎలా అనుకుంటారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. జగన్ హయాంలోనే ఏపీలో హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయని, రథాలు దగ్ధమయ్యాయని అంటున్నారు. టీడీపీ చైర్మన్లుగా కరుణాకర్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి నియామకాల సమయంలో కూడా జగన్ పై తీవ్ర విమర్శలు చెలరేగాయి.
వైసీపీ ప్రచారం బూమరాంగ్..
అధికారంలో ఉన్నప్పుడు జగన్, తనకి తాను ఎప్పుడూ హిందూ పరిరక్షకుడిని అని చెప్పుకోలేదు. పోనీ ఆ పార్టీ నేతలు కూడా జగన్ ని ఆ కోణంలో హైలైట్ చేయాలనుకోలేదు. ప్రతిపక్షంలోకి రాగానే వారు చేస్తున్న ప్రచారం కాస్త కొత్తగా ఉంది. టీటీడీపై చేస్తున్న ఆరోపణల్ని కూడా రాజకీయ విమర్శలంటూ వైరి వర్గం కొట్టిపారేస్తోంది. జగన్ హయాంలో టీటీడీలో అపచారాలు అనేకం జరిగాయని, లడ్డూల తయారీలో కల్తీ జరిగిందని టీడీపీ ఆరోపిస్తోంది. తాజాగా గోశాల విషయంలో కూడా వైసీపీ ప్రచారం వారికే బూమరాంగ్ అయింది.
ముస్లింలు జగన్ ని ఆదరిస్తారా..?
ఇక ఏపీలో మైనార్టీ వర్గం అంతా జగన్ వైపు ఉన్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మతతత్వ పార్టీ అయిన బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకున్నప్పుడే వారి పనైపోయిందని అన్నారు కానీ, మైనార్టీలెప్పుడూ ఏకపక్షంగా జగన్ కి సపోర్ట్ చేయలేదు. ఇక వైసీపీ ప్రతిపక్షంలోకి వచ్చాక కూడా ఈ ప్రచారం మరింత ఉధృతంగా సాగుతోంది. వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో జగన్ ముస్లింల పక్షాన నిలబడ్డారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే టీడీపీ మాత్రం వక్ఫ్ బిల్లు విషయంలో సవరణలు తీసుకు రావడంలో సక్సెస్ అయిందనేది ఆ పార్టీ వాదన. ఈ రెండు వాదనలు ఎలా ఉన్నా.. జగన్ బిల్లుని వ్యతిరేకించడం వల్ల ముస్లింలకు వచ్చిన లాభమేమీ లేదు. పార్లమెంట్ ఉభయ సభల్లో బిల్లుకి ఎలాంటి అడ్డు లేకుండా పోయింది. రాజ్యసభలో బిల్లు విషయంలో జగన్ డబుల్ గేమ్ ఆడారనే అపవాదు కూడా ఉంది.
వక్ఫ్ సవరణ బిల్లుని న్యాయస్థానాల్లో సవాలు చేసినా ఫలితం ఉంటుందని అనుకోలేం. అదే సమయంలో వక్ఫ్ బిల్లుకి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన కార్యక్రమాల్ని వైసీపీ తమకి అనుకూలంగా మార్చుకోవాలనుకుంటోంది. అయితే ఈ నిరసనల్ని ఎక్కడా ప్రభుత్వం అడ్డుకోవడం లేదు. టీడీపీ, జనసేనకు చెందిన కార్యకర్తలు, కొందరు నేతలు కూడా నిరసనల్లో పాల్గొనడం ఇక్కడ విశేషం. పార్టీలకతీతంగా జరిగే ఈ నిరసనలు వైసీపీకి ఏమేరకు మేలు చేస్తాయనేది తేలడం లేదు. అటు జగన్ హిందూ ధర్మ పరిరక్షకుడు కాలేకపోయారని, ఇటు వక్ఫ్ బిల్లు విషయంలో డబుల్ గేమ్ ఆడి ముస్లిం వర్గానికి కూడా దూరమయ్యాడని అంటున్నారు ప్రత్యర్థి పార్టీ నేతలు.